తెలుగు360 జిల్లాల వారీగా ఇస్తున్న సర్వే ఫలితాల్లో ఈ రోజు నెల్లూరు జిల్లా వివరాలను చూద్దాం. సర్వే ఫలితాలను మేము అత్యంత పకడ్బందీగా రూపొందిస్తున్నాం. అందుకే ప్రకటిస్తున్నారు. వచ్చే ఫలితాలను .. విశ్లేషించుకుని… మా మీద పాఠకులు విశ్వాసం పెంచుకోవడం జరుగుతుందనే స్ప్రహతో సర్వేలో ప్రజాభిప్రాయాన్ని విశ్లేషిస్తున్నాం కానీ… రాజకీయ పార్టీలకు మద్దతు ప్రకటించడానికి కాదు. క్షేత్ర స్థాయి పరిస్థితులను అధ్యయనం చేసి.. ప్రజాభిప్రాయాన్ని విశ్లేషించిన తర్వాత ఫలితాలను ప్రకటిస్తున్నాం. ఈ సర్వేలు ఫలితాలు వ్యతిరేకంగా వచ్చిన పార్టీల మద్దతుదారులకు నచ్చకపోవచ్చు. అనుకూలంగా వచ్చిన వారికి బాగుండవచ్చు. కానీ మా లక్ష్యం.. ఎవరిని బాధపెట్టడమో… మరెవరినైనా రంజింప చేయడమో కాదు. చిత్తశుద్ధితో సర్వే ఫలితాలను అందించడం మాత్రమే..!
అటు కోస్తా.. ఇటు సీమ మధ్యలో ఉండే నెల్లూరు జిల్లాలో విభిన్నమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. 2014 ఎన్నికల్లో జిల్లాలో మొత్తం పది అసంబ్లీ స్థానాలుంటే.. ఏడు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. మూడు స్థానాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. ఈ సారి ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం..!
నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా.. చివరి క్షణంలో… అబ్దుల్ అజీజ్ ఖరారయ్యారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ బలహీనంగా ఉంది. అందుకే.. ముందుగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా చంద్రబాబు ఖరారు చేశారు. కానీ చివరికి ఆయన హ్యాండిచ్చి వైసీపీలో చేరారు. ఆ తర్వాత అజీజ్‌ను రంగంలోకి దింపారు. గత ఎన్నికల్లో ఈ సీటు బీజేపీకి ఇచ్చారు. అప్పుడు వైసీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పాతికవేలకుపైగా మెజార్టీ సాధించారు. ఈ సారి కూడా ఆయనే పోటీ చేస్తున్నారు. బెట్టింగ్ కేసులు, బెదిరింపులు, పోలీసులపై దాడులు వంటి కేసులు ఉన్నా.. శ్రీధర్ రెడ్డికే జగన్ టిక్కెట్ ఇచ్చారు. జనసేన తరపున చెన్నారెడ్డి మనుకాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈయన వల్ల వైసీపీ అభ్యర్థికి కొంత నష్టం జరిగినా… మరోసారి కోటంరెడ్డి విజయం దిశగా ఉన్నారని సర్వేలో వెల్లడయింది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో విద్యాసంస్థల అధినేత నారాయణ, సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. నారాయణ.. మంత్రిగా… అన్ని పనులు దగ్గరుండి చేయించారు. బీసీలు, రెడ్లు, బలిజ, ముస్లిం ఓటర్లదే కీలక పాత్ర. రెడ్లు, ముస్లిం, బలిజ ఓటర్లు గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచారు. గతంలో ఇక్కడ పీఆర్పీ విజయం సాధించింది. ముస్లింలలో ఈ సారి మార్పు కనిపిస్తోంది. బలిజ ఓటర్లలో యువత… జనసేన వైపు మొగ్గుతున్నారు. ఆ పార్టీ తరపున కేతంరెడ్డి వినోద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. పూర్తిగా సిటీ ఓటర్లు కావడంతో.. ఓటింగ్ ప్రయారిటీ కూడా.. మారుతోంది. మూడు పార్టీల మధ్య ఓట్ల చీలికతో… వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ బయటపడటం ఖాయంగా కనిపిస్తోంది.
