ప్రజల నాడి ఎలా ఉందో గుర్తించి… తెలుగు360 పాఠకులకు అందించేందుకు మేం చేస్తున్న ప్రయత్నాన్ని.. నిష్పక్షపాతంగా కొనసాగిస్తున్నాం. వ్యక్తిగత రాజకీయ ఆలోచనలు, అభీష్టాలను పట్టించుకోకుండా.. వివిధ వర్గాల ప్రజల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని విశ్లేషించిన తర్వాతే… తుది నిర్ణయానికిరావడం జరుగుతోంది. ఫలితాలు కూడా.. మా సర్వేను ప్రతిబింబిస్తాయని మేము విశ్వాసంతో ఉన్నాం. ఇప్పటి వరకు.. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు.. అలాగే కడప సర్వేలను ప్రకటించడం జరిగింది. ఇప్పుడు గుంటూరు జిల్లా ఫలితాలను చూద్దాం..!
2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏకపక్ష విజయాలను నమోదు చేసింది. జిల్లాలో 17 అసెంబ్లీ స్థానాలు ఉండగా 12 స్థానాల్లో టీడీపీ విజయం సాధించింది. ఓడిపోయిన మంగళగరిలో పదిహేడు ఓట్లు, గుంటూరు తూర్పులో మూడు వేల ఓట్లు, మాచర్లలో 3,500 ఓట్లు బాపట్లలో ఐదు వేల ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు. నర్సరావుపేటలో బీజేపీ అభ్యర్థి పోటీ చేయడంతో.. వైసీపీ అభ్యర్థి పదిహేను వేలకుపైగా మెజార్టీ సాధించారు. ఈ సారి జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో.. సర్వేలో .. ఎలాంటి ఫలితాలు వచ్చాయో.. నియోజకవర్గాల వారీ విశ్లేషణతో చూద్దాం..!
గుంటూరు తూర్పు నియోజకవర్గం ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మూడు ప్రధాన పార్టీలు ముస్లిం అభ్యర్థులకే టికెట్లు కేటాయించడంతో పోరు హోరాహోరీగా మారింది. ఈ నియోజకవర్గంలో మైనార్టీలు పెద్ద సంఖ్యలో ఉండడంతో వారే గెలుపోటములను నిర్ణయిస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన ముస్తఫా షేక్ పోటీ చేశారు. టీడీపీ మైనార్టీయేతర ఓట్లను పొలరైజ్ చేసేందుకు ఆర్యవైశ్య అభ్యర్థి మద్దాలి గిరిధరరావును టీడీపీ బరిలోకి దించింది. ఆయన 3151 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. దీంతో ఈ దఫా టీడీపీ కూడా మైనార్టీ బాటే పట్టింది. టీడీపీ తరఫున నసీర్ అహ్మద్, జనసేన నుంచి జియావుర్ రెహ్మాన్ పోటీ చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫా ఐదేళ్లలో చేసిందేమీ లేదన్న అసంతృప్తి ఉంది. జనసేన తరఫున పోటీ చేస్తున్న జియావుర్ రెహ్మాన్ ముస్లింల కోసం మసీదుని నిర్మించారు. ప్రతి ఏటా పేద ముస్లిం యువతుల వివాహాలకు నగదు పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ మూడు పార్టీల హోరాహోరీ నడుస్తోంది. ఎవరు బయటపడినా… స్వల్ప తేడాతోనే. ఇప్పటికి… వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ముస్తఫాకే స్వల్ప మొగ్గు కనిపిస్తోంది. గుంటూరు పశ్చిమ స్థానంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున లేళ్ల అప్పిరెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు అంతో ఇంతో మాస్ ఫాలోయింగ్ ఉంది. హఠాత్తుగా ఆయనను కాదని.. చంద్రగిరి ఏసురత్నం అనే మాజీ పోలీసు అధికారిని తెచ్చి జగన్ టిక్కెట్ ఇచ్చారు. టీడీపీ తరపున గత ఎన్నికల్లో గెలిచిన మోదుగుల.. వెళ్లి… వైసీపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఐదేళ్లలో ఆయన తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఈ సారి టీడీపీ టిక్కెట్‌ను.. గత ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేసిన మద్దాల గిరికి కేటాయించింది. ఈయన పశ్చిమ నియోజకవర్గ పరిధిలోనే నివాసం ఉంటారు. జనసేన తరపున తోట చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. గతంలో పీఆర్పీ తరపున పార్లమెంట్ కు పోటీ చేసిన అనుభవం ఉంది. ప్రధానంగా పోటీ… టీడీపీ, జనసేన మధ్యే జరుగుతున్న వాతావరణం కనిపిస్తోంది. వైసీపీలో పని చేసిన తోట చంద్రశేఖర్ కోసమే.. జగన్.. డమ్మీ అభ్యర్థిగా ఏసురత్నంను నిలబెట్టారనే ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది. అది వైసీపీ అభ్యర్థికి నష్టం చేస్తోంది. ఇప్పటికి ఉన్న పరిస్థితి చూస్తే గత ఎన్నికల్లో వచ్చిన ఫలితం.. అంటే టీడీపీ అభ్యర్థికే విజయం దక్కే అవకాశాలు ఉన్నాయి.
