వైఎస్ వివేకా హత్య కేసులో.. సాక్ష్యాలు తారుమారు చేసిన ఆరోపణలపై పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ప్రకాష్ అనే వారిని అరెస్ట్ చేశారు. ఈ నెల 15న ఉదయం బాత్రూమ్లో ఉన్న వివేకా మృతదేహాన్ని.. బెడ్రూమ్కు తరలించినట్లు గుర్తించారు. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఉదయం లేఖ దొరికినా సాయంత్రం వరకు పోలీసులకు ఇవ్వలేదనే కారణంతో.. వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చూపించారు. వివేకా ఇంట్లో వంట మనిషి లక్ష్మి కుమారుడు ప్రకాష్ రక్తం కడిగించారన్న కారణంగా అరెస్ట్ చేశారు. హైకోర్టులో కేసు ఉన్నందున మీడియా సమావేశం కాకుండా.. ప్రెస్‌నోట్ విడుదల చేశారు డీఎస్పీ.
వైఎస్ వివేకా హత్య కేసులో పోలీసులు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కేసు చిక్కుముడి దాదాపుగా విడిపోయిందనుకుంటున్న సమయంలో… కడప ఎస్పీని బదిలీ చేశారు. వారంలో నాలుగు రోజులు అవినాష్ రెడ్డిని పోలీసులు పిలిపించి ప్రశ్నించారు. ఈ లోపే కొంత మంది నిందితుల బంధువులు… హేబియస్ కార్పస్ పిటిషన్ల పేరుతో… హైకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ కారణంగా పోలీసులు ముందు జాగ్రత్తగా.. సాక్ష్యాలను తారుమారు చేసిన కేసు కింద.. వీరిని అరెస్ట్ చూపించారు. అసలు తీగ లాగారని.. సాంకేతిక ఆధారాలతో సహా.. అరెస్టులు చూపించబోతున్నారని ప్రచారం జరిగింది. ఈ లోపే.. ఎస్పీని బదిలీ చేయడం.. సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్లపై హైకోర్టులో వాదనలు జరుగుతూండటంతో.. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. హైకోర్టు నుంచి విచారణ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే… ఆ విషయాలు బయటపెట్టే అవకాశం ఉందంటున్నారు.
సీబీఐ విచారణకు ఆదేశించాలని మాత్రమే కాదు.. వివరాలు బయట పెట్టవద్దన్న పిటిషన్ కూడా.. హైకోర్టులో విచారణలో ఉంది. అందుకే.. అరెస్ట్ చేసినట్లు మాత్రమే ప్రెస్‌నోట్ రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు.. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈ కేసు విషయంలో.. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలు చేశారు. ఆయన నేరుగా.. సాక్ష్యాలు చెరిపేసిన ఘటనలో నిందితుడని మండిపడ్డారు. సాక్ష్యాలు చెరిపేయడం.. హత్య చేసినంత నేరమన్నారు. ఎవర్నీ వదిలి పెట్టబోమని.. వైఎస్ హత్య కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరూ జైలుకెళ్లాల్సిందేనని హెచ్చరించారు.