మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు కమల్ హాస లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోవడం లేదు. అయితే ఆయన పార్టీ పోటీ చేస్తుంది. పార్టీ ప్రయోజనం కోసమే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆయన అంటున్నారు. తమిళనాడు, పాండిచ్చేరి కలిపి 40 లోక్ సభా స్థానాలున్నాయి. ఎంఎన్ఎం పార్టీ తరపున రెండు దఫాలుగా అభ్యర్థులను ప్రకటించారు. వారం క్రితం తొలి దఫా అభ్యర్థులను ప్రకటించినప్పుడు కమల్ చేసిన ప్రకటనకు ప్రస్తుత వివరణకు పొంతన లేదు. ఎన్నికల్లో పోటీచేయాలని తనపై వత్తిడి వస్తోందని త్వరలోనే సానుకూల ప్రకటన చేస్తానని అప్పట్లో కమల్ అన్నారు. రెండో దఫా 19 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ తను మాత్రం పోటీలో లేనని చెప్పేశారు. ఎన్నికల్లో పోటీ చేస్తే ఒక నియోజకవర్గంలో ఎక్కువ కాలం ప్రచారం చేయాల్సి వస్తుందని అప్పడు ఇతర నియోజకవర్గాలపై దృష్టి పెట్టే అవకాశం ఉండదని కమల్ చెబుతున్నారు.
అభ్యర్థులందరికీ సమాన ప్రాధాన్యమిస్తూ అన్ని చోట్ల ప్రచారం చేయాలన్నదే తన ఉద్దేశమని కమల్ వివరణ ఇచ్చుకున్నారు. ముఖ్యమంత్రి కావడమే కమల్ లక్ష్యమని ఆయన పార్టీ నేతలు అంటున్నారు. లోక్ సభ ఎన్నికలు జాతీయ స్థాయి అంశాల ఆధారంగా జరగుతాయి. ప్రాంతీయ అంశాలకు లోక్ సభ ఎన్నికల్లో ఎక్కువ ప్రాధాన్యముండదు. కొన్ని ప్రాంతీయ అంశాలు ప్రచారంలో భాగమవుతాయి. అయినా ఈ ఎన్నికల్లో ఎక్కువ ప్రాంతీయ అంశాలు ప్రస్తావనకు రావడం లేదు. దానితో కమల్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల్లో తాను ఓడిపోతే మొదటికే మోసం వస్తుందని కమల్ భయపడుతున్నారు. శాసనసభ ఎన్నికల్లో బాగా వెనుకబడి పోతామని ఆయన ఆలోచించారు. ఓడిపోయిన నేత ధైర్యంగా జనం ముందుకు వెళ్లలేరని ఆయన అంచనా వేసుకున్నారు.
అధినాయకుడే ఓడిపోతే కార్యకర్తల్లో మనోధైర్యం దెబ్బతింటుందని కూడా కమల్ కు బాగానే తెలుసు. కార్యకర్తలతో కూడా సరిగ్గా మాట్లాడలేక, వారిని సంఘటిత పరచలేక, వారిలో ధైర్యాన్ని నింపలేక ఇబ్బంది పడాల్సి వస్తుందని కూడా కమల్ లెక్కలు వేసుకున్నారు. దానితో తాను స్వయంగా పోటీ చేయకూడదని తీర్మానించుకున్నారు.