తాము ఎంత ఆబ్జెక్టివ్ జర్నలిజం విలువలను పాటిసున్నామని భ్రమ పెట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ.. సాక్షి దినపత్రిక, సాక్షి టీవీ ఛానెల్ లను జగన్ కరపత్రాలుగానే ప్రజలు భావించే పరిస్థితి ఉంది. అయితే సాక్షి రాతలను గమనిస్తోంటే.. ఉద్దేశపూర్వకంగా వారు అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తోంటే.. రాష్ట్రంలో ‘కులాలు మరియు రిజర్వేషన్లు’ పేరిట రాజుకుంటున్న చిచ్చు ఇప్పట్లో చల్లారడం వారికి ఇష్టం లేనట్లుగా కనిపిస్తోంది. రిజర్వేషన్లు కావాలంటూ కాపుల ఆందోళనలను, వారికి రిజర్వేషన్లు ఇస్తే ఒప్పుకునేది లేదు అంటూ బీసీ కులాలను ఇరు వర్గాలను ఎగదోయడం ద్వారా… రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చడానికి వీరు తమ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నట్లుగా అనుమానించాల్సి వస్తోంది. కాపులకు, కులాలకు సంబంధించిన చిచ్చు రాజుకుంటున్న ఈ సమయంలో.. రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం లాంటి పాచిపోయిన విమర్శలన్నిటినీ ఏకరవు పెడుతూ.. అవి జరగనందుకు చంద్రబాబు ఒకటో నెంబరు క్రిమినల్ అని అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్న జగన్మోహనరెడ్డి తన కరపత్రాల ద్వారా రాష్ట్రంలో అరాచకత్వం ప్రబలడానికి చాలా స్పష్టంగా ప్రయత్నిస్తున్నారని చెప్పాలి.
ఎలాగంటే..
జగన్ చాలా స్పష్టంగా తమ పార్టీ కాపు రిజర్వేషన్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. కాపుల పోరాటానికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. మంచిదే- మరి.. ప్రభుత్వం కమిషన్ వేయడంలో ఏం లోపాలు ఉన్నాయో ప్రతిపక్ష పార్టీగా నిర్దిష్టంగా చెప్పాలి. అలాంటి నిర్మాణాత్మక కృషిని ఆ పార్టీ చేయడం లేదు.
కాపుల రిజర్వేషన్ పోరాటాన్ని, వారికి రిజర్వేషన్లు కల్పించడానికి చంద్రబాబు ప్రయత్నాల్ని ఇతర బీసీలు సహజంగానే వ్యతిరేకిస్తున్నారు. ఉన్న బీసీలకు ఇబ్బందిలేకుండా చేస్తాం అని చంద్రబాబు నచ్చజెబుతున్నారు. వారిలో అసంతృప్తి రేగకుండా ఉండేందుకే కమిషన్ ద్వారా ఒక పద్ధతి ప్రకారం చేయడానికి కసరత్తు జరుగుతోంది. అయితే బీసీ సంఘాల నాయకుడు ఆర్.కృష్ణయ్య తమ కులాల్లోని ఆవేశాన్ని వ్యక్తీకరించడం సహజం. దాన్ని సాక్షి దినపత్రిక తమకు కావాల్సిన కోణంలో హైలైట్ చేస్తూ.. ”చంద్రబాబు చేస్తున్నది (కాపుల్ని బీసీలు చేయడం) ముమ్మాటికీ తప్పే … 6 శాతం ఉన్న కాపులే ఇంత చేస్తే 54 శాతం ఉన్న బీసీలు ఇంకెంత చేయాలి.. ఊరుకుంటారా?’ అంటూ ప్రశ్నించడాన్ని హైలైట్ చేయడం చాలా దారుణం. ఇది ఖచ్చితంగా కాపుల ఉద్యమానికి పోరాటానికి వ్యతిరేకంగా తలపడడానికి, కొట్లాడుకోవడానికి బీసీలను కూడా ఎగదోస్తున్నట్లుగా, ఆ వాదనకు మద్దతిస్తున్నట్లుగా ఉన్నది తప్ప మరొకటి కాదు.
జగన్మోహనరెడ్డి బాధ్యత గల రాజకీయ నాయకుడే అయితే గనుక.. సమస్య అందరికీ అనుకూలంగా పరిష్కారం కావాలి అనే ఉద్దేశమే ఉంటే గనుక.. బీసీ కులాలు సంయమనం పాటించాలి అంటూ తన పత్రికలో ఎడిటోరియల్ రాయించాలి. కాపుల డిమాండ్ సహేతుకమైనది, బీసీలకు ఉన్న రిజర్వేషన్లో అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం జరిగేలా ప్రయత్నం చేద్దాం.. అంతే తప్ప కాపు ఉద్యమాన్ని వ్యతిరేకించడం తగదు అంటూ బీసీలకు విజ్ఞప్తి చేయాలి. కానీ అలాంటి ఆలోచన ఆయనకు లేదు. కాపులు ఒక రైలు కాల్చేస్తే, బీసీలు పది రైళ్లు కాల్చేయడానికి కావల్సిన ప్రేరణ తాను తన కరపత్రికల ద్వారా ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా ఉంది. నాయకులు సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం అంగలారుస్తూ ఉంటే పరిస్థితి ఇలా దారుణంగా మారుతుంటుంది.
ఇదంతా చంద్రబాబునాయుడుకు అనుకూలంగా చేస్తున్న వాదన అనుకుంటే పొరబాటు. జగన్మోహనరెడ్డికి చేతనైతే అటు రిజర్వేషన్ కాపుల్ని, ఇటు తమకు అన్యాయం జరుగుతుందని భయపడుతున్న బీసీలను కలుపుకుని చంద్రబాబునాయుడు మీదకే పోరాటాన్ని ప్రకటించవచ్చు. అలా చేయగలిగితే.. జగన్మోహనరెడ్డి రూపంలో సమాజహితాన్ని కాంక్షించే ఒక సద్బుద్ధి గల సదాలోచనాపరుడు, సమర్థుడైన నాయకుడు దొరికాడని మనం కూడా ఆయనకు హేట్సాఫ్ చెప్పి ఆయన వెంట నిలవొచ్చు. కానీ ఆయన అలా చేయగలరా?
ప్రజాకర్షక పథకాలే అయినా.. పేదవాడి గురించి పట్టించుకుని చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే, వారి సంక్షేమానికి తాను తలచుకున్నది చేయడంలో ఎవరినీ లెక్కచేయకుండా వ్యవహరించే మంచి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పేరుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత.. వైఎస్సార్ చేపట్టిన అనేక విధానలు పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేసేవిగా చాలా మందికి ఆదర్శంగా నిలిచాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంత మంచి పేరు ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డికే తన అధికారం కోసం, మతకలహాలు సృష్టించాడన్న అపకీర్తి చెలామణీలో ఉంది. అది కేవలం పుకారు మాత్రమే అనుకున్నప్పటికీ.. అలాంటి ఆరోపణలు అనుభవించిన వ్యక్తి కొడుకుగా జగన్మోహనరెడ్డి ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. మరింత అప్రమత్తంగా తను వ్యవహరించాలి. కానీ ఆయన బరితెగించి తన మీడియా కరపత్రాల ద్వారా కులకలహాలకు తెరతీయడానికి ప్రయత్నిస్తున్నారని ఇప్పుడు భయం పుడుతున్నది.