చిలుకలూరిపేట నియోజకవర్గంలో.. టీడీపీ తరపున మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన ఎన్నారై విడదల రజనీ పోటీలో ఉన్నారు. జనసేన నుంచి మిరియాల రత్నకుమారి పోటీ చేస్తున్నారు. ప్రత్తిపాటి పుల్లారావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం ఉంది. అందరిని కలుపుకొని పోతారని ఆయనకు మంచిపేరు ఉంది. గ్రామాల్లో పట్టు ఉంది. ఆయనకు సమఉజ్జీగా… మర్రి రాజశేఖర్ ఉండేవారు. గతంలో ఓ సారి ఓడించారు. అయితే.. సామాజిక సమీకరణాలు, ఆర్థిక స్థోమత చూసుకుని జగన్.. హఠాత్తుగా.. టీడీపీ నుంచి కేవలం టిక్కెట్ కోసమే వచ్చిన విడదల రజనీని సమన్వయకర్తగా నియమించి టికెట్‌ను కూడా ఆమెకే కేటాయించారు. టిక్కెట్ ఇవ్వకపోయినా మంత్రి పదవి ఇస్తామని.. మర్రి రాజశేఖర్ ను ఎలాగోలా బుజ్జగించిన జగన్.. పార్టీలోనే ఉండేలా చూసుకోగలిగారు. కానీ రజనీ గెలుపునకు.. మర్రి రాజశేఖర్ వర్గం సహకరించే పరిస్థితి లేదు. ధన బలంతో.. విడదల రజనీ, ఆమె వర్గీయులు చేస్తున్న హడావుడి ప్రజల్లో వ్యతిరేకత తెచ్చి పెడుతోంది. జనసేన అభ్యర్థి… వైసీపీకి అండగా ఉండే ఓట్లను పొందడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికి గ్రామాల వారీగా బలాబలాలను అంచనా వేసి చూస్తే.. మరోసారి ప్రత్తిపాటి పుల్లారావు విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. పల్నాడులోని గురజాల నియోజకవర్గంలో టీడీపీ తరపున యరపతినేని శ్రీనివాస్, వైసీపీ తరపున మహేష్ రెడ్డి, జనసేన తరపున చింతలపూడి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. జగన్ వ్యక్తితంగా టార్గెట్ పెట్టుకున్న నేతల్లో యరపతినేని ఒకరు. అందుకే కాసు కుటుంబానికి చెందిన మహేష్ రెడ్డికి టిక్కెట్ ఇచ్చారు. కానీ యరపతినేని నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో పట్టు బిగించారు. మహేష్ రెడ్డి నరసరావుపేటలో నివాసం ఉంటారు. దీంతో.. వైసీపీకి పట్టున్న గ్రామాల్లోనూ… అనుకూలతను యరపతినేని పెంచుకున్నారు. ఈ సారి ఆయనకు మెజార్టీ పెరుగుతుందన్న అంచనాలున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో టీడీపీ చివరి ఎవరూ అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితి వల్ల ప్రతీసారి నష్టపోతోంది. ఈ సారి కూడా అదే పరిస్థితి ఏర్పడింది. చలమారెడ్డి, మధుబాబు ఇక్కడ ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడినా చివరికి.. పారిశ్రామికవేత్త అంజిరెడ్డిని