ఆంధ్రప్రదేశ్ ఎన్నికల బరిలో అన్ని స్థానాలకూ జనసేన పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. పొత్తుల విషయానికి వచ్చేసరికి… కమ్యూనిస్టులు, బహుజన్ సమాజ్ వాదీ పార్టీతో మాత్రమే సర్దుబాటు చేసుకున్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. అయితే, బీఎస్పీతో స్నేహం అనూహ్యంగా జరిగిన పరిణామంగా ఈ మధ్య జనసేన వర్గాలే వ్యాఖ్యానించాయి. మాయావతి దగ్గరకి పవన్ వెళ్తారనిగానీ, ఆయన పర్యటన ఉందనిగానీ, బీఎస్పీతో పొత్తు ఉంటుందనిగానీ తమకు ముందుగా తెలియదని జనసేన వర్గాలే వ్యాఖ్యానించిన పరిస్థితి చూశాం. అయితే, ఒక టీవీ ఛానెల్ కి వచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ… బీఎస్పీతో తనకు పరిచయం ఇప్పటిది కాదని చెప్పుకొచ్చారు.
2008లోనే తనకు బీఎస్పీ నుంచి ఒక ఆఫర్ వచ్చిందన్నారు పవన్ కల్యాణ్. కొంతమంది ప్రముఖులు తనని సంప్రదించి, ఆంధ్రప్రదేశ్ లో బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండమన్నారు అని చెప్పారు. అప్పుడే మాయావతితో మీటింగ్ ఏర్పాటు చేస్తామనీ, మీ భావజాల రిత్యా ఆ పార్టీతో కలిసి ప్రయాణిస్తే బాగుంటుందని అప్పట్లోనే కొంతమంది మేధావులు, విశ్లేషకులు తనతో మాట్లాడారని పవన్ అన్నారు. అయితే, ఆ తరువాత దళిత మేధావులు, తన శ్రేయోభిలాషులు… చాలా వేదికల మీద, చర్చల్లోనూ తన భావజాలం గురించి మాట్లాడుతూ వచ్చారన్నారు. ఇన్నాళ్లకు ఆ చర్చలకు ఒక లాజికల్ కన్ల్కూజన్ వచ్చించిందని పవన్ వివరించారు. చంద్రబాబు నాయుడు అడిగితేనే మాయావతి ఇంటర్వ్యూ ఇవ్వలేదన్నారు. అలాంటిది, తనని దాదాపు ఏడాదిన్నగా గమనించారనీ, నా విధానాలు నచ్చి వారే స్వయంగా పిలిపించారనీ, తాను వెళ్లలేదన్నారు పవన్.
తెలుగు రాష్ట్రాల్లో అప్పుడప్పుడూ అరకొర సీట్లు మాత్రమే గెలుచుకుని, స్థానికంగా ఉనికి లేని బీఎస్పీతో పొత్తు వల్ల జనసేనకి లాభం ఉంటుందా అనే ప్రశ్నకి పవన్ స్పందిస్తూ… తాను సీట్ల సంఖ్య చూడటం లేదనీ, భావజాల విస్తృతి గురించి మాత్రమే తాను ఆలోచిస్తా అన్నారు. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు విషయంలో కూడా తాను ఆలోచించింది ఇదేనన్నారు. అయితే, ఎస్సీ ఓటు బ్యాంకు ఆకర్షించడానికే బీఎస్పీతో పవన్ కలిశారనే విమర్శలున్న సంగతి తెలిసిందే. రాజకీయ సమీకరణాలపరంగా చూసుకుంటే బీఎస్పీతో దోస్తీ వల్ల జనసేనకు అదనంగా ప్రయోజనం అంటూ ఏదీ లేదన్నది వాస్తవం. మరి, పవన్ చెబుతున్నీ ఈ భావజాల వ్యాప్తిని ప్రజలు ఎంతవరకూ అర్థం చేసుకుంటారో చూడాలి.