అధికారం ఉందని.. నిబంధనలకు విరుద్ధంగా.. ఆంధ్రప్రదేశ్‌పై అడ్డగోలు పెత్తనం చేయడానికి .. సామంతుల్ని గద్దెపై కూర్చోబెట్టడానికి…ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకూ జరుగుతున్న ప్రయత్నాల్లో కొత్త కొత్త అంకాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణల ఆధారంగా నేరుగా.. ఇంటలిజెన్స్ చీఫ్‌ను, ఇద్దరు ఎస్పీలను బదిలీ చేయడం.. చర్చనీయాంశం అవుతోంది. అధికార యంత్రాంగంలో నైతిక స్థైర్యం దెబ్బతినే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ ను ఢిల్లీ రాజకీయం పూర్తి స్థాయిలో టార్గెట్ చేసింది. ఢిల్లీకి లొంగకపోతే.. అధికారాన్ని ప్రయోగించి లొంగ దీసుకునే ప్రయత్నం జరుగుతోంది.
ఈసీ ఉన్నది మోడీ చెప్పినట్లు చేయడానికా..?
కొన్నాళ్ల కిందట ఈసీ ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి మధ్యాహ్నం రెండు గంటలకు ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసింది. కానీ తర్వాత దాన్ని సాయంత్రం ఐదు గంటలకు వాయిదా వేసింది. ఎందుకు వాయిదా వేసిందో.. సాయంత్రానికి అందరికీ తెలిసొచ్చింది. ఈ మధ్యలో.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. రాజస్థాన్‌లో ఎన్నికల ప్రచారసభలో పాల్గొని.. రుణమాఫీ హామీ ప్రకటించారు. దీని కోసమే.. ఈసీ ప్రకటనను వాయిదా వేసుకుంది. కాదని ఈసీ చెప్పినా.. నమ్మే పరిస్థితులు లేవు. ఈసీ అంతగా.. కేంద్ర ప్రభుత్వానికి.. పెద్దలకు లొంగిపోయి పని చేస్తోంది. ఆ విషయం ఎన్నికల షెడ్యూల్ ప్రకటనలోనే తేలిపోయింది. బీజేపీకి ఏ మాత్రం బలం లేని రాష్ట్రాల్లో… ఎన్ని సీట్లు ఉన్నా.. ఒకే విడతలో.. అదీ మొదటి విడతల్లోనే… ఎన్నికలు పూర్తి చేస్తోంది. బీజేపీ.. ఇతర పార్టీలతో.. పోటాపోటీగా ఉన్న రాష్ట్రాల్లో… అదీ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఏడెనిమిది విడతలు పెట్టారు. అంతా బీజేపీ ప్రచారానికి వెసులుబాటు కల్పించడానికేనని విమర్శలొచ్చాయి. పైగా.. బెంగాల్లో.. రంజాన్ మాసంలో… అన్ని విడతల పోలింగ్ పెట్టడం.. ముస్లిం వర్గాలను ఓటింగ్‌కు దూరం చేయడానికేనని కూడా విమర్శలు వచ్చాయి. ఈ విమర్శలన్నీ కళ్ల ముందు కనిపిస్తూండగానే.. ఏపీపై విరుచుకుపడ్డారు. బీజేపీ అనుకూల వైసీపీ.. ఇచ్చిన ఫిర్యాదుల ప్రకారం.. పోలీసు అధికారుల్ని బదిలీ చేసి పడేశారు.
ఏపీలో సామంతుల్ని గెలిపించడానికి ఈసీని కూడా వాడుతున్నారా..?
ఏపీ, తెలంగాణలో కలిపి 42 పార్లమెంట్ స్థానాలు ఉంటాయి. మామూలుగా అయితే… రెండు విడతల్లో పెడతారు. కానీ ఒక్క విడతలోనే పెట్టేస్తున్నారు. దానికి కారణం.. హైదరాబాద్‌లో ఓటు ఉన్న వారు.. ఏపీలో కూడా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని.. వైసీపీ నేతలు ఫిర్యాదు చేయడమే దీనికి కారణం. ఇప్పుడు.. వైసీపీ నేతలు.. ఫిర్యాదులు చేయగానే కీలకమైన పోలీసు అధికారుల్ని బదిలీ చేశారు. అందులోనూ.. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ ఇప్పుడు కీలక దశలో ఉంది. అయినా కడప ఎస్పీని బదిలీ చేశారు. ఐపీఎస్ అధికారుల బదిలీలకు కారణం ఏమిటో మాత్రం చెప్పలేదు. ఓ వైపు కేంద్రం ఎలా వ్యవహరిస్తుందో.. ఈసీ కూడా.. ఏపీ విషయంలో అంతే వ్యవహరిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పై తమకు సంపూర్ణ హక్కులు ఉన్నాయన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. విభజన చట్టాన్ని కూడా అమలు చేయకుండా.. బీజేపీ ఇంత కాలం.. ఏపీని మోసగిస్తే.. ఇప్పుడు… ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుని ఆ బాధ్యతను.. ఈసీ తీసుకుంది
ఆ ఇద్దరు ఎస్పీల లేఖలకు సమాధానం చెప్పే దమ్ముందా..?
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను.. ఇంత కాలం ప్రొత్సహించిన మోదీ .. ఇప్పుడు వారికి అనుకూలంగా ఈసీ వ్యవహిరంచేలా… చేస్తున్నారన్న విమర్శలు టీడీపీ వర్గాల నుంచి వస్తున్నాయి. అంటే.. ఓ రకంగా.. ఏపీపై పెత్తనం కోసం.. తీవ్ర స్థాయిలో.. అన్ని వైపుల నుంచి దండయాత్ర జరుగుతోందన్న అభిప్రాయానికి రాజకీయ పార్టీలు వచ్చాయి. ఒకే ఒక్క టార్గెట్ పెట్టుకుని వ్యవస్థలన్నింటినీ ఉపయోగించుకుని.. తమ లక్ష్యం సాధించుకోవాలనుకుంటున్నారని .. ఏపీ జుట్టు తమ చేతుల్లోకి తెచ్చుకోవాలనుకుంటున్నారన్నారు. అందుకే… ఐపీఎస్‌ల కన్నా.. ఆర్థిక నేరస్తులనే ఈసీ ఎక్కువగా నమ్ముతోంది. బదిలీ వేటుకు గురైన ఇద్దరు ఎస్పీలు.. నేరుగా ఈసీకే లేఖలు రాశారు. వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఈసీపై ఉంది. ఈసీకి ఎంత అధికారం ఉందో.. అంత కంటే ఎక్కువగా బాధ్యత ఉంది.