“ఎన్నికల దాకా ఆపండి” – ఇవీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలక్షన్ కమిషన్ వద్ద రాజకీయ పార్టీలు చేస్తున్న విజ్ఞప్తులు. వివరాల్లోకి వెళితే, వైఎస్ఆర్సిపీ వివేకానంద రెడ్డి హత్య కేసు వివరాలను ఎన్నికలయ్యేదాకా మీడియా ముందు, ప్రజల ముందు పెట్టనీయవద్దని ఎలక్షన్ కమిషన్ ని ఆశ్రయించింది. ఇక టీడీపీ తరపున నటి దివ్య వాణి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఎన్నికలయ్యేదాకా ఆపండి అంటూ ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించింది.
వివేకానంద రెడ్డి హత్య విషయంలో సిట్ నివేదిక ఎన్నికలయ్యేంత వరకు బయట పెట్ట వద్దు అంటున్న జగన్:
వైయస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే వైఎస్సార్ సీపీ నేతలు, సాక్షి ఛానల్ తో సహా, మిగతా చానల్స్ కూడా దీన్ని ముందు సహజ మరణం అని గుండెపోటు కారణం అని ప్రపంచానికి చెబుతూ వచ్చారు. అయితే మధ్యాహ్నానికి మొత్తం మారిపోయింది. ఇది సహజ మరణం కాదని, హత్య అని తెలుగుదేశం పార్టీ నేతలు దగ్గరుండి చేయించారని జగన్ ఆరోపణలు చేశారు. అయితే ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ నేతలు చేయించిన హత్య అయి ఉంటే ఉదయం నుంచి సాక్షి ఛానల్ దీనిని హత్య అని చెప్పడమే కాకుండా వరుస కథనాలు ప్రసారం చేసి ఉండేదని, గుట్టుచప్పుడు కాకుండా దీన్ని సహజ మరణం అని ముగించాలి అనుకున్న ప్రయత్నాలు విఫలం కావడంతో నే వైఎస్ఆర్ సీపీ నేతలు, జగన్ యూటర్న్ తీసుకుని ఉండవచ్చు అన్న అనుమానాలు జనాలకు కలిగాయి. అయితే విచారణ ఫలితాలు బయటకు వస్తే నిజాలు తెలుస్తాయి అనుకుంటే, వైఎస్ఆర్ సీపీ నేతల స్వయంగా ఈ నివేదిక ని ఎన్నికలయ్యేంత వరకు బయట పెట్టవద్దని కోరుతూ, కోర్ట్ ని ఎలక్షన్ కమిషన్ ని ఆశ్రయించడం ప్రజలకు విస్మయాన్ని కలిగిస్తోంది. బహుశా ఇంటి దొంగల పని అని బయటకు తెలిస్తే పార్టీ మీద , అనవసరంగా కీలకమైన సమయంలో మచ్చ పడుతుందన్న ఉద్దేశంతో నే జగన్ ఈ నిర్ణయాన్ని తీసుకునే ఉండవచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బహుశా ఈ కారణం చేతనే ముందు ఇది సహజ మరణం గా చిత్రీకరించే ప్రయత్నం జరిగి ఉండవచ్చు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఆపమంటున్న దివ్యవాణి
తెలుగుదేశం పార్టీలో ఈమధ్య చేరిన మాజీ నటి దివ్య వాణి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని ఆపమంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. ఎన్నికలయ్యాక సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా కోరింది. వైకాపా నేతలు నిర్మించిన ఈ సినిమా ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందంటూ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. అయితే దివ్యవాణి విజ్ఞప్తిని ఎన్నికల సంఘం ఏమాత్రం పట్టించుకుంటుంది అనే విషయం తెలియాల్సి ఉంది. వై ఎస్ ఆర్ సి పి కోరిన వెంటనే ఎస్పీలను బదిలీ చేయడానికి ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర సంస్థలు తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తిని ఎంతవరకు పట్టించుకుంటారు అన్న విషయంలో ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం కారణంగా ప్రజలకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది
ఎన్నికల దాకా ఆపితే చాలా?
ఎన్నికల వరకు మాత్రమే ఆపండి అనే రాజకీయ పార్టీలు కోరడం ప్రజలకు విస్మయాన్ని కలిగిస్తోంది. వివేకానంద రెడ్డి హత్య విషయంలో వాస్తవాలు బయటకు రావాల్సి ఉంది. నిజంగా జగన్ ఆరోపించినట్లుగా తెలుగుదేశం పార్టీ నేతల ప్రమేయం ఉంటే, ఇది తమ ఇంటి దొంగల పని కాకపోయి ఉంటే దీన్ని ఆపమని కోరాల్సిన అవసరం లేదు. ఒకవేళ తమ ప్రమేయం లేకపోయినా తమని అధికారపక్షం అక్రమంగా అరెస్టు చేస్తే తప్పకుండా ప్రజలు అధికార పక్షానికి బుద్ధి చెబుతారు. మరి ఇవన్నీ తెలిసి ఉండి కూడా కేంద్రం వద్ద తనకున్న పలుకుబడితో ప్రజలకు ఎన్నికల ముందు నిజాలు తెలియకుండా చేయడం జగన్ కి ఎంత వరకు సమంజసం.
అలాగే తెలుగుదేశం పార్టీ సంగతి. చంద్రబాబు వెన్నుపోటు ఏమీ ఎవరికీ తెలియని రహస్యం కాదు. వెన్నుపోటు పొడిచాడని తెలిసికూడా ప్రజలు 19 99 లో 2014 లో చంద్రబాబును గెలిపించారు. మరి ఇప్పుడు వాస్తవాలు బయటకు రాకూడదని తాపత్రయ పడటం ఎందుకు. ఒకవేళ మరీ వ్యతిరేకంగా, అసత్యాలను గనుక సినిమాలో చూపించి ఉంటే, ప్రజలే ఆ సినిమాను తిప్పి కొడతారు.
మొత్తానికి ఏదైతేనేమి, వాస్తవాలను బయటకు రానివ్వకూడదు అంటూ ఈ రెండు పార్టీలు కూడా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించడం చూస్తుంటే, రాజకీయ పార్టీలు ” ఒక నిజానికి ఎంత భయపడతాయో” అన్న సంగతి అర్థమవుతుంది.