చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న డీజీపీతోపాటు కొంతమంది ఎస్పీలను బదిలీ చేయాలంటూ సీఈసీని కోరారు వైకాపా నేతలు. ఎన్నికల సంఘాన్ని కలిసిన తరువాత… మీడియాతో మాట్లాడారు ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఎవ్వరినీ లెక్కచేయని పరిస్థితి ఆంధ్రాలో ఉందన్నారు. గతంలో ఆదాయపన్ను శాఖను తాము లెక్కచేయమని అన్నారనీ, సీబీఐకి అనుమతి లేదన్నారని విజయసాయి చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం సంస్థల్నీ అనుమతించేది లేదంటారన్నారు. ఇప్పుడు, స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని చంద్రబాబు నాయుడు బేఖాతరు చేస్తున్నారన్నారు. ఇది ఒక రాజ్యాంగపరమైన సంక్షోభం అన్నారు! దీనికి మూలకారకుడు ఆర్పీ ఠాకూర్ అన్నారు.
మూడు రోజుల కిందట, ఇదే ఠాకూర్ తన కాన్వాయ్ లో రూ. 35 కోట్లు అమరావతి నుంచి ప్రకాశం జిల్లాకి తరలించారన్నారు. తెలుగుదేశం తొత్తుగా, కార్యకర్తగా పనిచేస్తున్న ఠాకూర్ ని వెంటనే బదిలీ చేస్తేగానీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదనే విషయాన్ని కమిషన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు విజయసాయిరెడ్డి. గతంలో తాము వివిధ స్థాయిల్లో ఉన్న అధికారులు బదిలీని కోరామనీ, కానీ తాము ఎలక్షన్ కమిషన్ కి నివేదించినవాటిలో సింహభాగం చెయ్యేలేదన్న విషయాన్ని మరోసారి ప్రస్థావించామన్నారు. గతంలో తాము అడిగినవాటిలో ఒకటో రెండో తప్ప వేటిపైనా సీఈసీ సానుకూలంగా స్పందించలేదనీ, అందుకే తాము కొంత అసంతృప్తికి గురయ్యామన్నారు. తమకు న్యాయం జరగలేదనీ, ఈసారైనా న్యాయం చేయాలంటూ కమిషన్ ను కోరామన్నారు.
రాజ్యాంగ సంస్థల్ని ఏపీ ప్రభుత్వం నమ్మడం లేదంటూ విజయసాయి చెబుతుంటే… నమ్మనివారు ఎవరైనా ఉంటే అది వారే కదా అనిపిస్తుంది! ఆంధ్రాలో పోలీసులని జగన్ నమ్మలేదు. విశాఖ విమానాశ్రయంలో దాడి జరిగితే, ఆంధ్రా పోలీసుల విచారణ సరిపోదంటారు. జగన్ సోదరి కూడా ఏపీ పోలీసుల్ని నమ్మకుండా హైదరాబాద్ లో ఫిర్యాదులు చేశారు. చివరికి, డాటా చోరీ వివాదంలో కూడా ఆంధ్రా వ్యవస్థల్ని నమ్మం అన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు కూడా వేరెవరో దర్యాప్తు చేయాలంటారు. అసెంబ్లీకి రారు… ఎందుకంటే, శాసన సభపై నమ్మకం లేదంటారు. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలపై నమ్మకం ఎవరికి లేనట్టు..? కేంద్ర సంస్థల్ని తమ రాజకీయ లక్ష్యాలకు అనుగుణంగా మోడీ సర్కారు ప్రయోగిస్తుంటే… రాజ్యాంగం కల్పించిన పరిమితులకు లోబడే సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఒక్క ఏపీ మాత్రమే కాదు… భాజపా రాజకీయ దాడులను తట్టుకోవడం కోసం మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే పనిచేశాయి. పోలీసులు మీద, అసెంబ్లీ మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేనివారు ఎవరో ప్రజలకు ఇంత స్పష్టంగా కనిపిస్తోంది కదా!