ఇక జిల్లాలోని మరో ప్రతిష్టాత్మక నియోజకవర్గం సర్వేపల్లి. ఇక్కడ నుంచి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మరీ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉన్నారు. ఆయనే పోటీ చేస్తున్నారు. సర్వేపల్లిపై… దొంగ డాక్యుమెంట్లతో ఆరోపణలు చేసి.. కేసులో ఇరుక్కున్నారు. నకిలీమద్యం ఇతర కేసులు ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో.. ప్రజల వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. సోమిరెడ్డి వరుసగా మూడు సార్లు ఓడిపోయారన్న సానుభూతి కనిపిస్తోంది. మంత్రిగా నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు భారీగా చేపట్టడం… సంక్షేమపథకాల లబ్దిదారులు ఎక్కువగా ఉండటం సోమిరెడ్డికి సానుకూల వాతావరణం ఏర్పడేలా చేసింది. సర్వేపల్లి ప్రజలు ఆదరిస్తారనే.. ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నానని ప్రచారం చేస్తూండటం కూడా ప్రజలపై ప్రభావం చూపిస్తోంది. ఈ నియోజకవర్గంలో సోమిరెడ్డి వ్యూహం ఫలించి ఆయన విజేతగా నిలవబోతున్నారని సర్వేలో తేలింది. ఇక్కడ జనసేన మిత్రపక్షాల అభ్యర్థి బరిలో ఉన్నా ప్రభావం చూపే పరిస్థితి లేదు.
ఆత్మకూరు నియోజకవర్గం సహజంగా.. ఆనం రామనారాయణరెడ్డికి కంచుకోటలాంటిది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి చాలా పరిమితంగానే ఓట్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన వెంకటగిరి నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో ఆనం ..టీడీపీలో ఉన్నప్పుడు.. ఈ సీటును కేటాయించాలనుకున్నారు. ఆయన పార్టీని వీడిపోయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యను రంగంలోకి దించారు. వైసీపీ నుంచి జెడ్పీచైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీనాయుడులు చేరారు. వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మేకపాటి గౌతం రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో వైసీపీ సాంప్రదాయ ఓటర్లు ఎక్కువ. జనసేన నుంచి చిన్నారెడ్డి పోటీ చేస్తున్నారు. నియోజకవర్గాని.. ఒక నేత అంటూ.. టీడీపీకి చివరి వరకూ లేకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ మెజార్టీ ఓటర్లను ఆకర్షించడంలో టీడీపీ విపలమయింది. వైసీపీ అభ్యర్థి మేకపాటి గౌతం రెడ్డి మరోసారి విజయం సాధించనున్నారు. ఇక గూడూరు.. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పాశం సునీల్ మరోసారి రంగంలోకి దిగారు. గతంలో ఆయన వైసీపీ అభ్యర్థిగా గెలిచి టీడీపీ కండువా కప్పుకున్నారు. దీంతో.. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ వరప్రసాద్ ను నిలబెట్టారు. చాన్నాళ్లు వైసీపీకి ఇక్కడ నాయకత్వ కొరత ఏర్పడింది. కొన్నాళ్లు వైసీపీ ఇన్చార్జిగా మేరిగం మురళి వ్యవహరించారు. నేదురుమల్లి, నల్లపరెడ్డి, ఆనం వర్గాలు మద్దతు ఉన్నప్పటికీ.. ఆయను జగన్ చాన్సివ్వలేదు. దాంతో వరప్రసాద్ కు ఎవరూ సహకరించడం లేదు. ఈ సారి టీడీపీ అభ్యర్థిగా పాశం సునీల్ అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నారని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.
కావలి నియోజకవర్గలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. టీడీపీ తపున.. నిన్నామొన్నటిదాకా వైసీపీలోనే ఉన్న మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్థన్‌రెడ్డికి చాన్సిచ్చారు. ఇక్కడ టీడీపీ తరపున బీద మస్తాన్ రావు పోటీ చేయాల్సి ఉంది. కానీ ఆయనను పార్లమెంట్ బరిలో నిలిపారు. ఎలాంటి అసమ్మతి లేకుండా బలమైన అభ్యర్థిని రప్పించి టీడీపీ టికెట్ కేటాయించడంతో అధికార పార్టీకి కలిసొచ్చే అంశంగా మారింది. జనసేన నుంచి పసుపులేటి సుధాకర్ పోటీ చేస్తున్నారు. ముస్లిం, కాపు ఓట్లు సుధాకర్ కు ఎక్కువగా పడే అవకాశాలున్నాయి. ముక్కోణపు పోటీలో.. టీడీపీ అభ్యర్థి కాటాంరెడ్డికి అడ్వాంటేజ్ కనిపిస్తోంది. సుళ్లూరు పేట నియోజకవర్గంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మరోసారి బరిలోకి దిగారు. టీడీపీ నుంచి మాజీ మంత్రి పరసా వెంకటరత్నం పోటీ చేస్తున్నారు. గత నాలుగున్నరేళ్లుగా ఈయనే నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. టీడీపీ నేతల్ని కొంతమందిని వైసీపీ ఆకర్షించింది. ఈ నియోజకవర్గంలో బలం చూపే వాకాటి నారాయణరెడ్డి జైల్లో ఉన్నారు. ఆయనతో వైసీపీ నేతలు సమావేశం నిర్వహించి తమ పార్టీకి మద్దతిచ్చేలా చూసుకున్నారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే ఓడిపోయిన టీడీపీ.. ఈ సారి కూడా పుంజుకునే పరిస్థితి లేదని.. సర్వేలో తేలింది.
కోవూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ అభ్యర్థిగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో 7,900 పైచిలుకు ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి శ్రీనివాసులురెడ్డి విజయం సాధించారు. పోటీ పోరు హోరాహోరీగా కనిపిస్తోంది. జనసేన నుంచి టీ.రాఘవయ్య బరిలో ఉన్నారు. ప్రధానంగా టీడీపీ, వైసీపీల మధ్యే పోటీ ఉండనుంది. జనసేన టీడీపీ ఓట్లను చీల్చుకునే అవకాశం కనిపిస్తోంది. టీడీపీలో అసమ్మతి ఎక్కువగా ఉంది. నేతల మధ్య సమన్వయం లేదు. నల్లపరెడ్డి సైలెంట్‌గా తన పని తాను చక్క బెట్టుకున్నారు. దాంతో.. ఈ సారి అక్కడ టీడీపీపై నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి పై చేయి సాధించే అవకాశం ఉంది. ఉదయగిరి నుంచి మళ్లీ గత ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్లే బరిలోకి దిగుతున్నారు. సిట్టింగ్ ఎమెమ్యే బొల్లినేని రామారావు పట్ల నియోజకవర్గంలో కొంత అసంతృప్తి ఉంది. వైసీపీ నుంచి కూడా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అభ్యర్థిగా బరిలోకి దిగారు. జనసేన తరపున మారెళ్ల గురుప్రసాద్ కు టిక్కెట్ ఇచ్చినా… పెద్దగా ప్రభావం చూపే పరిస్థితి లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా బొల్లినేనిపై ఉన్న అసంతృప్తి టీడీపీకి మైనస్‌గా మారనుంది. ఈ సీటు వైసీపీఖాతాలో పడనుంది. వెంకటగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పోటీ చేస్తున్నారు. మరోసారి గెలిచి తన సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు. వైసీపీ అభ్యర్థిగా ఆనం రామనారాయణరెడ్డి పోటీ చేస్తున్నారు. కురుగొండ్ల రామకృష్ణ.. పార్టీ నేతలతో విబేధాలు తెచ్చుకున్నారు. వెంకటగిరి రాజాలు కూడా వైసీపీకే మద్దతు పలుకుతున్నారు. నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి కుమారుడు నేదురుమల్లి రాంకుమార్‌రెడ్డి వైసీపీలో చేరి.. టిక్కెట్ ఇవ్వకపోయినా మద్దతుగా పని చేస్తున్నారు. ఆనం మరోసారి అసెంబ్లీకి వెళ్లడానికి.. మార్గం సుగమం అయినట్లేనని సర్వేలో తేలింది.
కావలి | టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ ) |
ఆత్మకూరు | వైసీపీ ( వైసీపీ హోల్డ్ ) |
కోవూరు | వైసీపీ ( గెయిన్ ఫ్రం టీడీపీ ) |
నెల్లూరు అర్బన్ | వైసీపీ ( వైసీపీ హోల్డ్ ) |
నెల్లూరు గ్రామీణ | వైసీపీ ( వైసీపీ హోల్డ్ ) |
సర్వేపల్లి | టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ ) |
గూడూరు (ఎస్సీ) | టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ ) |
సూళ్లూరుపేట (ఎస్సీ) | వైసీపీ ( వైసీపీ హోల్డ్ ) |
వెంకటగిరి | వైసీపీ ( గెయిన్ ఫ్రంట్ టీడీపీ ) |
ఉదయగిరి | వైసీపీ ( గెయిన్ ఫ్రంట్ టీడీపీ ) |