అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తో డీలా పడ్డ తెలంగాణ కాంగ్రేస్ పార్టీకి ఎమ్మెల్సీ ఫలితాలు వెయ్యేనుగుల బలాన్నిచ్చాయి. తిరుగులేని విజయాలతోతో జోరుమీదున్న టీఆర్ఎస్ కు గట్టి షాకిచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీ రహితమైనవే అయినా..వాటిల్లో రాజకీయాలను చొప్పించింది టీఆర్ఎస్ పార్టీయే. ఉద్యమ సమయంలో సెంటిమెంట్ రగిల్చి పార్టీ నుంచి అభ్యర్థులను నిలబెట్టే సంప్రదాయానికి తెరలేపింది టీఆర్ఎస్. ఆ ఫలితాలనుకూడా తన ఖాతాలో వేసుకుంటూ వచ్చింది. ఇక ఈ దఫా ఎన్నికల్లో కూడా ఒకచోట ఆ పార్టీ చీఫ్ విప్, మరో చోట ఆ పార్టీ ఎమ్మెల్సీ, మరోచోట గ్రూప్ వన్ అధికారుల సంఘం అధ్యక్షులు చంద్రశేఖర్ గౌడ్ టీఆర్ఎస్ మద్దతు తోనే బరిలో దిగారు. ఆ ముగ్గురు ఓడిపోవడం, కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందడంతో హస్తం పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
ఓ వైపు ఓటమి, మరో వైపు వలసలతో ఉక్కిరిబిక్కిరి అవుతోన్న తెలంగాణ కాంగ్రేస్ పార్టీ కి ఈ ఫలితాలు రిలీఫ్ నిచ్చాయి. ఈ ఫలితాలు నింపిన జోష్ తో లోక్ సభ ఎన్నికలకు మరింత దూకుడుగా వెళ్లాని డిసైడ్ అయింది టీ. కాంగ్రేస్. ఎమ్మెల్సీ ఫలితాలే లోక్ సభ ఎన్నికల్లోనూ ఉంటాయని అంచనా వేస్తున్నారు హస్తం పార్టీ నేతలు. పట్టభద్రులు, టీచర్లు ఓటర్లుగా ఉన్న ఎన్నికల్లో ఫలితాలు టీఆర్ఎస్ కు పూర్తిగా ప్రతికూలంగా వచ్చాయి. ఈ విషయాన్ని బలంగా జనాల్లోకి తీసుకువెళ్లి లోక్సభ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు పొందేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా కొన్నినినాదాలు సిద్దం చేసుకుంటున్నారు. చదువు చెప్పే సార్లు తిరస్కరించిన పార్టీని మనం ఆదరిద్దామా? విద్యావంతులు ఓడించిన పార్టీని మనం గెలిపిద్దామా? ప్రధానినిని నిర్ణయించే ఎన్నికల్లో తెలంగాణ ఇచ్చిన పార్టీకి అవకాశం ఇవ్వండనే నినాదాలతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రకారం చూస్తే… కాంగ్రెస్ పార్టీకి.. ఒక్క సీటు కూడా వస్తుందన్న గ్యారంటీ లేదు. కానీ బలమైన .. సీనియర్ నేతల్ని బరిలో నిలపడంతో… చేతులెత్తేసే పరిస్థితి లేదని ముందుగానే సూచనలు పంపారు. ఈ సమయంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. కాంగ్రెస్ పార్టీకి ఓ ధైర్యాన్నిచ్చాయి. ప్రజల్లో మార్పు వస్తోందని.. ప్రశ్నించే గొంతుక లేకపోతే ఎలా .. అన్న ఉద్దేశాన్ని.. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.