ఫెడరల్ ఫ్రెంట్ వాదాన్ని ఇతర పార్టీలకు కూడా ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు తెరాస ఎమ్మెల్యే కేటీఆర్. భాజపాయేతర, కాంగ్రెసేతర పార్టీలన్నీ ఒక వేదిక మీదికి తేవడమే ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యం కదా. అదే లెక్కల్లో కాంగ్రెస్, భాజపా అంటే గిట్టని పార్టీలు దేశంలో దాదాపు 15 ఉన్నాయని అన్నారు కేటీఆర్. ఆ జాబితాలో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిని కూడా చేర్చారు. తెలంగాణ ప్రజలు తమకు 16 లోక్ సభ స్థానాలు కట్టబెడితే… జాతీయ స్థాయిలో మరో 150 సీట్లు తమకు కలిసి వస్తాయన్నారు. యూపీలో మాయావతి, అఖిలేష్ యాదవ్, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, ఒడిశాలో నవీన్ పట్నాయక్, ఏపీ నుంచి జగన్మోహన్ రెడ్డి ఆ జాబితాలో ఉన్నారన్నారు. వీరందరూ మనతో కలిసే అవకాశం ఉందన్నారు. భాజపా అభ్యర్థులకు ఓటేస్తే ఆ పార్టీకి లాభమనీ, కాంగ్రెస్ కి ఓటేస్తే ఆ పార్టీకి లాభమనీ, అదే తెరాసను గెలిపిస్తే… తెలంగాణ గడ్డకు లాభమన్నారు కేటీఆర్.
ఫెడరల్ ఫ్రెంట్ లో కాంగ్రెస్, భాజపాలు ఉండకూడదని మొదట్నుంచీ అంటున్నది ఎవరు… కేసీఆర్ మాత్రమే కదా. రెండు జాతీయ పార్టీలకూ దేశానికి ఏం చేశాయా లేదా అనే చర్చను కాసేపు పక్కనపెడదాం. ఎందుకంటే, కేసీఆర్ సొంత రాజకీయ లక్ష్యం కోసం ఆయన ఎంచుకున్న ప్రచారమార్గమిది. కాంగ్రెస్, భాజపాలకు దూరం పాటించాల్సిన అవసరం కేసీఆర్ కి ఉంది. ఆ అవసరాన్ని ఇతర పార్టీల మీద రుద్దేస్తే ఎలా..? ఇప్పుడు కేటీఆర్ చేస్తున్న ప్రయత్నం అచ్చంగా అదే. కేసీఆర్ ప్రతిపాదిత ఫ్రెంట్ లోకి ఏ పార్టీలైనా వచ్చి చేరొచ్చు అంటే తప్పేముంది? కాంగ్రెస్, భాజపాలతో దూరంగా ఉన్నవారు మాత్రమే రావాలని అంటే ఎలా…? దేశవ్యాప్తంగా 15 పార్టీలు తమతో కలిసి నడిచేందుకు సిద్ధంగా ఉన్నాయంటున్నారు. మరి, ఆ మాట ఆ పార్టీలు ఎందుకు చెప్పవు? కేసీఆర్ ఫ్రెంట్లో మేమున్నామని మమతా బెనర్జీ చెప్పారా, మాయావతి చెప్పారా, నవీన్ పట్నాయక్ చెప్పారా…? తెరాసతో కొన్ని రాజకీయాల అవసరాలున్న జగన్ తప్ప, ఎవ్వరూ కేసీఆర్ కి మద్దతు ప్రకటించింది లేదు. ఒకవేళ అదే పరిస్థితి ఉంటే… ఆ నాయకుల్లో కొందరైనా తెలంగాణకు వచ్చి ప్రచారం చేయడం లేదే.
ఇంకోటి… మీరు 16 సీట్లిస్తే, అవతల 150 వస్తాయంటూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టే విధంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు. అవతల 150 వస్తున్నాయి కాబట్టి, ఈ పదహారు మాకివ్వాలన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఉన్నాయో లేవో తెలియని ఆ 150 నంబర్ చూపిస్తూ… కేసీఆర్ వెంటే అందరూ ఉన్నారని నమ్మించే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారు. తమ జాతీయ రాజకీయ లక్ష్యాన్ని… ఇతర పార్టీలకూ, చివరికి తెలంగాణ ప్రజలకు కూడా ఆపాదించేస్తున్నారు.