ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయడానికి వివిద పార్టీలకు చెందిన నేతలంతా వరుస పెట్టి .. రాబోతున్నారు. జమ్మూకశ్మీర్ మాజీ సీఎం, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్.. ఫరూక్ అబ్దుల్లా.. తొలి రోజు చేసిన ప్రచారం.. హోరెత్తింది. జగన్ చేసిన రూ. 1500 కోట్ల ఆఫర్‌ను ఆయన బయట పెట్టడంతో కలకలం రేగింది. ఇప్పుడు వరుసగా.. అనేక మంది జాతీయ నేతలు రాబోతున్నారు. పశ్చిమబెంగాల్ సీఎం, ఫైర్‌బ్రాండ్ నాయకురాలు..మమత బెనర్జీ ప్రచారానికి వస్తున్నారు. మార్చి 31న విశాఖలో జరిగే ర్యాలీకి మమతా బెనర్జీ హాజరవుతారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్చి 28న విజయవాడలో జరిగే ఎన్నికల ప్రచారానికి వస్తారు. 31న మమత హాజరయ్యే సభకు కూడా కేజ్రీవాల్ వస్తున్నారు. ఎన్‌సీపీ అధినేత శరద్‌పవార్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మాజీ ప్రధాని దేవెగౌడలు చంద్రబాబు తరపున ప్రచారంలో పాల్గొంటారు.
కర్నాటక సరిహద్దు జిల్లాలైన అనంతపురం, కర్నూలు జిల్లాలో మాజీ ప్రధాని దేవెగౌడ ప్రచారంలో పాల్గొననున్నారు. అనంతపురం జిల్లాలో దేవెగౌడ ప్రచారం కలిసి వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక శరద్ పవార్ సైతం ఈ రెండు జిల్లాలో ప్రచారం నిర్వహిస్తారని అంటున్నారు. ఇక తేజస్వి యాదవ్ కూడా ఏపీలో ప్రచారానికి సై అంటున్నారు. ఇక ఏప్రిల్ 2న నెల్లూరులో అఖిలేష్ యాదవ్ ప్రచారం చేయనున్నారు. ఇలా జాతీయ స్థాయి నేతలంతా ఏపీలో ప్రచారానికి రెడీ అవుతున్నారు. విపక్షాల కూటమి.. ఇపుడు ఒక్క తాటిపై నడుస్తోంది. ముఖ్యంగా బీజేపీ అభ్యర్థులను ఓడించడమే కాదు… కూటమిలో ఉన్న పార్టీల గెలుపు కోసం నేతలందరూ ముందుకొస్తున్నారు.
ముఖ్యంగా చంద్రబాబుతో నేతలకు ఉన్న సాన్నిహిత్యంతో పాటు కొందరు నేతలు ప్రచారానికి సై అంటున్నారు. ఏపీలో ఎన్నికలు మొదటివిడతలోనే ముగుస్తుండటంతో.. చంద్రబాబు కూడా జాతీయ స్థాయిలో ప్రచారానికి సిద్ధమవుతున్నారు. అయితే ఏపీలో ప్రచారం ద్వారా.. విపక్షాల బలమెంతో, ఐక్యత పవర్ ఏంటో బీజేపీకి తెలిసేలా చేయాలని భావిస్తున్నారు. ఏపీలో పోలింగ్ ముగియగానే.. దేశంపై ఫోకస్ పెట్టబోతున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీలకు చంద్రబాబు ప్రచారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.