కేసీఆర్ కొన్ని రోజుల కిందట ప్రెస్ మీట్ నిర్వహించినప్పుడు కేటీఆర్, హరీష్ రావుల్లో మీ వారసుడు ఎవరు అని మీడియా ప్రతినిధులు చాలా మంది అడిగారు. నిజానికి ఇది తెలంగాణ ప్రజలందరిలోను, పార్టీ వర్గాల్లోను చాలా ముమ్మరంగా ఉన్న సందేహం. అయితే కేసీఆర్ సహజంగానే మాటల మరాఠీ గనుక.. ‘ఆ విషయం ప్రజలు నిర్ణయిస్తారు’ అంటూ అప్పటికి తప్పించుకున్నారు. మీడియా వారిలో ఎవ్వరూ తిరిగి ప్రశ్నించేంత వారు కాదు గనుక.. అప్పటికి కేసీఆర్ గండం దాటేసినట్లే గానీ.. ఆయన వారసుడిగా ఎవరిని ఎంచుకున్నారో ప్రస్తుతం ఇటు గ్రేటర్, అటు నారాయణఖేడ్ లో జరుగుతున్న ఎన్నికల పోకడలను గమనిస్తే ఎవ్వరికైనా అర్థం అవుతుంది. అయితే ఇక్కడ కొత్త ట్విస్టు ఏంటంటే.. కేసీఆర్ కుటుంబం నుంచి మూడో తరం వారసుడు కూడా అప్పుడే రెడీ అయిపోయినట్లుగా కనిపిస్తోంది. అతను మరెవ్వరో కాదు.. కేటీఆర్ తనయుడు.. కేసీఆర్ కు అత్యంత ప్రియతముడైన మనవడు హిమాంశు రావు.
మొన్న సికింద్రాబాద్ బహిరంగ సభ వేదికను ఎవ్వరైనా జాగ్రత్తగా గమనించి ఉంటే గనుక.. కేసీఆర్ తో పాటు చాలా ఆర్భాటంగా వేదిక మీదకు తరలివచ్చిన ఈ బుడతడు ఎవరబ్బా అనే సందేహం కలిగి ఉంటుంది. బాల రాజకీయ నాయకుడి తరహాలో.. తెరాస కండువాను ధరించి మరీ పిల్లవాడు అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ కుర్రాడే హిమాంశు. బహిరంగ సభలో తాతయ్యతో పాటు పాల్గొనడానికి రావడంలోనే.. ఆయన కుటుంబం నుంచి మూడో తరం రాజకీయ వారసత్వం స్పష్టం అయిపోతున్నదని పార్టీ వర్గాలే వ్యాఖ్యానించుకోవడం విశేషం.
నిజానికి హిమాంశు రాజకీయ గెటప్ ఇవాళ కొత్త కాదు. గతంలో తెలంగాణ అనుకూల నిర్ణయం తీసుకున్న తరువాత.. కేసీఆర్ తన యావత్తు కుటుంబసభ్యులను ఢిల్లీ తీసుకువెళ్లి మేడం సోనియాతో సమావేశం అయి.. అందరితో కలిసి గ్రూప్ ఫోటో దిగినప్పడు తాత తండ్రి ల కంటె చాలా ఘనంగా రాజకీయ నాయకుడి గెటప్ లో తెల్లటి లాల్చీ బంద్ గలా కోటు ధరించి హిమాంశు అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు తాతయ్యతో కలిసి బహిరంగ సభలకు కూడా ఎంచక్కా హాజరవుతున్నాడు. దాంతో కేసీఆర్ మూడోతరం వారసుడు ఎవరు అనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసినట్లే.
ఇకపోతే.. కేసీఆర్ తరువాత.. ఆయనకు రెండో తరం రాజకీయ వారసుడు ఎవరు? అనే విషయంలో ఇంకా ఎవ్వరికైనా ఎలాంటి సందేహాలు అయినా మిగిలున్నాయా? ఉండకపోవచ్చు లెండి. అందరికీ ఈ విషయంలోనూ ఒక క్లారిటీ ఉండనే ఉంది.