జి.హెచ్.ఎం.సి.ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఈరోజు ఉదయం 7గంటలకు మొదలయింది. సాయంత్రం 5గంటల వరకు సాగుతుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న 150 మొత్తం 1,333 మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలో పరిధిలో మొత్తం 74 లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని, దానితో బాటే వారి పార్టీల భవితవ్యాన్ని ఈరోజు నిర్ణయిస్తారు. ఈ ఎన్నికల కోసం మొత్తం 7802 కేంద్రాలను ఏర్పాటు చేసారు. సాయంత్రం 5గంటల లోగా క్యూలో ఉన్నవారందరికీ ఎంత సమయం అయినా ఓటు వేసే అవకాశం ఉంటుంది.
ఎన్నికలు సజావుగా సాగేందుకు నగరమంతటా పటిష్టమయిన భద్రతా ఏర్పాట్లు చేసారు. సమస్యాత్మకమయిన ప్రాంతాలలో అదనపు బలగాలను మొహరించారు.ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో మొత్తం 46, 545 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 3,000 వెబ్ కెమెరాలు వినియోగించబడుతున్నాయి. ఈ ఎన్నికలలో గ్రేటర్ పరిధిలో ఉన్న ఓటర్లు అందరూ తమ ఓటు హక్కుని వినియోగించుకొనేందుకు ప్రభుత్వం ఈరోజు శలవు దినంగా ప్రకటించింది. గ్రేటర్ పరిధిలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యా సంస్థలు, బ్యాంకులు, వాణిజ్య సంస్థలు, దుఖాణాలకు శలవు వర్తిస్తుంది.
ఈ ఎన్నికలలో తెరాస, కాంగ్రెస్, మజ్లీస్ పార్టీలు ఒంటరిగా పోటీ చేస్తున్నాయి. వాటిలో తెరాస మొత్తం 150 స్థానాలకు, కాంగ్రెస్ పార్టీ-149, మజ్లీస్-60స్థానాలలో పోటీ చేస్తున్నాయి.
ఈ ఎన్నికలలో కలిసి పోటీ చేస్తున్న తెదేపా-బీజేపీలు మొత్తం 150 స్థానాలకు పోటీ చేస్తున్నాయి. కానీ 12 స్థానాలలో మాత్రం రెండూ స్నేహపూర్వకంగా పోటీ పడుతున్నాయి. తెదేపా-95, బీజేపి-66 స్థానాల నుండి పోటీ చేస్తున్నాయి.
ఈ ఎన్నికలలో వామపక్షాలతో కలిసి లోక్ సత్తా పార్టీ పోటీ చేస్తోంది. వాటిలో లోక్ సత్తా-26, సి.పి.ఐ.-21, సిపిఎం-22, బీఎస్పి-55 స్థానాలకు పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికలలో మొత్తం 640 మంది స్వతంత్ర అభ్యర్ధులు పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 5వ తేదీన వెలువడుతాయి.