జనసేన సీపీఐ పొత్తు కొనసాగడం మీద మీడియాలో పలు కథనాలు ప్రసారమవుతున్నాయి. ప్రత్యేకించి సాక్షి ఛానల్ అయితే సిపిఐ జనసేన విడిపోయినట్టే అంటూ పుంఖానుపుంఖాలుగా కథనాలు రాస్తోంది. సిపిఐతో కొన్ని విషయాల్లో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని పవన్ కళ్యాణ్ మాటల ద్వారా అర్ధం అవుతోంది. అయితే అది పొత్తు తెగదెంపులు చేసుకునేంత దాకా ఉండకపోవచ్చు అని విశ్లేషకులు భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ మాత్రం పోతిన మహేష్ కోసం సిపిఐ ని ఒకానొక సమయంలో వదులు కోవడానికి కూడా సిద్ధపడట్టుగా పవన్ కళ్యాణ్ మాటల ద్వారా తెలుస్తోంది.
విజయవాడ వెస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ పోతిన మహేష్ కు టికెట్ ఇస్తున్నాడు. ఇతనేమీ పేరు మోసిన రాజకీయ నాయకుడు కాదు. అంగబలం అర్థబలం ఉన్నవాడు అంతకంటే కాదు. నగరి అనే సామాజిక వర్గానికి చెందినవాడు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన నాటి నుండి పవన్ కోసం పనిచేస్తూ, పార్టీ కోసం పని చేస్తూ ఉన్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ ఇతనిని ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా అని అడిగినప్పుడు, నా దగ్గర అంత డబ్బులేదు నేను ఖర్చు పెట్టుకో లేను అని చెప్పిన వ్యక్తి. అయితే పవన్ కళ్యాణ్, డబ్బు లేకుండానే రాజకీయాలు చేయవచ్చు అని జనసేన నిరూపించబోతోంది అని అతనికి చెప్పి నీకు టికెట్ ఇస్తానని మాట ఇచ్చి ఉన్నాడు. అయితే సిపిఐ తో జనసేనకు పొత్తు కుదిరిన తర్వాత, వారు విజయవాడ సెంట్రల్ మరియు విజయవాడ వెస్ట్ రెండు సీట్లు కూడా తమకే కావాలని పట్టుబట్టారు. చివరికి బోండా ఉమా ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ సెంట్రల్ కమ్యూనిస్టులకు వదిలివేయడానికి పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నప్పటికీ, విజయవాడ వెస్ట్ మాత్రం పోతిన మహేష్ కు మాట ఇచ్చానని ఈ సీటు విషయంలో బలవంత పెట్టవద్దు అని సిపిఐ ని పవన్ కళ్యాణ్ కోరాడు. పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన ఒక సభలో సిపిఐ రామకృష్ణ, నేను, ఆ సీటు కోసం గట్టి గట్టిగా ఆఫీసులో ఒకరిమీద ఒకరు అరుచుకున్నాం కూడా అని చెప్పుకొచ్చారు.
అంగబలం, అర్థబలం లేని ఒక కార్యకర్తకు ఇచ్చిన మాట కోసం పవన్ కళ్యాణ్ సిపిఐ లాంటి పార్టీతో ఇంత కీలక సమయంలో పొత్తు వదులు కోవడానికి కూడా సిద్ధపడటం చూసిన ఇతర జనసేన నాయకులు ఆశ్చర్యపోయారట. మరి విజయవాడ వెస్ట్ లో పొతిన మహేష్ గెలుస్తాడా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాలి.