ప్రత్యేక హోదా… ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే కీలకాంశం అవుతుందని ఏడాదిన్నర కిందట అనుకున్నాం. ఏపీకి కేంద్రంలోని మోడీ సర్కారు మొండిచేయి చూపించడంతో… హోదా అంశం ఏపీలో సెంటిమెంట్ గా మారింది. అన్ని రాజకీయ పార్టీలూ హోదా సాధనకు ఎవరి పంథాలో వారు పోరాటం మొదలుపెట్టాయి. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన… ఎవరి ఉద్యమాలు వారు చేశారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడేసరికి… అందరూ హోదా సాధిస్తామంటూ చెబుతున్నారు. వాస్తవానికి, ఏపీలో ప్రధాన పోటీ ప్రాంతీయ పార్టీల మధ్యనే కావడంతో హోదా సాధిస్తాం అని చెప్తున్న ఈ పార్టీలకు.. జాతీయ స్థాయిలో వారికి ఉన్న సానుకూలతలను కూడా నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
టీడీపీ విషయానికొస్తే… ఆంధ్రా ప్రయోజనాల నేపథ్యంలో భాజపాతో విభేదించారు. దాంతో హోదా సాధించుకోవాలంటే… మరో జాతీయ పార్టీ తోడ్పాటు, లేదా ఢిల్లీ స్థాయిలో ఆ సత్తా ఉందని చెప్పుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అదే క్రమంలో దేశంలో ఏ పార్టీ చేయలేని విధంగా మోడీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం కూడా పెట్టారు. అదే సమయంలో, రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ పార్టీయే ముందుకొచ్చి ఏపీ ప్రత్యేక హోదా హామీ ఇచ్చాయి. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో రాగానే తొలి సంతకం హోదా ఫైల్ మీదే ఉంటుందని ఏఐసీసీ తీర్మానించింది. దీంతో, టీడీపీ తరఫు నుంచి జాతీయ స్థాయిలో హోదా సాధనకు ఉన్న మార్గం స్పష్టమైంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా నిన్నటి వరకూ హోదా సాధిస్తా అంటూనే హామీ ఇస్తూ వచ్చారు. అదెలా అనేది ఇవాళ్టి మాయావతి పర్యటనతో కొంత స్పష్టత వచ్చింది. ఎలాగూ, యూపీలో ఎస్పీ – బీఎస్పీ కూటమి బలంగా కనిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల తరువాత జాతీయ రాజకీయాల్లో క్రియశీలక శక్తిగా ఎస్పీ, బీఎస్పీ కూటమి మారుతుందన్న నమ్మకం ఉంది. ఈ నేపథ్యంలో, మాయావతి ఏపీకి వచ్చి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతో… కొంత నమ్మశక్యంగా ఉంది. దీంతో పవన్ కల్యాణ్ ఎలా హోదా తెస్తారూ అనే చర్చకూ ఒక లాజికల్ కన్క్లూజన్ కనిపిస్తోంది.
ఇక, మిగిలింది వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా హోదా సాధిస్తామని చెబుతున్నారు. అదెలా అంటే… ఏపీలో 25 ఎంపీ సీట్లూ వైకాపాకి వస్తే, తెలంగాణలో 16 స్థానాలు కేసీఆర్ పార్టీ గెలుచుకుంటే… వారూ వీరూ కలిసి కేంద్రంలో హోదా డిమాండ్ వినిపిస్తామని అంటున్నారు. ఇదీ ఆచరణ సాధ్యమైన వ్యూహమే. అయితే, దీన్ని ప్రజలు నమ్మే విధంగా జగన్ వ్యవహరించాల్సి ఉంది. మాయావతి ఏపీకి వచ్చి… ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినట్టుగా, రాహుల్ గాంధీ ఏపీకి వచ్చిన ప్రతీసారీ హోదా ఫైల్ మీదే తొలి సంతకం అని చెప్తున్నట్టుగా, ఫెడరల్ ఫ్రెంట్ కు నాయకత్వం వహిస్తానంటున్న కేసీఆర్ కూడా ఏపీకి ప్రత్యేక హోదాకి అనుకూలంగా ప్రకటన చెయ్యాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన్ని ప్రచారానికి తీసుకొచ్చే ధైర్యం జగన్ చెయ్యలేరు. కనీసం, హైదరాబాద్ లోనైనా ఒక ప్రెస్ మీట్ పెట్టింది… జగన్మోహన్ రెడ్డితో కలిసి, ఏపీ ప్రత్యేక హోదా సాధనకు ప్రయత్నిస్తా అంటూ కేసీఆర్ తో జగన్ హామీ ఇప్పించాల్సిన సమయం ఇది. ఆ ప్రయత్నం జగన్ చేస్తే… హోదా సాధనకు వైకాపా దగ్గర కూడా ఒక స్పష్టమైన వ్యూహం ఉందని ప్రజలు విశ్వసించడానికి ఆస్కారం ఏర్పడుతుంది.