హైదరాబాద్: ఓటుకు నోటు కేసులు నిన్న అరెస్టయిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్య తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశాన్ని తెలంగాణలో లేకుండా చేయటంకోసం సీఎమ్ కుట్రలు చేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 63 సీట్లు గెలిచిన టీఆర్ఎస్ ఇప్పుడు 84 సీట్లకు ఎలా పెరిగిందని ప్రశ్నించారు. దీనంతటిపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని, బెదిరింపులకు తాను భయపడనని చెప్పారు. ఆయనను ఇవాళ ఏసీబీ కోర్లులో హాజరుపరచగా కోర్టు ఆయనకు 14రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఎమ్మెల్యే అయినందున సండ్రను ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. సండ్ర బెయిల్ పిటిషన్ రేపు విచారణకు రానుంది. ఇవాళ చర్లపల్లి జైలుకు తరలిస్తున్నపుడు సండ్ర వెంకట వీరయ్య ముఖంలో ఏమాత్రం ఆదుర్దా లేకుండా నవ్వుతూ కనిపించారు. తెలుగుదేశం నాయకుడు నామా నాగేశ్వరరావు సండ్రను కలుసుకున్నారు.