ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అభ్యర్థులపై వరుసగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఐటీ దాడుల ద్వారా అభ్యర్దులను మానసికంగా, నైతికంగా చికాకు పెట్టడంతో పాటు వారిని ఎన్నికల ప్రచారం సమయంలో తమ ఎదుట హాజరుకావాలనే నోటీసులు ఇస్తున్నారు. దీని వల్ల ప్రచార సమయం అసలే తక్కువ. ఇప్పుడు ఐటీ అధికారులు ఆ సమయాన్ని మింగేసే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజులలో మరికొంతమంది తెలుగుదేశం అభ్యర్దుల పై కూడా ఐటీ దాడులు జరుగుతాయని, తమ పార్టీ తరపున పోటీ చేస్తున్న వ్యాపారస్తులు, వివిధ కంపెనీ యజమానులుగా ఉన్న అభ్యర్ధులందరినీ తెలుగుదేశం పార్టీ అప్రమత్తం చేసింది. ఆడిటర్లను సిద్దంగా ఉంచుకోవడంతో పాటు అభ్యర్దుల తరపున ప్రతినిధులను కూడా ఐటీ అధికారులు దాడులు చేస్తే వారి వద్దకు పంపించాలని తెలుగుదేశం అధినాయకత్వం నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా.. ఓ బృందాన్ని నియమించింది.
ఐటీ బృందాలు ఎన్నికలకు ముందు చేస్తున్న ఈ హడావుడి కర్నాటకలో కాంగ్రెస్ అభ్యర్దులపై జరిగిన దాడులను గుర్తుకు తెస్తున్నాయని తెలుగుదేశం నేతలు అంటున్నారు. హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న తెలుగుదేశం అభ్యర్దులను అక్కడ అధికార పార్టీ ఇబ్బంది పెట్టడంతో పాటు, మొత్తం ముప్పై మంది పై దృష్టి సారించిన తరుణంలో ఎపీలో ఐటీ దాడులు ప్రారంభం కావడం పార్టీ వర్గాలలో కలకలం రేకెత్తిస్తుంది. ఎన్నికలకు ముందుగా.. దాదాపు అన్ని జిల్లాలో టీడీపీకి ఆర్థికంగా దన్నుగా ఉంటారనుకునేవారిపై… దాడులు చేశారు. ఇప్పుడు మళ్లీ ప్రారంభించారు. నాలుగు రోజుల క్రితమే వేరే రాష్ట్రాల నుంచి ఐటీ అధికారుల బృందాలు విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాలకు చేరుకున్నాయి. ఈ బృందాలకు ఎప్పటికప్పుడు ఉన్నతాధితారుల నుంచి వస్తున్న ఆదేశాల మేరకు దాడులకు శ్రీకారం చుడుతున్నాయి. మొన్న నెల్లూరులో అర్బన్ స్థానం నుంటి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ నివాసం, మెడికల్ కళాశాల పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ తరపున కొంత మందిని ప్రత్యేకంగా గురి పెట్టి.. ఈ తరహా దాడులు చేస్తున్నారు. ఓ హిట్ లిస్ట్.. ఐటీ అధికారుల వద్ద ఉందని చెబుతున్నారు. అదే సమయంలో.. వైసీపీ అభ్యర్థుల జోలికి వెళ్లే అవకాశమే లేదని అంటున్నారు. వారు యధేచ్చగా డబ్బుల పంపిణీ సాగిస్తున్నారని.. కానీ వారికి ఎలాంటి అడ్డంకులు లేవని.. టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. మొత్తానికి.. అభ్యర్థులు ఐటీ దాడుల విషయంలో టెన్షన్‌కు గురి కాకుండా.. టీడీపీ మాత్రం కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటోంది.