ఆవు కథ అనీ… ఒకటి చెప్తుంటారు పెద్దలు! దేని గురించి మాట్లాడమన్నా… తనకు తెలిసిన ఒకే ఒక్క ఆవు కథ దగ్గరకి వెళ్లిపోయేవాడు వెనకటికొకడు ఉన్నాడని ఆ కథ సారాంశం. దాన్ని ఇప్పటికి ఆపాదించాలంటే… భాజపా అధ్యక్షుడు అమిత్ షా ప్రసంగాన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎన్నికల ప్రచారంలో ఆయన దేని గురించి మాట్లాడటం మొదలుపెట్టినా, ఎక్కడ ప్రసంగించినా…. దేశ రక్షణ టాపిక్ దగ్గరకి వచ్చేస్తుంటారు. నరసారావుపేటలో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… ఆంధ్రాకి మోడీ ఏం చేశారంటూ టేకాఫ్ అయిన ప్రసంగం, కాసేపటికే దేశభక్తి కలిగిన మోడీ ఏం చేశారనే అంశం దగ్గర ల్యాండ్ అయింది!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా పనులు చేశారన్నారు అమిత్ షా. దేశంలో తీవ్రవాదులు చెలరేగాలని చూస్తే, వారి వెన్ను విరిచే కార్యక్రమం కూడా నరేంద్ర మోడీ చేశారన్నారు! దేశానికి ఎలాంటి నాయకుడు కావాలో ఈ పార్లమెంటు ఎన్నికలు తేలుస్తాయనీ, దేశాన్ని రక్షించే మోడీ కావాలో, రాహుల్ బాబా కంపెనీ కావాలో ప్రజలు తేల్చుతారన్నారు. ఏపీ విభజన చట్టంలోని అంశాలను అమలు చేయడానికి పదేళ్లు సమయం ఉన్నా… ఐదేళ్లలోనే చాలా చేశామన్నారు అమిత్ షా. కేంద్రం ఇచ్చిన విద్యా సంస్థల గురించి ఒక్కోటిగా చెప్పుకుంటూ, చివరికి విశాఖ రైల్వేజోన్ కూడా ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీది అన్నారు. 2014లో మోడీ హవాని చంద్రబాబు నాయుడు వాడుకున్నారనీ, ఇప్పుడు మోడీని విమర్శిస్తూ సానుభూతిని ఆయన వాడుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అన్నిటికన్నా మోడీ చేసిన గొప్ప పని ఏంటంటే… పుల్వామా ఘటనకు ప్రతీకారంగా పాకిస్థాన్ లోకి చొరబడి యుద్ధం చేశారన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే, మరో ఐదేళ్లపాటు ఈ దేశం నరేంద్ర మోడీ చేతుల్లో ఉండాలన్నారు.
ఏపీకి చాలా చేశారు అంటూ విద్యా సంస్థల గురించే పదేపదే చెప్పడం భాజపాకి అలవాటైపోయింది. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, కడప ప్లాంటు వంటి అంశాలు ప్రజలకు గుర్తొచ్చే సమయానికి… దేశరక్షణ, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థలపై పోరాటం అంటూ చర్చను పక్కతోవ పట్టించారు అమిత్ షా! ఇంతకీ… పుల్వామాలో ఉగ్రవాదులు దాడి చేశారంటే, అది మోడీ సర్కారు వైఫల్యం కాదా? కాశ్మీరులో గవర్నర్ పాలన తీసుకొచ్చాక జరిగిన దాడిని మోడీ సర్కారు వైఫల్యంగానే చూడాలి కదా. వారి వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం, సైనిక దాడులను మోడీ సర్కారు విజయంగా ఎన్నికల్లో ప్రచారం చేసుకుని లబ్ధి పొందడం కోసం చేస్తున్న ప్రయత్నాన్ని ఏమనాలి? ఐదేళ్లలో పాలనాపరంగా మోడీ సాధించిన విజయాలేవి? ఆంధ్రాకి చేసిన ప్రత్యేక సాయం ఏది..? వీటి గురించి మొదలుపెట్టి… దేశ సరిహద్దుల దగ్గరకు వెళ్లిపోయారు అమిత్ షా.