తెలంగాణ రాష్ట్ర సమితిలో..తగ్గిపోతున్న హరీష్ రావు ప్రభావానికి మరో సాక్ష్యం బయటపడింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ లో హరీష్ రావు పేరు లేదు. ఈ వ్యవహారం కలకలం రేపడంతో.. చివరికి పేరును లిస్ట్‌లో చేర్చారు. స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి ఎంపీ సంతోష్ కుమార్ పేరు తొలగించి.. ఆ స్థానంలో హరీష్‌రావుకు అనుమతి ఇవ్వాలంటూ ఎన్నికల సంఘానికి లేఖ రాసింది. సంతోష్ కుమార్ పాస్ వివరాలను, హరీష్ కుమార్ వాహనం వివరాలను ఈసీకి సమర్పించింది. నిజానికి హరీష్ రావుకు.. ఈ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించినంత వరకూ.. కేసీఆర్ ఎలాంటి బాధ్యతలు ఇవ్వలేదు. ఆయన కేవలం తన సిద్ధిపేట నియోజకవర్గానికే పరిమితం.
ప్రతి జిల్లాలోనూ లోక్‌సభ నియోజకవర్గాలకు.. మంత్రులనే బాధ్యులను చేశారు. మెదక్ జిల్లాకు సంబంధించినంత వరకూ.. మంత్రి ఎవరూ లేరు. అందుకే ఆ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్… మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు తీసుకున్నారు. తానే స్వయంగా పర్యవేక్షిస్తానని పార్టీ నేతలకు చెప్పారు. దాంతో.. హరీష్ రావుకు ప్రత్యేకంగా బాధ్యతలు లేవు. ఆయన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇంకా విశేషం ఏమిటంటే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తనకు బాధ్యతలు అప్పగించిన నియోజకవర్గాల్లో భారీ ప్రచారసభలు జరుగుతున్నా.. ఆయనకు ఆహ్వానం అందడం లేదు. ప్రచార పోస్టర్లలో కనీసం.. ఫోటో కూడా వేయడం లేదు. దాంతో.. హరీష్ కూడా లైట్ తీసుకుంటున్నారు.
మెదక్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో మాత్రం పాల్గొన్నారు. మనస్ఫూర్తిగా స్టార్ క్యాంపెయినర్ హోదా… టీఆర్ఎస్ అగ్రనాయకత్వం నుంచి రాలేదు కాబట్టి.. ఆయనకు ప్రత్యేకంగా షెడ్యూల్ కేటాయించే అవకాశం కూడా లేదు. ఈ ఎన్నికల బాధ్యత మొత్తం కేటీఆర్ తీసుకుంటున్నారు కాబట్టి.. హరీష్ రావు ప్రమేయాన్ని అసలు కోరుకోకపోవచ్చు. అందుకే హరీష్ ఈ ఎన్నికల వరకూ.. తన నియోజకవర్గానికే పరిమితం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.