బరిలో నిలబెట్టారు. దీం వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత మూడు దఫాలుగా విజయం సాధిస్తున్నారు. స్థానికంగా ఉంటాడన్న పేరు ఇతనికి కలిసి వస్తోంది. టీడీపీలో ఉన్న అంతర్గత కలహాల మూలంగా మరోసారి పిన్నెల్లి ఓట్ల విషయంలో సర్‌ప్లస్‌లో ఉన్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో.. నారా లోకేష్ పోటీ చేస్తూండటంతో అందరి దృష్టి ఉంది. పోటీ ఉందని.. పైకి ప్రచారం జరుగుతోంది కానీ.. టీడీపీకి ఏకపక్ష పోలింగ్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోటీలో ఉన్న లోకేష్ అయితే.. రాజధానిగా ప్రకటించడం మరో కారణం. కొన్ని గ్రామాల్లో చాలా కొద్ది మంది రైతులు మాత్రమే.. రాజధానిని వ్యతిరేకించారు. మళ్లీ టీడీపీ వస్తే.. రాజధాని నిర్మాణం వేగంగా జరుగుతుందని అక్కడి వారు భావిస్తున్నారు. చేనేత వర్గాల్లో మొదటి నుంచి టీడీపీకి ఆదరణ ఉంది. గత ఎన్నికల్లో.. వైసీపీ అభ్యర్థి పోస్టల్ ఓట్లతో గట్టెక్కారు. 2014లో నామినేషన్ చివరి రోజు అభ్యర్థిని ఖరారు చేయడంతోనే ఆ పరిస్థితి వచ్చింది. ముందుగా.. తులసీ సీడ్స్ యజమాని రామచంద్రప్రభుకి టిక్కెట్ ఇచ్చారు. ఆయన వెనక్కి తగ్గడంతో.. చివరి నిమిషంలో గంజి చిరంజీవికి చాన్సిచ్చారు. ముందుగా అభ్యర్థిని ఖరారు చేసి ఉంటే గతంలోనే ఆ సీటు టీడీపీ ఖాతాలో పడి ఉండేది. ఈ సారి మాత్రం.. ఫలితంపై ఎవరికీ అనుమానాల్లేవు. నర్సరావుపేట నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న కోడెలకు.. వైఎస్ తనదైన శైలిలో చెక్ పెట్టారు. నియోజకవర్గాల పునర్విభజన పేరుతో.. కోడెలకు ఏకపక్షంగా మద్దతుగా నిలిచే నకరికల్లు మండలాన్ని సత్తెనపల్లిలో కలిపేశారు. దాంతో… రెండు సార్లు కోడెల కాసు కృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి గెలిచారు. బీజేపీతో పొత్తులో భాగంగా 2014 ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగి ఓడిపోయారు. అప్పటి నుంచి ఇక్కడ టీడీపీ ఇన్చార్జ్ బాధ్యతలు కోడెల శివ ప్రసాద్ నిర్వహించారు. బీసీ కోటాలో డాక్టర్ అరవింద్ బాబుకు టిక్కెట్ కేటాయించారు. వైసీపీ తరున సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి చాన్సిచ్చారు. జనసేన పార్టీ తరపున సయ్యద్ జిలానీ పోటీ చేస్తున్నారు. ముస్లిం ఓట్లు, పవన్ అభిమానుల ఓట్లు భారీగా చీల్చుకోనున్నారు. అయినప్పటికీ.. ఇక్కడ వైసీపీ అభ్యర్థికే విజయావాకాశాలున్నాయని సర్వేలో తేలింది.
