నిజామాబాద్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు వాయిదా పడతాయనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ 505 మంది నామినేషన్లు చెల్లుబాటు అయ్యాయి. ఒక్క నిజామాబాద్ స్థానంలోనే రికార్డు స్థాయిలో 191 నామినేషన్లు ఓకే అయ్యాయి. ఒక్కటి కూడా ఉపసంహరించుకోలేదు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత కూడా అంతే మంది పోటీలో ఉంటే రిటర్నింగ్ అధికారి వాస్తవ పరిస్థితిని ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తారు. అంత మంది బరిలో ఉంటే.. ఈవీఎంలు ఉపయోగించడం సాధ్యం కాదు. బ్యాలెట్‌తోనే నిర్వహించాలి. అందుకే.. ఎన్నికల సంఘం గుర్తించిన ప్రింటర్లతో అధికారులు సమావేశం అయితే.. వారు నిర్ణీత గడువులోగా బ్యాలెట్ పేపర్లు ముద్రించగలమని హామీ ఇస్తే యథావిధిగా ఏప్రిల్ 11నే పోలింగ్ జరుపుతారు. లేదంటే వాయిదా పడుతుంది.
నిజామాబాద్ పరిధిలో రైతులు ఎక్కువగా ఎర్రజొన్న, పసుపు, చెరుకును పండిస్తున్నారు. గత ఏడాది ఎర్రజొన్నను కొనుగోలు చేసిన ప్రభుత్వం.. ఈ ఏడాది పట్టించుకోలేదు. దీంతో రైతులు నెల రోజులపాటు ధర్నాలు, ఆందోళనలు చేపట్టారు. అయినా సర్కారు స్పందించకపోవడంతో చివరికి తక్కువ ధరకే వ్యాపారులకు అమ్ముకున్నారు. ఇక పసుపు బోర్డు ఏర్పాటు కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా కేంద్రం ముందుకు రాలేదు. దీంతో రైతులు చివరకు బ్యాలెట్‌ను ఎంచుకున్నారు. తమ సమస్యను జాతీయ స్థాయిలో అందరి దృష్టికి తీసుకెళ్లేందుకు లోక్‌సభ ఎన్నికలను వేదికగా ఉపయోగించుకోవాలనుకున్నారు. ఇందుకోసం రైతులే అభ్యర్థులై భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు.
1996లో నల్లగొండ లోక్‌సభ స్థానంలో ఇలాంటి సమస్య తలెత్తడంతో పోలింగ్‌ను వారంపాటు అధికారులు వాయిదా వేశారు. ప్రస్తుతానికి బరిలో 191 మంది అభ్యర్థులు ఉన్నారు. వీరిలో 186 మంది రైతులు పోటీలో ఉన్నారు. వీరంతా నామినేషన్లను విత్‌డ్రా చేసుకోని పక్షంలో ఇక్కడ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు తప్పకపోవచ్చు.అయితే రైతులు నామినేషన్లు వేయడం వెనుక టీజేఎస్ అధినేత కోదండరాం ఉన్నారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే రైతులను బుజ్జగించేందుకు టీఆర్ఎస్ ఒకసారి ప్రయత్నించినా సఫలం కాలేదు.