పదహారు మంది ఎంపీలను గెలిపిస్తే… జాతీయ రాజకీయాలను మార్చేస్తామంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో తెరాస ప్రచారమంతా జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పడం, అత్యధిక ఎంపీ స్థానాలు తెరాసకు ఉంటే తెలంగాణకు అత్యధిక ప్రయోజనాలను రాబడతామని చెప్పడం చుట్టూనే తిరుగుతోంది. అయితే, దీనికి ధీటుగా కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ సరైన ప్రచారం చెయ్యలేకపోతోందనే చెప్పాలి. కేసీఆర్ కి 16 ఎంపీ సీట్లు ఇస్తే ఏం చేస్తారని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంటే… 2 ఎంపీ సీట్లతో తెలంగాణ సాధించారంటూ తెరాస నేతలు తిప్పి కొడుతున్నారు. నిజానికి, గత ఎన్నికల తరువాతి నుంచి తెరాసలో ఉన్న ఎంపీలు ఎందరు? గడచిన ఐదేళ్లలో వారేం సాధించారనే అంశాన్నే కాంగ్రెస్ బలంగా ప్రశ్నించడం లేదు.
టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ… ఐదేళ్లపాటు తెరాస ఎంపీలు ఏం సాధించారని ప్రశ్నించారు. 2014 ఎన్నికల్లో 11 ఎంపీ స్థానాలు కేసీఆర్ గెలుచుకున్నారనీ, అవి చాలవన్నట్టుగా కాంగ్రెస్ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి, మల్లారెడ్డి, పొంగులేటిని తీసుకుని మొత్తం 14 మంది అయ్యారన్నారు. మరోపక్క, మిత్రపక్షమైన ఎం.ఐ.ఎం. ఎంపీ ఒవైసీ ఉన్నారనీ, ఇంకో మిత్రపక్షం భాజపా ఎంపీ బండారు దత్తాత్రేయ కూడా ఉన్నారనీ, వీరందరితో కలిపి కేసీఆర్ కి మద్దతుగా 16 మంది ఎంపీలు ఉన్నారన్నారు ఉత్తమ్. గడచిన ఐదేళ్లుగా 16 మంది ఎంపీలు మీవెంట ఉంటే తెలంగాణకు ఏం సాధించారని కేసీఆర్ ని ప్రశ్నించారు. నంది ఎల్లయ్య మినహా మీ దగ్గరున్న ఎంపీలతో కేంద్రం నుంచి ఏం కొత్తగా రాబట్టారని నిలదీశారు. అలాంటి కేసీఆర్ కి, లోక్ సభ ఎన్నికల్లో తిరిగి ఓటు అడిగే అర్హత లేదన్నారు.
నిజానికి, తెరాస ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టగలిగే ప్రచారాంశం ఇది. 16 మందిని ఇస్తే ఏదో సాధించేస్తామని అంటున్న కేసీఆర్ కి…. ఆ పదహారు మందీ గత ఐదేళ్లుగా వెంటే ఉన్నారనీ, అయినా కేంద్రం నుంచి తెచ్చిందని ఏంటనేది సరైన ప్రచార కౌంటరే. కానీ, దీన్ని బలంగా ప్రజల్లోకి తీసుకోవడంలోనే కాంగ్రెస్ ప్రయత్న లోపం కనిపిస్తోంది. ఓవరాల్ గా, తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ కొంత వెనకబడే ఉంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనుభవం, ఆ తరువాత ఉన్న కొద్దిమంది కీలక నాయకులు కూడా భాజపాకి వెళ్లిపోతూ ఉండటంతో కొంత ఆత్మవిశ్వాసం సడలిన పరిస్థితి. దీంతో కేసీఆర్ ను ప్రచారంలో సమర్థంగా ఎందుర్కొనే ప్రచారాంశం ఉన్నా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లలేని పరిస్థితి కాంగ్రెస్ లో కనిపిస్తోంది.