ఇటు- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి తాము కాపుల ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని, కాకపోతే సంమయనం పాటించాలని సన్నాయి నొక్కులు నొక్కుతారు. అటు- ముద్రగడ పద్మనాభం తమకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడం లేదని తెలుగుదేశంలోని ద్వితీయశ్రేణి నాయకులు, కాంగ్రెస్, భాజపాల్లోని కాపు నాయకులు మాత్రమే మద్దతు ఇస్తున్నారని సెలవిస్తారు.
…ఏమిటీ డ్రామా? వీరంతా కలిసి ఎవరిని వంచించాలనుకుంటున్నారు. తమను బీసీల్లో కలపడానికి సంబంధించి, కాపు కార్పొరేషన్ ద్వారా వేల కోట్లరూపాయలు వారి సంక్షేమానికి వెచ్చిస్తానని ప్రకటించిన చంద్రబాబు హామీకి సంబంధించి వైఫల్యాలు ఉంటే వాటిని ఎత్తిచూపిస్తూ, కాపులు పోరాడడం ధర్మబద్ధమైన పోరాటమే అయితే ఎవ్వరికీ ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉండవు. అయిదేళ్లలో ఐదువేల కోట్లు ఇస్తానన్న చంద్రబాబునాయుడు ఈ 19 నెలల్లో కేవలం వందకోట్లు మాత్రమే ఇవ్వడం గురించి జగన్ ప్రశ్నించినట్లుగానే ఎవరైనా నిలదీయవచ్చు. అలాగే కాపులను బీసీల్లో చేర్చడానికి సంబంధించి వేసిన కమిషన్ విషయంలోనూ దానికి నిర్దిష్టంగా గడువు ప్రకటించి నిర్ణయం వచ్చేలా చూడాలని డిమాండ్ చేయడం సబబుగా ఉంటుందే తప్ప.. ఏకపక్షంగా బీసీల్లో చేర్చేస్తూ జీవో కోరడం అనేది.. అసలు ప్రయోజనాన్ని దెబ్బతీస్తుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ముద్రగడ పద్మనాభం I వైఎస్ జగన్మోహనరెడ్డి ఇద్దరూ తమలో ఉన్న పోరాట పటిమను ప్రదర్శించడమూ, ప్రభుత్వ వ్యతిరేకతనుచాటుకోవడమూ వేరు. కానీ.. ‘యూస్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్’ అన్నట్లుగా.. ఒకరికి ఒకరు దొంగచాటుగా దన్నుగా నిలవాలనుకుంటున్నారు. ఎలాగంటే..
అల్లర్లు చేసింది కాపులు కాదు.. రౌడీలు ఆ గుంపులోకి ప్రవేశించారు. ఒక నేరగాడి ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. అని నేరాన్ని వైకాపా కు ఆపాదించడానికి చంద్రబాబు ప్రయత్నిస్తే.. ముద్రగడ పద్మనాభం, జగన్‌ను కాపాడడానికి ఆరాటపడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అయితే ఆయనది మింగలేని కక్కలేని పరిస్థితి. అల్లర్లు తమ వాళ్లు చేశారని చెప్పలేడు. అందుకని.. రౌడీలు ప్రవేశించింది నిజమే. కానీ ప్రభుత్వమే ఆ రౌడీలను అక్కడకు ముందే పంపింది. రైలు వద్దకు తమ వాళ్లు వెళ్లడానికి ముందే అక్కడ మనుషులు ఉన్నారు. వారే తగుల బెట్టారు.. అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. ‘జగన్ మద్దతు ఉన్నది’ అని ఒప్పుకుంటే.. జగన్ నుంచి డబ్బు తీసుకుని ఉద్యమం చేసినట్లుగా ప్రజలు అనుకుంటారేమో అని భయపడుతున్నట్లుగా వైకాపా మద్దతు లేదు.. అని ముద్రగడ చెబుతున్నారు. వైకాపా మద్దతు లేదనడం నిజమే అయితే గనుక.. కాపు వ్యతిరేకంగా వైకాపా వ్యవహరించింది అని ముద్రగడ బహిరంగ ప్రకటన ఎందుకు ఇవ్వరు. కేవలం గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్న ధోరణిలో.. జగన్ మద్దతు ఉన్నది అంటే.. ముద్రగడ భుజాలు తడుముకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
మరోవైపు జగన్ ఆద్యంతమూ ముద్రగడకు కించిత్ మనస్తాపం కలగకుండా మాటలు పేరుస్తారు. కాపుల డిమాండ్‌కు తాము మద్దతు ఇస్తున్నామంటారు. మద్దతు ఇవ్వడం అంటే జగన్ ఉద్దేశంలో ఏమిటో అర్థం కావడం లేదు. ఆయనకు అంతగా పోరాటం మీద చిత్తశుద్ధి ఉంటే. తమ పార్టీలోని కాపు నాయకుల్ని కూడా నిరశన దీక్షలకు కూర్చోబెట్టి వారికి క్రియాశీలమైన మద్దతు ఇచ్చేలా పురమాయించవచ్చు కదా. అయినా ఒక కులానికి మంచి జరగడం కోసం కేవలం ఆ కులం వారు మాత్రమే పోరాడాలనే అడ్డుగోడలేమీ లేవు కదా. జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే.. తునికి వెళ్లి కాపుల కోసం తాను ఒక రోజు దీక్ష చేయవచ్చు కదా! అంత గట్టిగా మద్దతు ఇవ్వడానికి మళ్లీ ఆయన ముందుకు రారు. ఇతర కులాల నుంచి తన పార్టీకి ఇబ్బంది వస్తుందని భయం. ప్రెస్ మీట్ పెట్టమంటే మాత్రం.. ఎన్నిమాటలైనా తయారుచేసుకుని వల్లిస్తారు.
ఈ నాయకుల మాయాపూరిత మాటల అల్లిక ఎవరికి వారు ప్రజలను కన్ఫ్యూజ్ చేసి.. తమ పబ్బం గడుపుకోవడానికి చూస్తున్నట్లుగా ఉన్నదే తప్ప.. వాస్తవంగా సమస్యను కొలిక్కి తీసుకురావడానికి కాపు కులానికి న్యాయం జరిగేలా చూడడానికి ప్రయత్నిస్తున్నట్లుగా లేదు.