ఆంధ్రప్రదేశ్లో సగం మంది ఓటర్లు మహిళలే. మెజార్టీ నియోజకవర్గాలలో… మెజార్టీ ఓటర్లు మహిళలు. సాధారణంగా వీరు.. కుల, మతాలకు అతీతం. ఇతర ఓటర్లు… ఓట్లు వేయడానికి కులం, మతాన్ని ప్రాతిపదికగా తీసుకున్నా మహిళలు మాత్రం.. తమకు మంచి చేసిందెవరో అంచనా వేసుకుంటారు. ఆ ప్రకారమే ఓట్లు వేస్తారు. మధ్యతరగతి మహిళలు కుటుంబ భారాన్ని మోస్తూంటారు. వారి జీవనాన్ని వీలైనంత సులువు చేసే ప్రయత్నం ప్రభుత్వం నుంచి జరిగి ఉంటే.. కచ్చితంగా వారి ఆదరణను చూరగొంటారు.
మహిళాదరణ పొందే టీడీపీ అధినేతకు క్లారిటీ ఉంది. మొదటి నుంచి సంక్షేమపథకాలన్నీ… మధ్యతరగతి మహిళలకు మేలు చేసేలా… అమలు చేస్తున్నారు. పండుగకు కానుకల దగ్గర్నుంచి ఇళ్ల కేటాయింపు వరకూ.. రోజువారీ జీవితం.. సులువయ్యేలా చేసే పథకాలు అన్నీ మహిళల పేరు మీదనే ఉంటాయి. ఇక దీపం పథకం కనెక్షన్లు, మంచినీరు సరఫరా లాంటి విషయాల్లో ఐదేళ్లలో పరిస్థితి ఎంతో మెరుగైంది. ఈ సారి డ్వాక్రా మహిళలకు పసుపు – కుంకుమ కింద పదివేల రూపాయల సాయం చేశారు. ఈ పథకాన్ని కొనసాగిస్తామని మేనిఫెస్టోలో కూడా పెట్టారు. సహజంగానే .. మహిళలు.. టీడీపీ పట్ల ఎక్కువ సానుకూలత చూపుతారు. ఈ ఫథకాలతో.. మహిళల్లో మరింత ఆదరణ పెంచుకున్నారు. అందుకే.. వారంతా.. ఓటు వేయడానికి వస్తే వార్ వన్ సైడ్ అవుతుందని.. టీడీపీ అధినేత నమ్మకం. అందుకే దాదాపుగా ప్రతి సభలోనూ.. మహిళలకు.. ఓటు వేయమని పిలుపునిస్తున్నారు.
వారినే కాదు.. ఇంట్లో మగవాళ్లతోనూ.. ఓటు వేయించే బాధ్యతను కూడా మహిళలకే అప్పగిస్తున్నారు. ఇంటిని చక్కదిద్దే ఆడవాళ్లే.. రాష్ట్రాన్ని కూడా చక్కదిద్దాలన్న అభిప్రాయాన్ని చంద్రబాబు వ్యక్తం చేస్తున్నారు. పొరాపాటునో.. మరో కారణంతో.. టీడీపీకి ఓటు వేయకపోతే.. ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని గుర్తు చేస్తున్నారు. అన్నకు అండగా ఆడబిడ్డలు నిలబడాలని పిలుపునిస్తున్నారు. పించన్లతో వృద్ధులు, పుసుపు-కుంకుమతో మహిళలు టీడీపీకి అనుకూలంగా మారారని వైసీపీ కూడా… ఓ నిర్ణయానికి వచ్చింది. అందుకే విరుగుడుగా వైసీపీ వ్యూహం రూపొందించిందని చెబుతున్నారు. పసుపు కుంకుమ పధకం కింద రాష్ట్రంలో ఇప్పటికే రెండు చెక్కులు మహిళలు నగదుగా మార్చుకోగా, మూడో చెక్కు కూడా ఈనెల 5వ తేదీ నాటికి బ్యాంకులలో జమ చేయనున్నారు. అయితే దీనిని అడ్డుకునేందుకు తటస్తుల పేరుతో హైకోర్టులో పిల్ వేయించారు. ఇప్పటికే ఈ పధకాన్ని ప్రారంభించి లబ్దిదారులను గుర్తించి రెండు విడతలుగా నగదు కూడా ఇచ్చారు. మూడో విడత కింద ఇచ్చే నగదుకు ఎటువంటి అభ్యంతరాలు ఉండబోవని చెబుతున్నారు. ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన పీఎం కిసాన్ పధకం కింద ఇప్పటికే లబ్దిదారులను గుర్తించి ఉండటంతో అటువంటి పధకాలు అమలుకు ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఈసీ సర్క్యులర్ ఇచ్చింది.
ఈసీ సర్క్యులర్ పసుపు-కుంకుమ, సహా అన్ని పథకాలకు వర్తిస్తుంది. కోర్టులో పసుపు కుంకుమ పధకం అమలు నిలిపివేయడం, సాధ్యం కాకపోతే డ్వాక్రా గ్రూపులకు గాలం వేయాలని వైసీపీ రెండో మార్గాన్ని అన్వేషించిందనే ప్రచారం జరుగుతోంది. ఒక్కో డ్వాక్రా గ్రూపుకు పది మంది సభ్యులు ఉంటే ఒక్కొ గ్రూపుకు తాము పది నుంచి ఇరవై వేలు ఇస్తామని బేరం పెడుతున్నారు. ఎంతో కొంత మంది మహిళల్ని తమ వైపు మరల్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు మరి మహిళాదరణ ఎవరికి ఉంటుందో..!