హైదరాబాద్: నటుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిరంజీవి తుని వ్యవహారంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఒక బహిరంగలేఖ రాశారు. తునిలో చోటుచేసుకున్న పరిణామాలు తనకు ఆందోళన కలిగించాయని పేర్కొన్నారు. ఈ సంఘటనలకు ప్రధాన కారణం 20 మాసాలుగా రాష్ట్రంలో పారదర్శకత లేకుండా సాగుతున్న టీడీపీ పరిపాలనే కారణమని చెప్పటానికి అనేక ఉదంతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాశారు. కాపులను బీసీల్లో చేర్చటానికి ఏడాదికి వెయ్యికోట్లు నిధులు ఇస్తామని, 18 నెలలు కాలయాపన చేసి కేవలం 100 కోట్లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. అమరావతి నిర్మాణంలోనూ పారదర్శకత లోపించిందని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే కాపులు, బీసీలే కాకుండా రైతులు, మహిళలు కూడా రోడ్లెక్కే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తక్షణం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని చిరంజీవి తన లేఖలో పేర్కొన్నారు.