ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదు… కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఇంతగా స్పష్టం చేశాక, ఏపీ రాజకీయాల్లో అదే కీలకాంశంగా అప్పట్లో మారింది. హోదా సాధించడంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారంటూ ప్రతిపక్ష పార్టీ విమర్శలు తీవ్రంగా చేసింది. ఆంధ్రాలో హోదా అంశం సజీవంగా ఉందంటే కారణం తాను చేస్తున్న ఉద్యమాలే అంటూ జగన్ చెప్పుకున్నారు. ఎన్డీయే మీద తిరుగుబావుటా ఎగరేసిన టీడీపీ కూడా పార్లమెంటు స్థాయిలో పెద్ద ఉద్యమాన్ని నడిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకి వచ్చేసి, మంత్రులతో రాజీనామాలు చేయించి, మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం వరకూ వెళ్లారు. ఏపీకి మోడీ సర్కారు హోదా ఇవ్వకపోవడాన్ని జాతీయ స్థాయి అంశంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం బాగానే చేశారు. దీంతో, ఏపీ ఎన్నికల్లో ప్రత్యేక హోదా చాలా కీలకమైన అంశంగా మారిపోతుందనీ, అదో సెంటిమెంట్ అంశం అవుతుందనీ అంతా అంచనా వేశారు. కానీ, ఎన్నికల ప్రచార హోరు తీవ్రస్థాయికి చేరి ఈ సమయంలో… ప్రత్యేక హోదా అంశాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఎక్కడుందీ అనిపిస్తుంది.
తెలుగుదేశం, వైకాపా, జనసేన… ఈ మూడు ప్రధాన పార్టీల ప్రచారంలో ఇప్పుడు ప్రత్యేక హోదా సాధన అంశం గతంలో అనుకున్నంత ప్రముఖంగా కనిపించడం లేదు. వ్యక్తిగత ఆరోపణలూ, విమర్శలూ ఇవే ప్రచారంలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అన్ని ఎంపీ సీట్లు తమకు ఇస్తే.. హోదాను సాధించుకునే శక్తి మనకు వస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు ప్రచార సభల్లో ప్రస్థావిస్తున్నారు. జగన్ ప్రసంగాల్లో కూడా ఈ సింగిల్ లైన్ మాత్రమే ఉంటోంది. ముఖ్యమంత్రి మీద విమర్శలే ఆయన ఎక్కువగా చేస్తున్నారు. ఆ విమర్శలు కూడా వ్యక్తిగత స్థాయిలోనే ఉంటున్న పరిస్థితి. ఇక, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హోదా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్న పరిస్థితి లేదు. ఒకప్పుడు, కేవలం ప్రత్యేక హోదా ప్రాతిపదికనే జనసేన తొలినాటి సభలూ కార్యక్రమాలు ఉండేవి. ప్యాకేజీ పాచిపోయిన లడ్డూలు అంటూ ఆయనే హోదా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తారనే పరిస్థితి ఒక దశలో కనిపించింది.
విచిత్రం ఏంటంటే.. ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదా మీద అందరికన్నా స్పష్టమైన విధానం కలిగి ఉన్న పార్టీ కాంగ్రెస్. రాహుల్ ప్రధాని అయితే తొలి సంతకం ఏపీ స్పెషల్ స్టేటస్ మీదనే అని ఆయనా చెప్తున్నారు, ఏపీలో కాంగ్రెస్ నేతలూ అంటున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒక తీర్మానం చేసింది. అయితే, ఎన్నికలు వచ్చేసరికి… ఇతర అంశాలు డామినేట్ చేసేసరికి, హోదా సాధన అనేది ప్రాధమ్యం మారిన పరిస్థితి. కేవలం హోదా సాధన ప్రాతిపదికన మాత్రమే ఎన్నికలు ఉంటాయనుకుంటే… ఇప్పుడు పార్టీలకు ఇతర అంశాలే ప్రచారాస్త్రాలుగా మారిన పరిస్థితి.