పెదకూరపాడు నియోజకవర్గంలో టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ కు చాన్సిచ్చింది. సౌమ్యుడిగా పేరు ఉంది. ఈ సారి కూడా ఆయనకే టికెట్‌ను ఖరారు చేశారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు బలంగా లేక పోవడం కూడా కొమ్మాలపాటికి కలసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా నిన్నటి వరకు కావటి మనోహర్ నాయుడు ఉన్నారు. చివరిలో జగన్ ఆయనను కాదని… రియల్ ఎస్టేట్ వ్యాపారి నంబూరు శంకరరావును ఇటీవల సమన్వయకర్తగా నియమించారు. కాపు సామాజికవర్గం జనసేనవైపు నిలుస్తోంది. ఇక్కడ కొమ్మాలపాటి విజయం ఖాయంగానే కనిపిస్తోంది. సత్తెనపల్లిలో కోడెలతో అంబటి రాంబాబు మరోసారి తలపడుతున్నారు. కోడెలపై కొంత మంది నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. అందరూ సర్దుకుపోయారు. వైసీపీ నుంచి అంబటి రాంబాబు పోటీ చేస్తున్నారు. ఆయనకూ అసంతృప్తి ఉంది. జనసేన అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే యర్రం వెంకటేశ్వరరెడ్డి పోటీ చేయడంతో.. పరిస్థితి మారిపోయింది. ఆయన అంబటి రాంబాబుకు ఎర్త్ పెట్టేశారని… సత్తెనపల్లిలో ప్రచారం జరుగుతోంది. అందుకే.. అంబటి వర్గీయులు… యర్రం .. కోడెలకు అమ్ముడుపోయారని ఆరోపిస్తున్నారు. వైసీపీకి పడతాయనుకుంటున్న పదిహేను వేల ఓట్లు.. జనసేనకు వెళ్లబోతున్నయి. దీంతో.. కోడెలకు.. ఈ సారి పరిస్థితి మరింత అనుకూలంగా మారింది. వినుకొండలో టీడీపీ అభ్యర్థిగా జీవీ ఆంజనేయులు మరోసారి పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున అత్యధిక ఓట్లతో గెలుపొందారు. పార్టీ నాయకులతో, కార్యకర్తలతో ఆంజనేయులు కలివిడిగా ఉండటంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదే విధంగా శివశక్తి ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇవన్నీ తన గెలుపును నల్లేరు మీద నడక చేస్తాయన్న ధీమాలో జీవీ ఉన్నారు. వైసీపీ తరపున బొల్లా బ్రహ్మనాయుడు బరిలో ఉన్నారు. ఇక్కడ వైసీపీ క్యాడర్ పూర్తి స్థాయిలో లేదు. జనసేన తరపున వెన్నా శ్రీనివాసరావు పోటీ చేస్తున్నారు. టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు మెరుగైన స్థితిలో ఉన్నారు.
పొన్నారులో.. ఈ సారి కూడా ధూళిపాళ్లకు ఎదురులేని వాతావరణం కనిపిస్తోంది. చివరి క్షణంలో గుంటూరు నుంచి అభ్యర్థిని వైసీపీ దిగుమతి చేయడమే దీనికి కారణం. నియోజకవర్గం ఎమ్మెల్యే నరేంద్రకుమార్ కనుసన్నల్లోనే ఉంటుంది. వైసీపీ తరపున రావి వెంకటరమణ గట్టి ప్రతిపక్షంగా పోటీగా నిలిచారు. చేబ్రోలుకు చెందిన వైసీపీ ఎంపీపీ ఖాదర్‌బాషా తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే నియోజకవర్గంలో వైసీపీ నాయకులు కూడా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. రావి వెంకటరమణ… కిలారి రోశయ్యకు సహకరించే పరిస్థితి లేదు. ఉమ్మారెడ్డి అల్లుడయిన రోశయ్యకు… పొన్నూరు పూర్తిగా కొత్త. వైసీపీ గాలి వస్తే గెలుస్తాం కదా అన్న ఉద్దేశంతో పోటీకి సిద్ధమయ్యారు. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రత్తిపాడులో టీడీపీ నుంచి డొక్కా మాణిక్యవరప్రసాద్ పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి మేకతోటి సుచరిత, జనసేన నుంచి రావెల కిషోర్ బాబు పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీకి అండగా ఉండే సామాజికవర్గం.. గెలుపు బాధ్యతను తీసుకుంది. వైసీపీకి మాజీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత పోటీ చేస్తున్నారు. ఈమె తాడికొండ ప్రాంతానికి చెందిన ఓ మండలంలో రెడ్డి సామాజికవర్గం వారు అధికంగా ఉండటంతో.. వారు అండగా నిలుస్తున్నారు. ఈ సారి జనసేన అభ్యర్థి బరిలో ఉండటంతో… గతంలో.. వైసీపీకి సహకరించిన కొంత మంది.. ఆ పార్టీ వైపు మొగ్గుతున్నారు. ముక్కోణపు పోరులో డొక్కా మాణిక్యవరప్రసాద్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెపల్లేలో టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యేగా అనగాని సత్య ప్రసాద్, వైసీపీ తరపున మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, జనసేన నుంచి కమతం సాంబశివరావు పోటీ చేస్తున్నారు. పనితీరుతో.. అంతో ఇంతో.. మంచి పేరు తెచ్చుకున్న అనగానికి… ఆయన సోదరుని వ్యవహారశైలి ఇబ్బందిగా మారింది.