ఖమ్మం జిల్లాలో మరోసారి అనూహ్యమైన దృశ్యం ఆవిష్కృతమయింది. రాజకీయాల్లో బద్ధ వైరం ఉన్న వారిగా పేరు తెచ్చుకున్న తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు మళ్లీ ఒకే పార్టీలో ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒకే వేదికపై కనిపించారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్న క్రమంలో… వైరాలో టీఆర్ఎస్ ముఖ్యనేతల సమావేశమయ్యారు. నామా నాగేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు పక్కపక్కనే కూర్చున్నారు. మారిన రాజకీయ పరిస్థితుల్లో మనం కూడా మారాలని నేతలకు తుమ్మల సూచించారు. కేసీఆర్ ఎంపిక చేసిన అభ్యర్థి నామాను గెలిపించుకోవాలన్నారు. కలిసి పనిచేస్తే వైరాలోనే ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
నిజానికి ఈ ఇద్దరు నేతలు.. 2014 ఎన్నికల వరకూ తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి అగ్రనేతలుగా కొనసాగేవారు. అధినేత వద్ద ఇద్దరికీ పలుకుబడి ఉండేది. ఎవరి వర్గానికి వారు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు పోటీ పడేవారు. ఈ క్రమంలో.. 2014 కి ముందే.. వీరిద్దరిలో ఒకరిని టీఆర్ఎస్లోకి ఆహ్వానించాలని.. తెలంగాణ వచ్చిన వెంటనే.. కేసీఆర్ ప్రయత్నించారు. కానీ.. ఎన్నికల్లో వారు టీడీపీ తరపున పోటీ చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు. అయితే.. ఎంపీగా నామా, ఎమ్మెల్యేగా తుమ్మల ఓడిపోయారు. ఆ తర్వాత తుమ్మల టీఆర్ఎస్లో చేరి మంత్రి అయ్యారు. ఆ తర్వాత నామా టీడీపీలోనే కొనసాగిప్పటికీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలవడంతో… ఎంపీగా పోటీ చేయడానికి టీఆర్ఎస్లో చేరిపోయారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా నిలిచారు.
వాస్తవానికి.. ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని… కేసీఆర్ తనకు ఆఫర్ ఇస్తారని.. తుమ్మల నాగేశ్వరరావు ఆశించారు. కానీ.. కేసీఆర్ ఆ ప్రయత్నమే చేయలేదు. నామా టీఆర్ఎస్లో చేరక ముందు.. వంకాలయపాటి రాజేంద్రప్రసాద్ అనే పారిశ్రామికవేత్త పేరును పరిశీలించారు. అనూహ్యంగా నామా పార్టీలోకి రావడంతో.. మొత్తానికే.. పరిస్థితి మారిపోయింది. ఒకప్పుడు… టీడీపీలో ఉప్పు-నిప్పులా.. వ్యవహరించిన ఇద్దరు నేతలు ఇప్పుడు టీఆర్ఎస్లో ఎలా వ్యవహరిస్తారో అన్న ఆసక్తి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో వర్గ విబేధాలతోనే ఖమ్మం జిల్లాలో ఒక్క సీటుకు పరిమితమయ్యామని… కేసీఆర్ చెబుతూ ఉంటారు. మరి నామాను పార్టీలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చి.. ఆ వర్గాలను ఎలా కలాపాలని కేసీఆర్ అనుకున్నారో కానీ.. ముందు ముందు ఖమ్మం టీఆర్ఎస్ రాజకీయాలు మరింత రసరవత్తరం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.