ఏపీ పర్యటనకు వచ్చారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఆంధ్రాలో జనసేనతో కలిసి ఆ పార్టీ ఎన్నికల్లో పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రంలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగే అవకాశం వస్తే, ఆంధ్రాకి ప్రత్యేక హోదా కచ్చితంగా ఇస్తామని మాయావతి హామీ ఇచ్చారు. ముందుగా పవన్ కల్యాణ్ తో కలిసి ఆమె ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. అనంతరం బహిరంగ సభలో కూడా ఆమె ప్రసంగించారు. బీఎస్పీతో పవన్ కల్యాణ్ పొత్తు కుదిరిన దగ్గర్నుంచీ ఒక పార్టీ ఓట్లను చీల్చడానికే ఈ వ్యూహమనే ఊహాగానాలు బాగా వినిపిస్తున్నాయి. అయితే, పవన్ కి మాయావతి మద్దతుగా రావడం వల్ల నిజంగానే దళిత ఓట్లు చీలతాయా? దళితుల్లో ఎక్కువగా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ ఉందీ, అది వైకాపాకి అనుకూలంగా ఉందన్న అభిప్రాయమూ ఉంది. కాబట్టి, దళిత ఓట్లు చీలితే, దాని ప్రభావం వైకాపా మీద ఉంటుందా అనే చర్చ కూడా ఈ మధ్య జరుగుతోంది.
ఆంధ్రాలో బీఎస్పీకిగానీ, మాయావతికిగానీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేదన్నది వాస్తవం. బీఎస్పీకి ఏపీలో సరైన ప్రాతినిధ్యమే ఇంతవరకూ లేదు. ఆమె పిలుపు కోసం దళితులు కూడా ఎదురుచూస్తున్న పరిస్థితి ఇంతవరకూ లేదు. కాబట్టి, ఇప్పుడామె ఏపీకి వచ్చి పిలుపునిచ్చినంత మాత్రాన దళిత ఓటు గణనీయంగా చీలిపోతుందేమో అంటూ జరుగుతున్న చర్చకు పెద్దగా ప్రామాణికత లేదనే చెప్పాలి. దేశంలో ఆమె కూడా ఒక కీలక నాయకురాలు కాబట్టి, ఆమెపై కొంత అభిమానం కలిగే అవకాశాన్ని ఈ సందర్భంలో కాదనలేం. అయితే, అది ఓటరు మనోగతాన్ని మార్చే స్థాయిలో ఇప్పుడు ఉండకపోవచ్చు. విద్యావంతులు, దళిత యువతలో కూడా ఆమె ప్రభావం పెద్దగా ఉండదనే చెప్పాలి. దళిత ఓటు బ్యాంకును ప్రభావితం చేస్తే స్థాయి ఇప్పుడు ఉండాలంటే… ఇప్పటికే మాయావతి ఆంధ్రాలో తన పార్టీ తరఫున చాలా కార్యక్రమాలు చేసుండాలి. అంతటి వ్యూహాత్మకత బీఎస్పీకి ఏపీలో లేదు.
ఇక, జనసేనకు ఆమె రాకతో ఎంతవరకూ లాభం ఉంటుందంటే…. ఈ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ప్రభావం ఉండదనే అనిపిస్తోంది. బీఎస్పీతో తాము కలిసింది సీట్ల లెక్కల కోసం కాదనీ, భావజాలవ్యాప్తి కోసం అనే స్పష్టత పవన్ కల్యాణ్ కీ ఉంది. అయితే, బీఎస్పీతో ఇదే పొత్తు ప్రయత్నం కొన్ని నెలల ముందే పవన్ చేసి ఉంటే, జనసేనకు కొంత అదనపు ఆకర్షణగా ఉపయోగపడేది. కమ్యూనిస్టులతోపాటు జాతీయ స్థాయి నేతలతో పవన్ కలుస్తున్నారు అనేది ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేది. ఓ నాలుగైదు నెలలు కిందటైనా ఆమె ఏపీకి వచ్చి, పవన్ తో సభల్లో పాల్గొని ఉంటే… కొంత ప్రభావం ఉండే అవకాశాలుండేవి. ఈ ప్రచార హోరులో మాయావతి, పవన్ రోడ్ షోలకు ప్రత్యేక ప్రాధాన్యత దక్కని పరిస్థితే ఇప్పుడుంది.