దర్శక రచయితలు పోసాని కృష్ణమురళి, చిన్ని కృష్ణ వ్యాఖ్యలకు టీవీ ఛానళ్ళు ఇచ్చిన కాప్షన్స్ తో పోలిస్తే నేను ఇచ్చిన శీర్షిక చాలా మైల్డ్. వారి మాటలతో పోలిస్తే మరింత మైల్డ్. ఏపి తెలంగాణ ప్రజల మధ్య వైషమ్యాలు పెరగకూడదన్న వారి వాదనతో ఏకీభవించవచ్చు. కాని ఆ మాట వారు చెబుతున్న తీరులో మాత్రం సమతుల్యత లేదు. ఏకపక్షంగా వుంది. ఒకవైపే చూడు.. అన్న బాలయ్య బాటలో వుంది. ఉభయులూ ఎంతగానో మెచ్చుకుంటున్న టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తాజా ట్వీట్‌కూ.. వీరి మాటల తీరుకూ తేడా చూస్తే రాజును మించిన రాజభక్తి పొంగిపొర్లడం స్పష్టమవుతుంది. చంద్రబాబు లేదా పవన్ కళ్యాణ్ ల ఆరోపణలు నచ్చకపోతే ఖండించడం వేరు. ఆ పేరుతో మరో ఏపి నాయకుడు వైఎస్ జగన్‌ను కీర్తించడం వేరు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సరిగ్గా వ్యవ్యవహరించలేదని విమర్శించే వారితో నేను పూర్తిగా ఏకీభవించాను. దానిపై రెండు పుస్తకాలుకూడా రాశాను. అయితే ఆ పేరుతో చంద్రబాబుది తప్పు ప్రధాని మోడీ పాత్ర అప్రధానం అన్నట్టు చిత్రించడంతోనే ఏకీభవించలేకపోయాను. బాబును తిట్టండి.. మోడీని మోయొద్దు అని ఒక పోస్టు పెట్టానందుకే.
తెలుగువాళ్లు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన చారిత్రిక నేపథ్యంలో పాలక పార్టీలు ఆ విభజన అనంతర పరిస్తితులను తమ రాజకీయ ప్రచారంలో వాడుకోవడం అనివార్యం. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి సాధించుకున్న తెలంగాణలో పరిస్తితి ఒకలా వుంటుంది. విభజిత ఏపిలో పరిస్థితి మరోలా వుంటుంది. ఒక్క టీఆర్ఎస్ తప్ప మిగిలిన పాత పార్టీలన్నీ రెండు చోట్ల వున్నవే గనక ఇప్పుడే పుట్టినట్టు మాట్టాడే అవకాశం లేదు. జనసేనకు కొంచెం మినహాయింపు.. ఎందుకంటే అది విభజన తర్వాత పుట్టిన పార్టీ. పైగా దాని అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజల పోరాటం పట్ల.. ఉద్యమం పట్ల సానుభూతి పూర్వకంగా మాట్లాడుతూనే టీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేసిన వారు. ఇటీవల రాజమండ్రిలోనూ కేసీఆర్‌ను ఉద్యమ స్వరూపమని వర్ణించారు. రాజకీయ పార్టీల మధ్య ఘర్షణ.. రాష్ట్రాల మధ్య విభేదాలకు దారి తీయరాదన్నది ఆయన వాదన. ఈ సందర్భంలో కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన మాట నిజం. గతం అలా వుంచి.. మూడు మాసాల కిందట ఎన్నికల సభల్లో టీఆర్ఎస్ అత్యున్నత నేతలు కూడా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలే చేయడం కాదనలేని నిజం. అప్పట్లో కేసీఆర్ మాటలపై రాద్ధాంతం చేసిన వారిని కూడా నేను సమర్థించలేదు. తెలుగుదేశం సంగతి వేరు. ఓటుకు నోటు తర్వాత ఆ పార్టీ చేతులారా తన ఉనికి కోల్పోయింది. దాంతో ఏ వైఖరి తీసుకోవాలన్నదానిపై అయోమయంలో వుంది. తెలంగాణలో చేయగలిగింది లేదు గనక ఏపిలో అవసరాల మేరకు సవాళ్ల భాషలో మాట్లాడుతున్నది. ఇది వాస్తవం. రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎప్పుడైనా రాజకీయ వేడి పెరిగినప్పుడు ఇలాటి మాటలు వినిపిస్తాయనే వాస్తవాన్ని అర్థం చేసుకోవలసిందే. వాటిని చల్లబర్చడానికి సమన్వయానికి ప్రయత్నించాలి తప్ప మేధావులు కళాకారులు పత్రికా సంపాదకులు మంటల్లో మరింత ఆజ్యం పోయడం వల్ల ఉపయోగం శూన్యం.
