కోన వెంకట్ .. బ్రాహ్మణ కులపెద్దో కాదో.. నాకు తెలియదు. కానీ బ్రాహ్మణులందరికీ.. ఆయన సాక్షి పత్రిక వేదికగా ఓ సందేశం ఇచ్చారు. ” జంధ్యం వేసుకుని గాయత్రీ మంత్రం చదివే ఒక్క బ్రాహ్మణుడు కూడా టీడీపీకి ఓటెయ్యకూడదని బహిరంగంగా పిలుపునిస్తున్నా. సిగ్గూశరం ఉంటే టీడీపీలో ఉన్న బ్రాహ్మణ నేతలు పునరాలోచన చేసుకోవాలి. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే జగన్ బ్రాహ్మణ పక్షపాతి..” అనేది ఆ సందేశం. నేను జంధ్యం వేసుకుంటా. గాయంత్రి మంత్రం జపిస్తా. బ్రాహ్మణ కుల పెద్దవో…నీకు ఆ హోదా సాక్షి ఇచ్చిందో.. మరొకటో కానీ.. కోన.. చూస్తూ చూస్తూ జంధ్యం కట్టుకుని అన్యమతస్తుడికి ఓటేయమని ఎలా పిలుపునిస్తావ్ ..?
పేద బ్రాహ్మణులను ఎవరు పట్టించుకున్నారు కోన..?
“కుల పెద్ద” కోన వెంకట్ పూర్వీకులకు చాలా చరిత్ర ఉంది. కోన ప్రభాకరరావు స్వాతంత్య సమరయోధుడు. మంత్రిగా చేశారు. కోన రఘుపతి …. సమీప బంధువు. బాపట్ల ఎమ్మెల్యే. ఇప్పుడు మళ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అంటే తరతరాలుగా కోన కుటుంబీకులు బ్రాహ్మణ కోటాలో… లబ్దిపొందుతూనే ఉన్నారు. ఆ విధంగా కుల పెద్ద అయి ఉంటారు. ఇన్నేళ్ల కాలంలో… జంధ్యం వేసుకున్న బ్రాహ్మణులకు… ఏమైనా సాయం చేశారా..? ప్రభుత్వాల నుంచి సాయం చేసేలా చేయగలిగారా…? పదేళ్ల కింద మరణించి.. అంతకు ముందు ఐదేళ్ల పాటు పరిపాలించిన స్వయం ప్రకటిత మహా నేత .. బ్రాహ్మణ సంక్షేమం కోసం ఎంత కేటాయించారో… కోన వెంకట్ చెబుతారా..? తమ కుటుంబానికి రాజకీయ అవకాశాలు కల్పించారు కాబట్టి.. ఇంకే … జంధ్యం కట్టిన బ్రాహ్మణునికి సాయం చేయకపోయినా మహా నేత అయిపోతారా..? ఆయన కుమారుడు కాబట్టి… జగన్‌కి సాష్టంగ ప్రమాణాలు చేసేయాలా..?. ఐదేళ్ల వైఎస్ పాలనలో… ఇద్దరు, ముగ్గురు బ్రాహ్మణ నేతలకు మేలు చేయడం తప్పా… వైఎస్.. పేద బ్రాహ్మణుల కోసం రూపాయి కూడా కేటాయించలేదని.. రికార్డులు ఘోషిస్తున్నాయి. మరి ఆయన ఎలా బ్రాహ్మణపక్షపాతి అయ్యారు. కోన కుటుంబానికి ప్రయోజనాలు కల్పించినందుకా…?
అన్నం పెట్టిన వాళ్లకి సున్నం పెడతారనే పేరు తెచ్చుకుందామా…కోన ?
ఐవైఆర్ శర్మ అనే పెద్ద మనిషి ఉండేవారు. ఆయన ఏపీకి మొదటి చీఫ్ సెక్రటరీ. ఆయన పదవీ విరమణ చేస్తూనే.. మన వర్గానికి ఏదైనా చేయాలనుకున్నారు. తన ఆలోచన ప్రభుత్వానికి వివరించారు. ఏడాదికి రూ. వంద కోట్లు ఇస్తే… ఉపాధి అవకాశాలు లేక అల్లాడిపోతున్న పేద బ్రాహ్మణులకు ఇతర మార్గాల ద్వారా జీవన మార్గం చూపించవచ్చని ఒప్పించారు. దానికి చంద్రబాబు అంగీకరించారు. ఇప్పటికి.. బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 280 కోట్లు ఇచ్చారు. మొన్ననే… ఆకలితో అలమటించే పేద బ్రాహ్మణకుటుంబాలు పదుల సంఖ్యలో స్వయం ఉపాధి కోసం… బ్రాహ్మణ కార్పొరేషన్ సబ్సిడీతో అందించిన కార్లను చూసి… ధైర్యం వచ్చింది. అగ్రకులం పేరుతో… ఓ విధంగా ఏ ఒక్క పథకమూ అందని బ్రాహ్మణులకు.. ఇలాంటి అవకాశాలు గతంలో ఏ ప్రభుత్వమూ కల్పించలేదు. గౌరవం పేరుతో ఆశీర్వాదం తీసుకుని కాస్తంత దక్షిణ వేసి పంపించేస్తారు కానీ.. ఇలా కుటుంబానికి ఆసరాగా ఉండే పనులు ఎవరూ చేయలేదు. అలాంటివి ఏమైనా ఉంటే కోన చెప్పవచ్చు కదా..!. కానీ ఆ ఐవైఆర్ ఏమి చేశారు…?. అన్నం పెట్టిన వాళ్లకి సున్నం పెట్టారు.. అనే పేరు తెచ్చారు. ఇతరులు విమర్శించే అవకాశాన్న ికల్పించారు.
