తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. ప్రజల్లో సానుకూలతను పెంచుకోవడానికి ఏ చిన్న అవకాశాన్ని వదిలి పెట్టడం లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ మంత్రానికి ఎప్పటికప్పుడు విరుగుడు సిద్ధం చేసుకుంటున్నారు. వృద్ధులు, వితంతువుల ఇచ్చే సామాజిక పెన్షన్లను.. జనవరిలోనే రూ. వెయ్యి నుంచి రూ. రెండు వేలకు పెంచిన చంద్రబాబు… ఈ సారి రూ. మూడు వేలు చేస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు సర్కార్ పెన్షన్ ను రూ. రెండు వేలు చేసిన తర్వాత పరిస్థితి మారిపోయింది. దీంతో జగన్మోహన్ రెడ్డి.. రూ. మూడు వేలు ఇస్తామని చెప్పుకొచ్చారు. అయితే.. రూ. మూడు వేలకు పెంచుకుంటూ పోతామని చెప్పారు కానీ.. అధికారంలోకి రాగానే మూడు వేలు ఇస్తామని చెప్పలేదు.
అయితే.. రూ. మూడు వేలు అంటే.. పెన్షనర్లలో కాస్త ఆశ వస్తుందని.. కొంత మంది అయినా.. జగన్ వైపు మళ్లుతారన్న అంచనాలతో ఆ అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకూడదన్న ఉద్దేశంతో…టీడీపీ ఉంది. ఈ మేరకు..మేనిఫెస్టోలో.. సామాజిక పెన్షన్లు రూ. మూడు వేలకు పెంచుతామని చెప్పబోతున్నారు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా.. చంద్రబాబు ఎన్నికల సభల్లో చెబుతున్నారు. టీడీపీ మేనిఫెస్టో ఇంత వరకూ విడుదల చేయలేదు. అయితే.. వైసీపీ మేనిఫెస్టోను చూసిన తర్వాతే విడుదలచేసే అవకాశం ఉంది. సంక్షేమ పథకాల విషయంలో.. ఇప్పటికే తమదైన ముద్ర వేశామని.. ఆ విషయంలో.. ఏ మాత్రం వెనుకడుగు వేయకూడదన్న అంచనాలో ఉన్నారు.
వైసీపీ నమ్మశక్యం కాని హామీలు ఇస్తే.. పట్టించుకోకుండా… ఆచరణ సాధ్యం అయిన హామీలు ఏమైనా ఇస్తే… తమ కోణంలో విశ్లేషించి.. అలాంటి పథకాలను.. టీడీపీ మేనిఫెస్టోలో పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చంద్రన్న బీమా లాంటి పథకాలు.. ప్రజల్లో మంచి ఆదరణ పొందాయి. వాటిని ప్రజలకు మరింత చేరువ చేయనున్నారు. బీమా మొత్తం పెంచబోతున్నారు.