మొన్న తునిలో జరిగిన విద్వంసంలో రూ.103 కోట్లు నష్టం వాటిల్లినట్లు ప్రాధమిక అంచనాలో తేలిందని పోలీస్ ఐజి కుమార్ విశ్వజిత్ మీడియాకు తెలిపారు. రత్నాచల్ ఎక్స్ ప్రెస్, అనేక పోలీస్ మరియు ప్రైవేట్ వాహనాలకు కొందరు దుండగులు నిప్పు పెట్టడం వలన చాలా భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు. రైల్ రోకో కారణంగా అనేక రైళ్ళను రద్దు చేయడం వలన కూడా రైల్వేలకు చాలా బారీ నష్టం జరిగిందని చెప్పారు. దీనిపై రైల్వే అధికారులు పూర్తి వివరాలు అందిస్తారని ఆయన తెలిపారు.
జాతీయ రహదారిని కూడా ఆందోళనకారులు కొన్ని గంటలపాటు తమ అధీనంలో ఉంచుకోవడం వలన రోడ్ ట్రాన్స్ పోర్ట్ సంస్థలకి కూడా బారీగానే నష్టం జరిగి ఉండవచ్చును. ఈ విద్వంసానికి పాల్పడిన వారిలో 250 మందిని ఇంతవరకు గుర్తించమని, ముద్రగడతో సహా మొత్తం 50 మందిపై కేసులు నమోదు చేసామని తెలిపారు. సభ నిర్వాహకులు దాని కోసం తమ వద్ద నుండి ఎటువంటి అనుమతి తీసుకోలేదని ఆయన తెలిపారు. సభ నిర్వహించుకోవడానికి తన కొబ్బరితోటను ఇచ్చిన స్థల యజమానిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసారు. కొన్ని అసాంఘిక శక్తులు ఈ విద్వంసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నామని, వీడియో క్లిప్పింగ్స్, ఫోటోలు, మొబైల్ కాల్ డాటా ఆధారంగా దీనికి బాధ్యులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు.