జాతీయ రాజకీయాల్లో తెలుగువారు కీలకమైతే గర్వించదగ్గ విషయమే. అయితే, ఎలా అవుతారనే స్పష్టత కూడా ప్రజలకు ఉంటేనే ఆ అంశంపై కొంత ఆసక్తి ఉంటుంది. ఆ చర్చ కొంత అర్థవంతమైనదిగా వినిపిస్తుంది. ఇవాళ్టి సాక్షి పత్రికలో ‘జాతీయ శక్తిగా జగన్’ అంటూ ఒక కథనం వచ్చింది. ఎన్నికలు అయిన తరువాత జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రబల రాజకీయ శక్తి కాబోతున్నారంటూ కొన్ని జాతీయ ఛానెళ్లు అభిప్రాయపడ్డాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ కి చెందిన నాయకుడు అతి తక్కువ కాలంలోనే జాతీయస్థాయిలో గుర్తింపు సాధించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తికరమైన అంశంగా మారిందిన చెప్పారు.
కేంద్రంలో హంగ్ పార్లమెంట్ ఏర్పడితే జగన్ రాజకీయ ప్రాధాన్యం మరింత పెరుగుతుందని అంచనాలు వేస్తున్నారట. జగన్, నవీన్ పట్నాయక్, కేసీఆర్, మమతాలు కేంద్రంలో కీలకంగా మారే అవకాశం ఉందని జాతీయ ఛానెల్స్ చెబుతున్నాయని రాశారు. అందుకే, జాతీయ స్థాయి వీక్షకుల కోసం వారికి అనుగుణంగా జగన్ పై ప్రత్యేక కథనాలను కొన్ని టీవీ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయని రాశారు. రాష్ట్ర రాజకీయాలతోపాటు జాతీయ రాజకీయాల్లో జగన్ అనుసరిస్తున్న వైఖరి తెలుసుకునేందుకు జాతీయ ఛానెల్స్ ఆసక్తి చూపుతున్నాయని రాశారు.
ఇంతకీ, జాతీయ రాజకీయాలకు అనుగుణంగా జగన్ అనుసరిస్తున్న వైఖరి ఏది..? తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తప్ప, ఇతర రాష్ట్రాల నేతలతో ఆయన మాట్లాడుతున్నారా..? ఏపీ ప్రత్యేక హోదా అంశం కేంద్రం నుంచి సాధించాల్సినదే అయినా… దానికి అనుగుణంగానైనా జగన్ జాతీయ వైఖరి ఉందా.. అంటే అదీ కనిపించడం లేదు. 25 ఎంపీ స్థానాలు గెలిస్తే… హోదా తెస్తామన్నారు. నిన్న విడుదల చేసిన మేనిఫెస్టోలో కూడా హోదా సాధన కోసం పోరాటం అని పొడిపొడిగా చెప్పారే తప్ప, స్పష్టమైన విధానం లేదు. ఈ కథనం ఎలా ఉందంటే.. కేసీఆర్ మాదిరిగా జగన్ కూడా జాతీయ రాజకీయాల కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నారేమో అన్నట్టుగా ఉంది. ఫెడరల్ ఫ్రెంట్ అంటూ ప్రయత్నించిన కేసీఆర్ జాతీయ రాజకీయ వ్యూహంతో ఉన్నారంటే కొంత అర్థవంతంగా ఉంటుంది. ఆయన ప్రయత్నం కనిపిస్తుంది. అంతేగానీ, జాతీయ శక్తిగా జగన్ అని ఎవరైనా అంటే ఎలా అనేది అర్థం కావడం లేదు. ఆ దిశగా ఆయన చేస్తున్న ప్రయత్నం ఇదీ అని చెప్పుకోవడానికి ఒక్క ఉదాహరణ ఇచ్చినా కొంత నమ్మశక్యంగా ఉండేది.