లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి వస్తే కనీస ఆదాయ భరోసా పథకాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేశంలో 20 శాతం మంది పేదలకు ఏడాదికి రూ.72 వేలు రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో వేస్తామని హామీ ఇచ్చారు. దీని కోసం అన్ని గణాంకాలను సరి చూసుకున్నామన్నారు. ఇటువంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావట్లేదు రాహుల్ చెప్పారు. దీని కోసం అన్ని లెక్కలను సరి చూసుకున్నాం. ఇటువంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా అమలు కావట్లేదని తెలిపారు. 21వ శతాబ్దంలోనూ పేదరికం అధికంగా ఉందని, దానిపై తమ పార్టీ చివరి పోరాటం కొనసాగిస్తుందని అన్నారు.
ఈ పథకం గురించి రెండు నెలల కిందట రాహుల్ గాంధీ చత్తీస్ గఢ్ లో ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే, దేశంలోని ప్రతి పేదవాడికీ నెలవారీగా కనీస ఆదాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా రుణ మాఫీ అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటించిన రాహుల్.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. తమ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లోనూ కనీస ఆదాయ పథకాన్ని అమలు చేస్తుందని, రెండు భారత్‌లను తాము కోరుకోవడం లేదని, కేవలం ఒకే భారతదేశం ఉండాలనేది తమ లక్ష్యమని రాహుల్ పదే పదే చెబుతున్నారు. 2016-17 ఆర్థిక సర్వేలో అప్పటి కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ దీన్ని దేశం ముందుకు తెచ్చారు. సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తేసి ‘సార్వత్రిక కనీస ఆదాయ పథకం తేవాలన్నారు. అయితే మోడీ ప్రభుత్వం వెనుకడుగు వేసింది.
ఇంటిని యూనిట్‌గా అమలు చేస్తాం కాబట్టి వ్యక్తులకు విడిగా నగదు బదిలీ ద్వారా మహిళలు సొంతంగా తమ ఆదాయం సాధించుకునే వెసులుబాటు ఏర్పడుతుంది. సుపరిపాలన సాధ్యం చేయవచ్చు. ఈ పథకం ద్వారా ప్రజలు తమ అవసరాలను చూసుకుంటారు. ప్రభుత్వం ఇతరత్రా ముఖ్యాంశాలపై దృష్టిపెట్టవచ్చు. పేదలను వ్యవస్థలో భాగస్వామ్యం చేయవచ్చు. ప్రజల భాగస్వామ్యం పెరిగితే అన్నిటా ఆదాయమూ పెరిగి పరిస్థితులూ మెరుగుపడతాయి. వ్యతిరేక వాదనలు. రాహుల్ ప్రతిపాదిస్తున్న పథకం అమలు సాధ్యమా అన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి. భారత్‌లో ప్రస్తుతం దారిద్య్ర రేఖకు దిగువ ఉన్నవారు 36.3 కోట్ల మంది అనీ నిరుడు రంగరాజన్ కమిటీ ఓ నివేదికలో తెలిపింది. కనీసం ఈ 36 కోట్ల మందిలో నమోదైన వారెంతమంది, వారందరికీ ఆధార్లున్నాయా, వారందరికీ బ్యాంకు అకౌంట్లున్నాయా, వారికి ఎంత ఇవ్వదల్చుకున్నారన్న విధివిధానాలు ముఖ్యం. ప్రస్తుతం అమలు చేస్తున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికే కేంద్రం రూ.50,000 కోట్లు ఏటా కేటాయిస్తున్నారు. కనీస ఆదాయ పథకాన్ని తేవాలంటే అంతకు పది రెట్ల కేటాయింపులు జరపాలన్న అభిప్రాయాలున్నాయి. ఆహార, ఇంధన సబ్సిడీలను భారత్ రద్దు చేస్తే, ఒక మనిషికి ఏడాదికి రూ.2600 ఆదాయాన్ని ఇవ్వగలదని ఐఎంఎఫ్ 2017లో పేర్కొంది. అందుకే అమలు సాధ్యం కాదని.. బీజేపీ విమర్శలు చేస్తోంది.