వైకాపా, భాజపాల మధ్య రహస్య స్నేహం మరోసారి బహిర్గతమైన సందర్భం ఇది. కేంద్రం, వైకాపా కుమ్మక్కై.. ఏపీ అధికార పార్టీపై కక్ష సాధింపులకు దిగుతోందనడానికి తాజాగా ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే మరో సాక్ష్యం. విచిత్రం ఏంటంటే… ఆయా అధికారులకు కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా, కేవలం వైకాపా ఫిర్యాదును మాత్రమే ప్రాతిపదికగా తీసుకుని కేంద్రం స్పందించడం. సరే, దీనికి ధీటుగా రాష్ట్ర ప్రభుత్వమూ స్పందించింది. వారు చెయ్యాల్సిన న్యాయపోరాటం చేస్తామనీ అంటున్నారు. అయితే, ఇదంతా ఇవాళ్ల జరిగిన విషయంగా మనం చూస్తున్నాం. అచ్చంగా ఇది ఇలానే జరుగుతుందని గత శుక్రవారమే ఒక వ్యక్తికి తెలుసట. ఆయనే… వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి.
గత శుక్రవారం విజయసాయి రెడ్డి ఢిల్లీలో మీడియా మిత్రులతో ఇదే అంశమై మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు నాయుడుకు కొమ్ము కాసే విధంగా కొంతమంది ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నారనీ, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరుతున్నామని అన్నారట. అంతేకాదు… తాము సోమవారం ఫిర్యాదు చేయబోతున్నామనీ, ఆయా అధికారులపై మంగళవారం చర్యలు ఉండేలా జీవోలు వచ్చేస్తాయని కూడా విజయసాయి ఆరోజునే చెప్పారట. ఆ అధికారులను విధుల్లోంచి తప్పించబోతున్నారని కూడా చెప్పినట్టు సమాచారం. అచ్చంగా అలానే జరిగింది.
ఫిర్యాదు చేయడానికి ముందే… ఈసీ తీసుకునే చర్యలు, అధికారులను విధుల్లోంచి తొలగిస్తున్నట్టు జారీ కాబోయే ఉత్తర్వుల గురించి విజయసాయి రెడ్డికి ఎలా తెలిసినట్టు? అంటే, ఏపీలో జగరబోయే ఈ తరహా పరిణామాలు విజయసాయి రెడ్డి లాంటివారికి ముందుగా తెలుస్తున్నాయంటే… భాజపాతో వారు ఏ స్థాయి దోస్తీతో ఉన్నట్టు? ఏపీలో టీడీపీని దెబ్బతియ్యాలనే ఉమ్మడి లక్ష్యంతో భాజపా, వైకాపాలు కలిసి పనిచేస్తున్నాయని అనడానికి ఇంతకంటే ఇంకేం కావాలి? ఈ తాజా బదిలీల వ్యవహారం వెనక వైకాపా, భాజపాల మిలాకత్ ఉందని బయటకి రావడంతో… రాజకీయంగా ఈ అంశం కూడా వైకాపాకి మైనస్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ఎన్నికల్లో నేరుగా టీడీపీని ఎదుర్కొనే వ్యూహాల కంటే, ఇలా ఇతర మార్గాల్లో దెబ్బ తీయడానికే వైకాపా ఎక్కువ ప్రయత్నిస్తోందని ఇప్పుడు మరోసారి ప్రజలు చర్చించుకునేలా పరిస్థితి మారుతోంది.