ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారం చివరి దశకు చేరుకునే సరికి… రాజకీయ పార్టీల ప్రచార సరళి కూడా మారిపోయింది. తాము మళ్లీ రాకపోతే.. రాష్ట్రం ఇబ్బందుల్లో పడుతుందని.. టీడీపీ నేతలు అంటూంటే… వైసీపీ నేతలు మాత్రం.. ఒక్క చాన్స్ ప్లీజ్ అంటున్నారు. మీ బిడ్డగా భావించి ఒక్క అవకాశం ఇవ్వండి అని జగన్ అడుగుతున్నారు. మా బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి అని.. ఆయన తల్లి, చెల్లి ప్రచారసభల్లో కోరుతున్నారు. ఈ ప్రచారం.. ఎలాంటి మార్పు తెస్తుందో కానీ.. ఓటర్లలో మాత్రం.. వ్యతిరేక భావన వ్యక్తమవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. గెలుపుపై ఆశలు వదిలేసుకుని.. చివరికి సానుభూతి కార్డు వాడుతున్నారన్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
మళ్ళీ బాబే రావాలి అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ప్రచారం సాగిస్తోంది. ఐదేళ్ల పాలనలో చంద్రబాబు నవ్యాంధ్రను అభివృద్ధి పథంలో నడిపించారని, ఆయన రాకపోతే జరుగుతున్న పనులు, నడుస్తున్న పథకాలు ఆగిపోతాయని హెచ్చరిస్తోంది. రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, రాష్ట్రానికి పరిశ్రమల రాక వంటివన్నీ కొనసాగాలంటే ఇంకొక్కసారి చంద్రబాబుకు అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం వైసీపీ మాత్రం ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్ అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. చంద్రబాబు పాలన చూశారని, జగన్‌కు కూడా ఒక అవకాశం ఇస్తే ఆయన ఏం చేస్తారో చూడొచ్చని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. పిల్లలను పాఠశాలలకు పంపిస్తే నెలనెలా డబ్బులు ఇస్తామని, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని, మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి ఉన్నత చదువులను ఉచితంగా చదివిస్తామని జగన్ హామీలు ఇస్తున్నారు.
జగన్‌కూ ఒక్క అవకాశం ఇవ్వాలనే నినాదాన్ని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం వైసీపీ నాయకత్వం తాజాగా విజయమ్మ, షర్మిలను కూడా ప్రచారంలోకి దింపింది. అటు తమకు అనుకూలించే నినాదాలతోపాటు ప్రత్యర్థుల నినాదాల ప్రభావాన్ని తగ్గించడానికి కూడా పార్టీలు వ్యూహరచన చేస్తున్నాయి. ఈ వ్యూహంలో టీడీపీ దూకుడుగా ఉంది. ఒకసారి ఛాన్స్ ఇవ్వాలనుకుని ఆత్మహత్య చేసుకుంటామా అని టీడీపీ అధినేత చంద్రబాబు పలు ప్రచార సభల్లో అంటున్నారు. ఏపీ ప్రజలు సెంటిమెంట్‌తో ఉంటారని.. ఒక్క చాన్స్ అంటున్నారని.. ఓటే కదా.. వేద్దామని.. అనుకుంటారని..వైసీపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. వీరి విజ్ఞప్తులు ఎంత మేర వర్కవుట్ అవుతాయో వేచి చూడాల్సిందే..!