అనుకున్నంత జనం లేరు సార్ ఏం ప్రాబ్లమ్ లేదు మేము చూసుకుంటాం! అని తుని ప్రాంతంలో ఒక తెలుగుదేశం నాయకుడు టెలికాన్ఫరెన్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెప్పారు. ఇది జరిగిన అరగంటకే తునిలో రైలు భోగీలను తగలబెట్టేశారు. పరిస్ధితిని అంచనా వేయలేకపోవడం, ముఖ్యమంత్రితో ఇలాగే మాట్లాడాలని ఆనాయకుడు ఎప్పుడో నిర్ణయించుకోవడమే ఈ రాంగ్ ఫీడ్ బ్యాక్ కు మూలం.
రాజుకి ఇష్టంలేని విషయాలను చెప్పడానికి ఎవరూ సాహసించరు కాబట్టే ”రాజులు దురదృష్టవంతులు”అనే నానుడి పుట్టింది. పార్టీ యంత్రాంగం నుంచి మాత్రమే కాదు ప్రభుత్వ యంత్రాంగమైన ఇంటెలిజెన్స్ విభాగం నుంచి కూడా సరైన సమాచారం లేని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దురదృష్టవంతుడే! అయితే ఈ బాడ్ లక్ ప్రజలకు సమస్యాత్మకం కావడమే విషాదం.
గోదావరి పుష్కరాల్లో మొదటిరోజు పుష్కరాల రేవువద్ద గుమిగూడుతున్న సంఖ్యను పోలీసు శాఖ అంచనా వేయలేక పోవడం, అక్కడతొక్కిసలాటకు వున్న అవకాశాన్ని పసిగట్టలేక పోవడం వల్ల 38 మంది యాత్రికులు చనిపోయారు.
విజయవాడలో అప్పు తీసుకున్న కుటుంబాల మహిళల్లో కొద్దిమందిని బ్లూ ఫిల్మ్ తీసి వ్యభిచారారం చేయించాక కూడా కాల్ మనీ దురాగతాల్ని ఒక బాధితురాలే బయటపెట్టిందే తప్ప ఇంటెలిజన్స్ విభాగం పసిగట్ట లేకపోయింది.
తునిలో కాపు గర్జన గురించి నేలరోజలుగా సందడి మొదలైంది…చివరికి ఏంజరిగిందో మనకి తెలుసు. ”తునిలో నిన్న జరిగిన పరిణామాన్ని ఎవరూ ఊహించలేదు, నిరసనకారులతో ఈ స్థాయిలో ఉద్రిక్తత తలెత్తుతుందని అంచనా వేయలేకపోయాం” అని విశ్వజిత్ టివిల్లో చెప్పారు. ఆయన సాక్షాత్తూ నార్త్ కోస్టల్ పోలీస్ ఇన్స్ పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్…
ఇంటెలిజెన్స్ వైఫల్యాన్నికి ఐజి మాటల కంటే పెద్ద సాక్ష్యం ఇంకేంకావాలి?
ఒకసారికాదు, రెండు సార్లు కాదు ప్రతీసారీ వైఫల్యమంటే వ్యక్తుల్లోకాక వ్యవస్ధలోనే లోపాలూ, లొసుగులూ వున్నాయని అర్ధం చేసుకోవాలి. దిగువస్ధాయి నుంచి ఉన్నత స్ధాయివరకూ ప్రతీ అంచెలోనూ లింకులు సజావుగా వున్నాయా? సమన్వయపూరితమైన అను సంధానంతో పని జరుగుతోందా సమీక్షించుకోవాలి. వికేంద్రీకరించి వున్న అధికారాన్ని స్వేచ్ఛగా పనిచేయనీయనిస్తే ప్రతిదశలోనూ జవాబుదారీతనం వుంటుంది. అలాకాకుండా కేంద్రీకృత పాలన వల్ల పైస్ధాయిలో వున్నవారికి నచ్చని సమాచారం ఎప్పటికీ వారికి అందదు.
గోదావరి పుష్కరాల్లో, కాల్ మనీ దురాగతం బయటపడినప్పుడూ, కాపుగర్జన విషయంలోనూ ముఖ్యమంత్రి సర్వమూ తానే అయి చక్కబెట్టారు. ఫలితంగా అధికార యంత్రాంగంలో కుషన్ అనేదే లేకుండా పోయింది. షాక్ అబ్జార్బర్ పనిచేయకుండా పోయింది. ఈ గతుకుల ప్రయాణం వల్లే ముఖ్యమైన ప్రతీ సందర్భమూ కోతిపుండు బ్రహ్మరాక్షసి అన్నంత పెద్దది అవుతోంది.