పోసాని కృష్ణ మురళి మీడియాతో తన సినిమాకు సంబంధించి.. తర్వాత కులాల గురించి.. రాజకీయాల గురించి మాట్లాడారు. తొలుత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. మలిదఫాలో పవన్ కళ్యాణ్‌ను విమర్శించరు.అది ఆయన అభిప్రాయం. కాని ఈ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు విపరీతంగా వున్నాయి. తమాషా కోసమో అభిమానంతోనో వీక్షకులు విమర్శకులు ఉపేక్షిస్తున్నంత మాత్రాన జుగుప్సాకరంగా మాట్లాడే హక్కు రాదు. అలా వస్తుందని ఎవరనుకున్నా పొరబాటే. దశాబ్దాలుగా చిత్ర పరిశ్రమలోనే వున్న వ్యక్తి, అందులోనూ రచయిత.. భాషలో ప్రమాణాలు తప్పుతున్న సంగతి తెలుసుకోలేనంత అమాయకంగా అజ్ఞానంగా వుండటం అసంభవం. ఉద్దేశపూర్వకంగానే ఉద్రేకం కోసమే అలా మాట్లాడుతున్నారని చెప్పక తప్పదు. రాష్ట్రాలు-ప్రజల మధ్య సంబంధాలు, కులాల వంటి సున్నితమైన విషయాలు తీసుకొచ్చినపుడు సంయమనం పాటించకపోవడం నష్టదాయకం.
చిన్ని కృష్ణ మరో విధంగా మాట్లాడారు గాని అక్కడా కులాల కుటుంబాల కుంపట్లు ఎక్కువైనాయి. సమాజంలో కులాలు నిజమైనా.. రాజకీయాలలో కులాల కాలుష్యం పెరిగినా.. ఏ కులానికి ఎవరు ప్రతినిధులని నిర్దేశించే హక్కు ఎవరికీ వుండదు. అసలా చర్చ అసంబద్దం. అసందర్భం. మెగా ఫ్యామిలీ కావచ్చు.. నందమూరి ఫ్యామిలీ కావచ్చు.. లేదంటే రంగా ఫ్యామిలీ కావచ్చు… వాటిపై తీర్పులివ్వడం కళాకారుడు చేయవలసిన పని కాదు. సినిమాల పరంగా లేదా వ్యక్తిగతంగా సమస్యలుంటే ఆ స్థాయిలోనే చూసుకోవాలి తప్ప ఎన్నికలలో రాజకీయ పార్టీలూ కులాలతో కలగా పులగం చేయడం సరికాదు.
పోసాని నేరుగా జగన్‌ను బలపరుస్తారు గనక సమస్య లేదు. చిన్ని కృష్ణ మాత్రం ప్రజాభిప్రాయం పేరిట జగన్ ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించడం వల్ల ఇదంతా రాజకీయాల కోసమే చేశారనే విమర్శకు ఆస్కారం ఏర్పడింది. వారు ఏ ఆరోపణలను ఖండించేందుకు మీడియాను రప్పించారో వాటికి వూతమిచ్చే ప్రహసనంగా మారిపోయింది. నిజంగా జగన్‌ను బలపర్చదల్చుకుంటే ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చు. మీడియా ద్వారా చెప్పొచ్చు.. ఎక్కడెక్కడో తిప్పి అక్కడికే తీసుకుపోనవసరం లేదు.
ఈ ఉభయులూ కూడా టీఆర్ఎస్ పాలన మహత్తరంగా వుందని ఏ సమస్యలు లేవని చెప్పడంపై అభ్యంతరం లేదు. వారిష్టం. ప్రజలు ప్రశాంతంగా వుంటారని నేను ఉద్యమ కాలంలోనే బల్లగుద్ది చెప్పేవాణ్ని. అలా అని సమస్యలు లేవని కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీడీపీ.. టీఆర్ఎస్.. వైసీపీ వైరం వల్ల రాజకీయ వివాదాలే గాని ప్రజల దైనందిన జీవితం సజావుగానే సాగిపోతున్నది. అంతమాత్రాన ఒక వైపునుంచే చూసి ఒక ప్రభుత్వాన్నే మోయవలసిన అవసరమేమీ లేదు. పాలకుల మెప్పు కోసం దయాభిక్షలాగా చిత్రించడమూ అతిశయమే అవుతుంది.