గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. 150 డివిజన్లలో మంగళవారం ఓటింగ్ జరుగుతుంది. ఈసారి కనీవినీ ఎరుగని విధంగా డబ్బు ఖర్చయింది. రూల్ ప్రకారం ఒక అభ్యర్థి 5 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాలి. నామినేషన్ నాడే చాలా మంది ఈ మొత్తం ఖర్చు పెట్టి ఉంటారని అంచనా.
పాతబస్తీలో, కొత్త నగరంలోని ఏవో కొన్ని డివిజన్లను మినహాయిస్తే, మెజారిటీ డివిజన్లలో పోటాపోటీగా డబ్బు ఖర్చు పెట్టారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు కోటి రూపాయల వరకూ ఖర్చుపెట్టారనేది టాక్ ఆఫ్ ది టౌన్. ఇక ఇతర పార్టీల వారు, రెబెల్స్, సొంత బలాన్ని నమ్ముకుని పోటీ చేసిన ఇండిపెండెట్ అభ్యర్థులు ఇలా ఒక్కో డివిజన్లో మొత్తం మీద 3 కోట్ల రూపాయలకు పైనే ఖర్చయి ఉంటుందని అంచనా.
కనీసం 90 నుంచి 100 డివిజన్లలో ఈ పరిస్థితి ఉందని పరిశీలకుల అభిప్రాయం. అంటే, మొత్తం మీద అన్ని డివిన్లలో అభ్యర్థుల ఖర్చు 350 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. కేవలం ఒక కార్పొరేషన్ లో ఖర్చు పెట్టడం అనేది బహుశా ఎక్కడా జరగదేమో అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇంత ఖర్చు పెట్టిన అభ్యర్థులు రేపు గెలిస్తే ప్రజల కోసం పనిచేస్తారో తమ కోసం పనిచేస్తారో ఊహించడం కష్టమేం కాదు.
ఇక్కడితో ఆగలేదు. మేయర్, డిప్యుటీ మేయర్ ఎన్నికల్లో ఏం జరుగుతుందనేది మరో ఆసక్తికరమైన విషయం. గత డిసెంబర్లో ఎం ఎల్ సి ఎన్నికల కోసం చాలా చోట్ల సంతలో పశువుల్లా బేరసారాలు జరిగాయి. ఒక పార్టీ తరఫున గెలిచిన ప్రజా ప్రతినిధులు మరో పార్టీ క్యాంపులో చేరడం, విహార యాత్రలకు వెళ్లడం అంతా బహిరంగ రహస్యమే. ఓటుకు ఇన్ని లక్షలని పంపకాలు కూడా భారీగానే జరిగాయట. ఈ లెక్కన మేయర్ ఎన్నికల్లోనూ బేరసారాలు జరగవచ్చు. కొందరు కార్పొరేటర్లు రేటును బట్టి పార్టీ ఫిరాయించినా ఆశ్చర్యం లేదనేది అప్పుడే నగరంలో హాట్ టాపిక్ గా మారింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎం ఎల్ సి లు వంటి ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లతో పాటు, అవసరమైతే మజ్లిస్ మద్దతుతో మేయర్ పదవిని పొందాలనేది తెరాస ప్లాన్. అయితే, ఆ పార్టీ అతితక్కువ డివిజన్లు గెల్చుకునేలా చేయాలని, కోలుకోలేని దెబ్బ తీయాలని టీడీపీ, బీజేపీలు కసితో ఉన్నాయి. మెజారిటీ డివిజన్లను గెలిచి సత్తాను చాటాలని హోరాహోరీగా పోరాడాయి. అయితే, కొన్ని చోట్ల ఇరు పార్టీల కేడర్ మధ్య సఖ్యత లేకపోవడం చేటు చేయవచ్చని, స్నేహపూర్వక పోటీ ఉన్న డివిజన్లలోనూ నష్టం కలగవచ్చని అంచనాలున్నాయి. కాంగ్రెస్ కూడా వీలైనన్ని సీట్లు గెలవడానికి శాయశక్తులా ప్రయత్నించింది. ఇక అభ్యర్థుల భవితవ్యం ఓటరు చేతిలో ఉంది.
నగర ఓటర్లూ, నచ్చిన అభ్యర్థికి ఓటు వెయ్యండి. మంచి వాళ్లను ఎంచుకోండి. డివిజన్, నగర అభివృద్ధిలో పాలు పంచుకోండి.