ఆంధ్రాలో కేసీఆర్ కి ఏజెంట్ గా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు, కేసీఆర్ స్విఛ్ ఆన్ చేస్తేనే… ఆంధ్రాలో జగన్ ఫ్యాన్ తిరుతుంది, ఆంధ్రాని కేసీఆర్ కి సామంత రాజ్యంగా మార్చడమే జగన్ లక్ష్యం… ఎన్నికల ప్రచారంలో ఇలా చాలా విమర్శలు చేస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏపీ ప్రయోజనాలను కేసీఆర్ కి , తద్వారా మోడీకి తాకట్టు పెట్టడానికి జగన్ ప్రయత్నిస్తున్నారు అంటున్నారు. వాస్తవానికి, ఈ ప్రచారాంశం ప్రజల్లోకి బాగానే వెళ్లిందనే అభిప్రాయమే వ్యక్తమౌతోంది. ఆంధ్రా రాజకీయాల్లో కేసీఆర్ వేలు పెట్టడమేంటనే చర్చ కొన్ని వర్గాల్లో బలంగానే వినిపిస్తోంది. ఏపీలో కేసీఆర్ కి ఆ అవకాశం ఇచ్చేందుకు జగన్ ఉపయోగపడుతుండటం సరైంది కాదనే అభిప్రాయమూ వినిపిస్తున్న సమయం ఇది.
కేసీఆర్ – జగన్ దోస్తీ అంశాన్ని చాలా ప్రధానమైన అస్త్రంగా టీడీపీ వాడుకుంటోంది కదా. దీన్ని ఖండించే విధంగా వైకాపా వ్యూహం, ప్రచారం ఎందుకు ఉండటం లేదు? నాకు, కేసీఆర్ కి ఏంటి సంబంధం, ఆంధ్రా రాజకీయాల్లో నా ద్వారా తెరాస రావడమేంటి, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఇబ్బంది కలిగించే పనులు నేనెందుకు చేస్తా… పరోక్షంగానైనా ప్రజలకు వైకాపా చెప్పాల్సిన మాటలివి. కానీ, ఆ తరహా ప్రయత్నం జగన్ నుంచి ఇంతవరకూ జరగలేదనే చెప్పాలి. కేసీఆర్ పేరుతో జగన్ మీద జరుగుతున్న విమర్శల దాడికి ధీటైన సమాధానం ఇంకా ఇవ్వలేకపోతున్నారు.
తనపై వచ్చే ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవడం జగన్మోహన్ రెడ్డికి పెద్దగా ఇష్టం ఉండదని సన్నిహితులు అంటుంటారు. అందుకే, అలాంటి సందర్భాలు ఎదురైతే… వేరే టాపిక్ తో ఎదురుదాడి చేస్తారు, లేదంటే నవ్వుతూ తన అసహనాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తారంటారు. అయితే, ఇప్పుడు సందర్భం వేరే కదా. తెరాసతో జగన్ స్నేహం ఏంటనే స్పష్టత ప్రజలకు ఇవ్వాల్సిన సమయం ఇది. తెరాసతో దోస్తీ ఉంది, దాని వల్ల ఏపీ ప్రయోజనాలకు ఏమాత్రం నష్టం జరగదనే భరోసా ఇచ్చేలాగైనా జగన్ మాట్లాడటం లేదు. ఇంత పెద్ద ఎత్తున విమర్శల దాడి జరుగుతూ ఉంటే… ఈ అంశాన్ని ఎందుకో కొంత లైట్ గా తీసుకుంటున్నట్టున్నారు జగన్. రాజకీయంగా ఏరకమైన కుట్రలూ ఉద్దేశాలూ లేనప్పుడు ఈ విమర్శల్ని జగన్ ఎందుకు పడాలి? కేసులూ అవినీతి ఆరోపణలూ అంటే వాటికి సమాధానాలు జగన్ దగ్గర లేవు అనుకోవచ్చు. ఇలాంటి విమర్శలపైన అయినా ధీటుగా తిప్పి కొట్టాలి కదా. లేదంటే, ఈ విమర్శలు రాజకీయంగా వైకాపాకి ఎలాంటి నష్టం చేకూర్చవనే లెక్కలున్నాయా? ఇంతటి తీవ్ర విమర్శలపై స్పష్టమైన ఎదురుదాడి లేకపోతే, అది అంగీకార సూచకమే అవుతుంది. వైకాపా వ్యూహకర్తలు ఇది గమనిస్తున్నారో లేదో ?