అయితే.. మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణపై అక్కడి ప్రజల్లో సదభిప్రాయం లేదు. ముఖ్యంగా ఆయన తమ్ముడు హరనాధ్‌బాబు తీరు వైసీపీకి చేటు చేసే విధంగా ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 25 వేల మంది ఉన్నారు. దీంతో జనసేన భారీగా ఓట్లు చీల్చుకోనుంది. ఇక్కడ టీడీపీ అభ్యర్థే ముందంజలో ఉన్నారు. బాపట్ల నియోజకవర్గంలో.. ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ ను టీడీపీ అభ్యర్థిగా నిలిపింది. బాపట్ల నియోజకవర్గంలో టీడీపీలో వర్గపోరు తీవ్రంగా ఉంది. పార్టీలో మూడు వర్గాలు కొనసాగుతున్నాయి. గత మూడు దఫాలుగా ఇక్కడ టీడీపీ ఓటమి పాలవుతూ వస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి ఇక్కడ మంచిపట్టు సాధించారు. ఇక్కడ ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ రెండు వర్గాలు వైసీపీకి కలిసొస్తున్నాయి. ఈసారీ ఇక్కడ వైసీపీకి గెలుపు అవకాశాలున్నాయి. జనసేన తరపున… పులుగు మధుసూదన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రెండు పార్టీల ఓట్లను ఆయన చీల్చే అవకాశం ఉంది.
తాడికొండలో టీడీపీ అభ్యర్థికి అనుకూల పవనాలు వీస్తున్నాయి. తెనాలి శ్రావణ్ కుమార్ ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీలో కొంత మంది నేతలు ఆయనను వ్యతిరేకిస్తూ.. ఓ ఇండిపెండెంట్ ను నిలబెట్టారు. అయినా పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు. వైసీపీ తరపున పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కత్తెర క్రిస్టియానా కొంతకాలం సమన్వయ కర్తగా వ్యవహరించారు. ఆమెను కాదని పార్టీలో కొత్తగా చేరిన డాక్టర్ ఉండవల్లి శ్రీదేవికి సమన్వయకర్త భాద్యతలు అప్పగిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఆమె రాజకీయాలకు కొత్త అయినప్పటికీ టికెట్‌ను కూడా కేటాయించారు. అయితే పార్టీ వర్గాల సహకారం అందకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితులు..శ్రావణ్ కుమార్ కు కలసి వస్తున్నాయి. తెనాలి నియోజకవర్గంలో టీడీపీ తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఉన్నా 19 వేలకుపైన మెజారిటీతో తెలుగుదేశం తరుపున పోటీ చేసిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్‌పై గెలుపొందారు. కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో స్పీకర్‌గా ఉండి కీలకపాత్ర పోషించిన నాదెండ్ల మనోహర్ పదిహేను వేల ఓట్లు సాధించారు. ఈ సారి ఆయన జనసేన తరపు నుంచి పోటీ చేస్తున్నారు. కాపు ఓట్లు మరిన్ని అదనంగా సాధించగలరు కానీ.. గెలుపు వాకిట వరకూ రాలేదని చెబుతున్నారు. త్రిముఖ పోటీలో టీడీపీ అభ్యర్థి ఆలపాటికి అడ్వాంటేజ్ ఉంది.
పెదకూరపాడు | టీడీపీ |
తాడికొండ (ఎస్సీ) | టీడీపీ |
మంగళగిరి | టీడీపీ |
పొన్నూరు | టీడీపీ |
వేమూరు (ఎస్సీ) | టీడీపీ |
రేపల్లె | టీడీపీ |
తెనాలి | టీడీపీ |
బాపట్ల | వైసీపీ |
ప్రత్తిపాడు (ఎస్సీ) | టీడీపీ |
గుంటూరు పశ్చిమ | టీడీపీ |
గుంటూరు తూర్పు | వైసీపీ |
చిలకలూరిపేట | టీడీపీ |
నరసరావుపేట | వైసీపీ |
సత్తెనపల్లి | టీడీపీ |
వినుకొండ | టీడీపీ |
గురజాల | టీడీపీ |
మాచర్ల | వైసీపీ |