మంచు మోహన్ బాబు విలక్షణమైన నటుడే కాదు. ఆయనది ముక్కుసూటి వ్యవహారశైలి. ఇండస్ట్రీలో ఆ తరహా శైలితోనే ఆయన తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు. ఆయన కుటుంబం విషయానికి వస్తే, ఒకే మాట..ఒకే తీరు. తండ్రి అయినా, కొడుకులు అయినా, కూతరు అయినా తండ్రి బాటే బాట..తండ్రి మాటే మాట. ఆయన అంటే గౌరవంతో కూడిన అభిమానం వల్ల వచ్చే భయం కూడా. అలాంటిది తొలిసారి మంచు ఫ్యామిలీలో రెండు రకాల అభిప్రాయాలు నెలకొన్నట్లు తెలుస్తోంది.
మంచు మోహన్ బాబు వైకాపాలో చేరారు. ఆయన కుమారుడు విష్ణు కూడా ఆయనతోనే వున్నారు. విష్ణు భార్య వైకాపా నేత జగన్ కు సోదరి వరుస. విష్ణు పెళ్లి దగ్గర నుంచి వాళ్లు కుటుంబాల మధ్య బంధాలు పెరుగుతూ వస్తున్నాయి. అయితే అదే సమయంలో నారా, నందమూరి కుటుంబాలతో కూడా వారి బంధాలు అలాగే వున్నారు. ఇలాంటి నేపథ్యంలో కేవలం కొన్ని కోట్ల మొత్తం బకాయిల కారణంగా ఏకంగా వైకాపా లో చేరడం అన్నది మోహన్ బాబు కుటుంబంలోని మంచు మనోజ్, మంచు లక్ష్మిలకు అంతగా ఇష్టం లేదని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే విధంగా మోహన్ బాబు తో సన్నిహితంగా వుండే కమ్మ సామాజిక వర్గ జనాలకు కూడా ఈ నిర్ణయం అంతగా నచ్చడం లేదని తెలుస్తోంది.
కానీ ఒక నిర్ణయం తీసుకుంటే దానికి బలంగా కట్టుబడి వుండే మోహన్ బాబు వీటిని అస్సలు పరిగణనలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. చంద్రబాబు విషయంలో మోహన్ బాబు డిఫర్ కావడం ఇది తొలిసారి కాదు. వాస్తవానికి హెరిటేజ్ కంపెనీలో మోహన్ బాబు కూడా వాటాదారు. హెరిటేజ్ ను చంద్రబాబు, బాలకృష్ణ, మోహన్ బాబు కలిసి స్థాపించారు. కానీ తరువాత ఏమయిందో తెలియదు కానీ, మోహన్ బాబు వాటాలు అన్నీ చంద్రబాబుకే వచ్చేసాయి. ఆ టైమ్ లో ఇద్దరి మధ్య కోర్టు వివాదాలు కూడా నడిచాయి.
నిన్నటికి నిన్న మోహన్ బాబు వైకాపాలోకి చేరుతుండగానే మంచు మనోజ్ వేరుగా పత్రికా ప్రకటన విడుదల చేయడం గమనార్హం. తనకు ఏ పార్టీ లేదని, ప్రజల పక్షం అని, తండ్రి వెనుక నడిచింది కేవలం స్టూడెంట్స్ సమస్య అని, అలాగే కుటుంబరావుపై విమర్శలు కూడా వ్యక్తిగతం కాదని, ఇలా చాలా వివరించారు.
ఇవన్నీ మనోజ్ ఇప్పుడు వైకాపా వేపు వెళ్లడం లేదని స్పష్టం చేస్తున్నాయి. మంచు లక్ష్మి కూడా నందమూరి కుటుంబంతో సాన్నిహిత్యంగా వుంటారు. ఆమె కూడా ఇప్పుడు మనకీ రాజకీయాలు అవసరమా? అనే భావంతో వున్నారని తెలుస్తోంది.
మొత్తం మీద ఏకమాటగా వుండే మంచు ఫ్యామిలీ ఇప్పుడు రాజకీయాల కారణంగా భిన్న అభిప్రాయాలు పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది.