‘వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సభలు జనాలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ప్రచార సభలు సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇంకేముంది… ఎన్నికల ఫలితాలు రావడం ఒక్కటే తరువాయి’… అచ్చంగా ఇలానే ఉంది వైకాపా శ్రేణుల్లో హడావుడి! చివరికి, ఆ పార్టీ పత్రిక సాక్షి కూడా జగన్ సభలకు జనాలు వస్తుండటాన్నే గొప్పగా చెబుతూ కథనాలు రాస్తోంది. అక్కడితో ఆగినా బాగుండేది… జగన్ మాట ఇస్తే శిలా శాసనమేననీ, ఎన్నికల ప్రచార సభలోనే మంత్రి పదవి ఇస్తానంటూ ఆయన మాట ఇవ్వడం చారిత్రకం అనే స్థాయిలో ఇవాళ్టి సాక్షిలో కథనాలు రాశారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజక వర్గ సమన్వయకర్తగా ఉన్న మర్రి రాజశేఖర్ ను మార్చారు. ఆయన స్థానంలో రజనిని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టారు. దాంతో రాజశేఖర్ కాస్త అసంతృప్తికి గురయ్యారన్న కథనాలున్నాయి. అయితే, ఆదివారం నాడు చిలకలూరిపేటలో జగన్ మాట్లాడుతూ… సామాజిక న్యాయం కోసం రాజశేఖర్ తన సీటును త్యాగం చేశారని చెప్పారు. ఆయన్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాననీ, ఎమ్మెల్సీని చేస్తాననీ, తాను ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఆయనకి మంత్రి పదవి కూడా ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. దీంతో, మాట ఇస్తే నిలబెట్టుకునే నాయకుడు జగన్ అంటూ వైకాపా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయని సాక్షి రాసింది. అభ్యర్థులను మార్చినప్పుడు.. వారికి న్యాయం చేస్తా అంటూ ఇతర పార్టీలు నాలుగు గోడల మధ్య మాత్రమే చెప్తాయనీ, కానీ జగన్ బహిరంగంగా మంత్రి పదవి ప్రకటించడం మామూలు విషయం కాదు అన్నట్టుగా సాక్షి రాసింది!
సమస్య ఇదే..! 2014 ఎన్నికల సమయంలో కూడా అచ్చం ఇలానే వ్యవహరించాయి వైకాపాలోని కొన్ని వర్గాలు. ఎన్నికలకు పదిహేను రోజులు సమయం ఉందనగా… బూతు స్థాయిలో చెయ్యాల్సిన పనుల గురించి చర్చించడం మానేసి, ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తే బాగుంటుంది, ఎవరు మంత్రులు అవుతారు అనే చర్చ చేశారు. సాక్షిలో ఉన్న జగన్ వీర విధేయులు కూడా.. ఎన్నికల నిర్వహణ అనే అంశాన్ని గాలికి వదిలేసి, జగన్ ముఖ్యమంత్రి అయిపోయారనే అతి విశ్వాసానికి పోయారు. ఇప్పుడు మళ్లీ అదే వాతావరణం. ఒక అసంతృప్త నేతకు ఎమ్మెల్సీ ఇస్తాననీ, మంత్రి పదవి ఇస్తానని జగన్ చెప్పడాన్ని సాక్షి చాలా గొప్పగా చూస్తోంది, ప్రజలకీ చూపించే ప్రయత్నం చేస్తోంది. ఏ పార్టీలోనైనా ఇలానే జరుగుతుంది. అరే… ఇంకా ఎన్నికలే జరగలేదు, ఎవరు గెలుస్తారో తెలీదు.. కానీ, ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి పదవుల పంపిణీ వరకూ వెళ్లిపోతే ఎలా..? ఈ తీరు గమనిస్తున్న ప్రజలకు ఏమనిపస్తుంది..?