తెలంగాణ పోలీసులు వైసీపీ కోసం ఫుల్ టైం పని చేస్తున్నారు. ఏ వైసీపీ నేత ఫిర్యాదు చేసినా..తక్షణం చర్యలు తీసుకోవడానికి స్టిఫ్ గా రెడీ అయిపోతున్నారు. తాజాగా.. వైసీపీలో చేరిన మోహన్ బాబు.. తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు వెంటనే… కేసు నమోదు చేసి.. విచారణ ప్రారంభించారు. మార్చి 26 నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నట్లు చెప్పడంతో.. ఆయనకు ఎక్కడెక్కడ నుంచి కాల్స్ వచ్చాయో ఆరా తీశారు. విదేశాలకు చెందిన సిమ్ల ద్వారా కాల్స్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. ఆ కాల్స్ బెదిరించినవో కావో తెలియదు కాబట్టి.. న్యాయసలహా కోసం లీగల్ సెల్‌కు బంజారాహిల్స్ పోలీసులు పంపించారు.
మరో వైపు.. వల్లభనేని వంశీపై ఎప్పుడో హైకోర్టును కొట్టేసిన కేసును కూడా..తెలంగాణ పోలీసులు బయటకు తీశారు. వల్లభనేని వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద కేసు నమోదయింది. అప్పటి ప్రభుత్వం రక్షణ ఇవ్వలేదని … ప్రైవేటు భద్రత ఏర్పాటు చేసుకున్నారు వంశీ. దీంతో వారి దగ్గర ఆయుధాలు దొరికాయంటూ పోలీసులు కేసు పెట్టారు. కేసును కొట్టివేయాలని హైకోర్టులో 2013లో వంశీ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. నాన్‌బెయిలబుల్ వారెంట్, కేసును హైకోర్టు కొట్టి వేసినట్లు వంశీ చెబుతున్నారు. కానీ ఇప్పుడు వంశీ కోర్టుకు హాజరుకావడం లేదని నాంపల్లి కోర్టులో తెలంగాణ పోలీసుల పిటిషన్ వేశారు. పిటిషన్‌పై వంశీకి నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది నాంపల్లి కోర్టు. కేసును హైకోర్టు కొట్టేసిన అంశాన్ని నాంపల్లి కోర్టుకు తెలపాలని వంశీ నిర్ణయం తీసుకున్నారని… ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఈ వ్యవహారాలు ఇలా సాగుతూండగానే.. తెలంగాణ ఇంటలిజెన్స్ పోలీసులు.. ఏపీ ఎన్నికల వ్యవహారంలో జూబ్లిహిల్స్ పోలీసులకు ఓ ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఇంటలిజెన్స్ సర్వే అంటూ.. కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.. ఏపీలో తాము ఎలాంటి సర్వే చేయలేదని… దీనిపై చర్యలు తీసుకోవాలనేది ఆ పిటిషన్ సారాంశం. ఇంటలిజెన్స్ అంటూ.. ప్రతి ఎన్నికల సమయంలోనూ.. ఏదో ఒక పుకారు పుట్టుకొస్తూనే ఉంటుంది. తెలంగాణ ఎన్నికల సమయంలో సోషల్ మీడియా మొత్తం తెలంగాణ ఇంటలిజెన్స్ పేరు వాడేసి.. సర్వేల మీద సర్వేలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు అనేక జరుగుతూ ఉంటాయి. కానీ.. ఏపీ ఎన్నికలపైనే గురి పెట్టి.. ఇంటలిజెన్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. దాన్ని కేసు నమోదు చేసి మీడియాకు చెప్పడం… అంతా ఓ వ్యూహం అంటున్నారు. మొత్తానికి తెలంగాణ పోలీసులతోనే ఏపీలో ఫలితాలపై ప్రభావం చూపాలన్న ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు మాత్రం గట్టిగానే వినిపిస్తున్నాయి.