చాన్నాళ్ల తరువాత హైదరాబాద్ లో బహిరంగ సభ పెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఈ సభకు హాజరయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పోటీ చెయ్యలేదుగానీ, ఇప్పుడు లోక్ సభకు బీఎస్పీతో కలిసి పోటీ పడుతున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థుల తరఫున ప్రచారానికి పవన్ వచ్చారు. బీఎస్పీతో కలయిక వల్ల ఆంధ్రాలో దళిత వర్గాల ఓట్లను పవన్ కల్యాణ్ చీల్చుతారనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణకు వచ్చేసరికి… అదే దళిత సెంటిమెంట్ ను కరెక్ట్ గా ప్రయోగించారనే చెప్పాలి. అధికార తెరాస పార్టీ మీదకి పరోక్షంగా ఈ దళిత సెంటిమెంట్ తో విమర్శలు చేశారు పవన్.
తెలంగాణ ఉద్యమం నా చేతుల్లో ఉండి ఉంటే… ఆంధ్రా పాలకులకు చుక్కలు చూపించేవాడిని అన్నారు పవన్. మొత్తం తెలంగాణ ఉద్యమంలో తీరని కోరికగా ఒకటి మిగిలిపోయిందనీ, రాష్ట్రం ఏర్పడగానే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు కావొచ్చు, కేసీఆర్ కోరుకున్న ప్రత్యేక పరిస్థితులు కావొచ్చు… ఆ కోరిక తీరకుండా ఉండిపోయిందన్నారు. ఈ దేశానికి ఒక ఛాయ్ వాలా ప్రధాని అవగలిగినప్పుడు, ఇన్నేళ్లు ఉద్యమం నడిపిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పుడు, మాయావతి దేశానికి ఎందుకు ప్రధాని కాలేరన్నారు. తెలంగాణకు దళిత ముఖ్యమంత్రిని చూడలేకపోయాంగానీ, మాయావతిని దేశ ప్రధానిగా ఎందుకు చేయలేమన్నారు. ఈ నేల దళితుడిని ముఖ్యమంత్రిగా చూడాలని ప్రతిధ్వనించిందీ, అది నెరవేరకపోవడానికి కారణమైన పరిస్థితులు ఏమైనప్పటికీ… తెలంగాణ ఏర్పడ్డ తరువాత ఆ కోరికను చంపేసుకున్నామన్నారు. కానీ, ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం వచ్చిందన్నారు.
నతవరం తెలంగాణా అంటే అది తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్, లేదా సబితా ఇంద్రారెడ్డి లాంటి పాత ముఖాలతో వచ్చేది కాదన్నారు. తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే యువతకు అవకాశం ఇచ్చి ఉండేవాణ్ననీ, తెలంగాణకు కొత్తతరం నాయకుల్ని ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటున్నా అన్నారు పవన్. అనంతరం జనసేన, బీఎస్పీ అభ్యర్థులను పవన్ పరిచయం చేశారు. తెలంగాణలో కేసీఆర్ ఇచ్చిన దళిత ముఖ్యమంత్రి హామీని గుర్తు చేస్తూ, అది సాధ్యం కాలేదు కాబట్టి దళిత ప్రధానిని చేసుకుందామంటూ పవన్ చెప్పడం కచ్చితంగా కరెక్ట్ టైమ్ లో, ఈ అంశాన్ని కరెక్ట్ గా వాడుకున్నారని చెప్పొచ్చు. ఇంకోటి… నవతరం నాయకుల్ని తయారు చేస్తానంటున్నారు. అంటే, తెలంగాణలో జనసేన భవిష్యత్తు గురించి కూడా కొంత వ్యూహాత్మకంగా ఉన్నారా అనిపిస్తుంది. దళిత సెంటిమెంట్ పై పవన్ మాట్లాడారు కాబట్టి, తెరాస నుంచి దీనిపై ఎవరైనా స్పందిస్తారా లేదా చూడాలి. తెలంగాణలో ఈ దళిత అంశం జనసేన-బీఎస్పీ కూటమికి బాగా ప్లస్ అని చెప్పలేంగానీ… కొత్త చర్చకు ఆస్కారం ఇచ్చింది.