ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నిర్మోహమాటంగా మరోసారి ప్రకటించింది. నేరుగా మేనిఫెస్టోలో పెట్టింది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ హామీ నెరవేర్చడం తమ బాధ్యతని చెప్పింది. అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ నేరుగా మేనిఫెస్టోలో పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి అవకాశాలు లేవు. ఆ విషయం రాహుల్ గాంధీకి తెలుసు. అయినప్పటికీ.. పార్లమెంట్లో.. విభజన చట్టం పాస్ చేసుకునేందుకు ఏపీకి ఇచ్చిన హామీ కాబట్టి… నెరవేర్చాల్సిన బాధ్యత తమపై ఉందని రాహుల్ భావిస్తున్నారు. అందుకే.. ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు లేకపోయినా… ప్రత్యేకహోదాకు మద్దతు పలికారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వమే ప్రత్యేకహోదా ఇవ్వాలి. ఎవరు అధికారంలోకి వస్తారు..? అయితే బీజేపీ.. లేకపోతే కాంగ్రెస్. ఈ రెండు కాకపోతే… ఏదో ఓ జాతీయ పార్టీ మద్దతిచ్చిన ప్రాంతీయ పార్టీల కూటమి అధికారంలోకి రావాలి. జాతీయ పార్టీల మద్దతు లేకుండా.. కేంద్రం వేరే ప్రభుత్వం ఏర్పడే అవకాశం లేదు. అంటే.. మొత్తం మూడు ఆప్షన్స్ ఉన్నాయి. అందులో బీజేపీ హోదా ఇవ్వనంటోంది. ఒక వేళ కేంద్రంలో ఏదైనా ప్రాంతీయ పార్టీల కూటమికి బీజేపీ మద్దతిస్తే.. ఆ కూటమి కూడా హోదా ఇవ్వదు. అంటే.. ఉన్న ఆప్షన్ కాంగ్రెస్ లేదా.. కాంగ్రెస్ మద్దతిచ్చే ప్రాంతీయ పార్టీల కూటమి. మరి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు.. నిజంగానే హోదా కోసం పోరాడుతూంటే.. ఎవరి వైపు ఉండాలి..?. ఎవరి వైపు ఉంటున్నాయి…?. ప్రత్యేకహోదానే ఎజెండా అని చెబుతున్న వైసీపీ ఏం చేస్తోంది..?. టీఆర్ఎస్కు మద్దతు పలుకుతోంది. అసలు ఉనికే లేని ఫెడరల్ ఫ్రంట్‌ను సృష్టించి… తాము సాధించే సీట్లతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు అవుతుందని చెబుతూ… టీఆర్ఎస్తో కలిసి రాజకీయం చేస్తోంది. టీఆర్ఎస్ ఏపీకి ప్రత్యేకహోదాపై అవసరానికి తగ్గట్లుగా మాట మారుస్తోంది. ఎన్నికల్లో ఓటర్లను రెచ్చగొట్టడానికి కూడా ఈ అంశాన్ని వాడుకున్నారు. పార్లమెంట్లో ఏపీకి ఇస్తే మాకూ ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇలాంటి పార్టీతో వైసీపీ … ప్రత్యేకహోదా కోసం కలసి పని చేస్తామని చెబుతోంది. నేరుగా హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్ పై మాత్రం… నమ్మకం లేదంటున్నారు.. వైసీపీ నేతలు.
ప్రత్యేకహోదానే తమ ఎజెండా అని చెబుతున్న వైసీపీ… ఆ హోదాకు మద్దతుగా.. కాంగ్రెస్ మాట్లాడుతున్నా… పట్టించుకోవడం లేదు. స్వాగతిస్తున్నామనే ప్రకటన కూడా చేయడం లేదు. టీడీపీ ప్రచారం కోసం.. వస్తున్న జాతీయ నేతలు… ప్రత్యేకహోదా కోసం మద్దతుగా మాట్లాడుతున్నారు. వారినీ వైసీపీ పట్టించుకోవడం లేదు. ఒక్క టీఆర్ఎస్ పైనే జగన్.. అమితమైన అభిమానం చూపిస్తున్నారు. కాంగ్రెస్ హోదా ఇస్తానంటే.. వైసీపీకి ఎందుకు నచ్చడం లేదనేది.. ఇప్పుడు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. ఇప్పుడు కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రకటన చేస్తే.. ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే తమ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. హోదా ఇచ్చేది లేదంటున్న బీజేపీ స్నేహం కొనసాగిస్తూ… ప్రత్యేకహోదా ఇచ్చే పరిస్థితి వస్తే అడ్డం పడే టీఆర్ఎస్తో కలిసి… జగన్ రాజకీయం చేయడం.. ఏపీలో.. అనేక అనుమానాల్ని రేకెత్తిస్తోంది.