జనసేన అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. ఒకటి పశ్చిమగోదావరి జిల్లాలోని భీమవరం నుంచి… మరొకటి విశాఖ జిల్లాలోని గాజువాక నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుత రాజకీయాల్లో రెండు సీట్లలో పోటీ చేస్తున్నవారు చాలా తక్కువ. అగ్రనేతల్లో అప్పట్లో చిరంజీవి తప్ప.. ఇంకెవరూ పోటీ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు, లోకేష్, జగన్ కూడా ఒకే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. పవన్ రెండు సీట్లలో పోటీ చేయడం బలమా…? బలహీనతా..?
ఎందుకైనా మంచిదని రెండు చోట్ల పోటీ చేస్తున్నారా..?
పవన్ కల్యాణ్ రెండు సీట్లలో పోటీ చేయడానికి ప్రధాన కారణంగా.. జనసేన… అందరూ చెప్పే కారణాన్నే తెరమీదకు తీసుకు వస్తోంది. అన్ని ప్రాంతాల ప్రజల ఆమోదాన్ని పొందడానికే ఇలా.. పోటీ చేస్తున్నారని అంటున్నారు. గతంలో… ఎన్టీఆర్ మూడు ప్రాంతాల నుంచి పోటీ చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, తెలంగాణల నుంచి పోటీ చేశారు. అన్ని ప్రాంతాలను.. సమానంగా చూస్తానని చెప్పడానికి ఆయన ఈ ప్రయత్నం చేశారు. అలాగే… ఇందిరాగాంధీ కూడా.. దక్షిణాదిని కూడా… సమంగా చూస్తానని చెప్పేందుకు మెదక్ నుంచి పోటీ చేశారు. ఇలా.. అగ్రనేతలు.. యాక్సెప్టబులిటీ కోసం… రెండు, మూడు చోట్ల నుంచి పోటీ చేస్తారు. అందువల్ల పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీ చేయడాన్ని బలహీనతగా చూడాల్సిన అవసరం లేదు. అయితే.. ఇక్కడ పవన్ కల్యాణ్ ముందు జాగ్రత్త ఎక్కువగా కనిపిస్తోందన్న అభిప్రాయం ఉంది. ఎందుకంటే… రెండూ కోస్తాంధ్ర నుంచే ఉన్నాయి. ఒకటి రాయలసీమ, మరొకటి కోస్తాంధ్ర అయితే.. రెండు ప్రాంతాల్లోనూ తనకు.. ప్రజల మద్దతు ఉందని చెప్పుకునేందుకు బాగుండేది.
రాయలసీమలో ఒక చోట పోటీ చేయవచ్చు కదా..!
కానీ పవన్ కల్యాణ్… సామాజికవర్గ పరంగా అనుకూలంగా ఉండే.. రెండు కోస్తాంధ్ర నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారు. బలమైన నాయకులు సభలో ఉండాలి. అధికారంలో అయినా.. ప్రతిపక్షంలో అయినా.. బలమైన నాయకులు ప్రజాప్రతినిధులుగా ఉంటేనే.. ప్రజాస్వామ్యం బాగుంటుంది. పవన్ కల్యాణ్, రఘువీరా రెడ్డి లాంటి వాళ్లు సభలో ఉండాలి. ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్న దానిపై చట్టం వారికి అవకాశం ఇచ్చింది. చట్టాలు తయారు చేసే వాళ్లు కాబట్టి.. వాళ్లకు అనుకూలంగా రాసుకున్నారు. రెండు సీట్లలో కాదు.. ఎన్ని సీట్లలో అయినా పోటీ చేయవచ్చు. ఎమ్మెల్సీగా ఉన్పనప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. కానీ ప్రభుత్వ ఉద్యోగి ఎన్నికల్లో పోటీచే యాలంటే మాత్రం రాజీనామా చేయాలి. రెండు సీట్లలో పోటీ చేయడం వెనుక ఓటమి భయం కూడా ఓ కారణం కావొచ్చు. ఓ చోట ఓడిపోయినా.. మరో చోట గెలుస్తామనే అంచనాతో కూడా .. రెండు చోట్ల పోటీ చేస్తూ ఉండవచ్చు. జనసేన అధినేత మొదటి సారి పోటీ చేస్తున్నారు. టీడీపీ, వైసీపీలకు ఉన్నంత నిర్మాణం లేదు. అందుకే ముందు జాగ్రత్తగా రెండు చోట్ల పోటీ చేస్తున్నారని అనుకోవచ్చు.
ఎవరైనా సేఫ్ సీట్లనే చూసుకుంటారు..!
రెండు సీట్లలో పవన్ కల్యాణ్ పోటీ చేయడం.. పూర్తిగా సేఫ్ సీటు కోసమే అనుకోవచ్చు. రాయలసీమలో కూడా పోటీ చేయవచ్చు కదా.. అని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్… తనకు ఎక్కడ సేఫ్ అనుకుంటే అక్కడి నుంచి పోటీ చేస్తారు. చంద్రబాబు పులివెందుల నుంచి… జగన్మోహన్ రెడ్డి కుప్పం నుంచి పోటీ చేస్తారా..? ఎవరూ చేయరు. ఎవరికి సేఫ్ సీటు వాళ్లు చూసుకుంటారు. అలాగే పవన్ కల్యాణ్కూడా.. తనకు సేఫ్ అనుకున్న సీట్ల నుంచే పోటీ చేస్తున్నారు.