గాయత్రీ మంత్రం బదులుగా సువార్తలు చదవించాలనేది నీ ప్రయత్నమా..?
ఆ ఐదేళ్ల కాలంలో.. నేను తిరుమలకు పోయినప్పుడల్లా… శిలువ తరహాలో గుర్తులు కనిపించేవి. ఇదేమి కలికాలం అని… బుగ్గలు నొక్కుకుని.. గోవిందా.. గోవిందా అనుకుని మాత్రమే వచ్చేవాడిని. ఎందుకంటే.. నేను సామాన్యుడిని, పేదవాడ్ని. హిందూత్వాన్ని మనసా వాచా ఆచరించినా… తిరుమలను అలా అపవిత్రం చేస్తున్నారేమిటని… గొంతెత్తి అరవలేని నిస్సహాయత నాది. తిరుమల ఏడు కొండలు కాదు… రెండు కొండలే అని జీవో ఇచ్చారు. మిగతా మొత్తం… మిషనరీస్‌కి… ప్రైవేటు సంస్థలకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారన్న ప్రచారం జరిగింది. ఆ సమయంలో.. జరిగిన పరిణామాలు చూస్తే.. త్వరలో గాయంత్రి మంత్రం బదులు… సువార్త చదవాల్సి వస్తుందేమోనన్నంత ఒత్తిడికి గురయ్యా. కానీ అలాంటి పరిస్థితి లేదు. ఇప్పుడు జగన్ .. ప్రభుత్వం వస్తే.. జరగబోయేది అదే కదా.. కోన. జంధ్యం వేసుకున్న వాళ్లందరూ.. ఆ మతం మార్చుకున్న నేతకే ఓటు వేయమంటున్నావు… ఓట్ల కోసం అనుకూలంగా ఉండే స్వామిజీలకు సాష్టాంగ ప్రమాణాలు చేయడం తప్ప.. ఆ తిరుమలేశుడికి అయినా ఎప్పుడైనా నువ్ చెప్పే నేత గౌరవం ఇచ్చారా..?. ఎప్పుడు తిరుమలకు వెళ్లినా…గుంపుని వెంటేసుకుని.. దండయాత్రలా వెళ్లి.. గోవిందనామస్మరణ మాత్రమే వినిపించాల్సిన తిరుమలలో.. ఆలయంలో.. కూడా జై జగన్ నినాదాలు చేయించుకునే నేత… హిందూత్వానికి మేలు చేస్తారా..? నువ్ చెప్పినట్లు చేస్తే ఆ తర్వాత ఆ జంధ్యానికి విలువ ఉంటుందా..?. చూస్తూ చూస్తూ.. అలాంటి పరిస్థితి తెచ్చుకుందామా..?
బ్రాహ్మణిజాన్ని బతకనివ్వు కోన..!
బ్రాహ్మణునిపై తరతరాలుగా విద్వేషం పెంచుకుంటూ పోతున్నారు. పెద్దగా సంఖ్యాబలం లేదని… బ్రాహ్మణులనే బూచిగా చూపి… కొన్ని ఉద్యమాలు కూడా వచ్చాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకుందాం.. కోన. రాజకీయాల కోసం.. జంధ్యాలను వాడటం మానేద్దాం. బ్రాహ్మణిజాన్ని బతకనిద్దాం… జంధ్యం అన్నావ్ కాబట్టి… కోన.. నాదో విజ్ఞప్తి… స్వప్రయోజనాల కోసం.. రాజకీయ అవసరాల కోసం.. జంధ్యాన్ని సెంటిమెంట్‌గా వాడుకోవద్దు. నీ రాజకీయం నీ ఇష్టం. వ్యక్తిగా ఎలాంటి పిలుపు అయినా ఇవ్వు. బ్రాహ్మణ కులం మొత్తానికి ఆపాదించి పిలుపునివ్వకు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. నీకు… నీ కుటుంబానికి మేలు జరుగుతుంది కాబట్టి జగన్ కావాలనుకుంటున్నావు.. అందులో తప్పు లేదు… కానీ నిజంగా జంధ్యం వేసుకునే బ్రాహ్మణుల మేలు కావాలనుకుంటే… ఇలాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్స్ చేయకు. ఎవరు మేలు చేస్తారో.. వారికి ఓటు వేసుకునే ఆలోచనను ఉండనివ్వు..!