వైసీపీ మేనిఫెస్టో పచ్చి మోసంతో కూడుకున్న వ్యవహారంలా కనిపిస్తోంది. అందులో రాష్ట్ర సంపదను ఎలా పెంచుతారో చెప్పలేదు కానీ.. ఇప్పుడున్నదాన్ని పంచుతానని ప్రకటించారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయాధారిత రాష్ట్రంగా మారింది. అందుకే.. రాజకీయ పార్టీలు.. రైతులపై ఎక్కువగా దృష్టి పెట్టాయి.
రైతులను దగా చేస్తానని మేనిఫెస్టోలో చెప్పిన జగన్..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. వైసీపీ మేనిఫెస్టో ప్రకటనలో..నవరత్నాల్లో ఒకటిగా.. రైతు భరోసా కింద… ఏటా మే నెలలో రూ. 12, 500 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ మొత్తం యాభై వేలుగా లెక్కించారు. అంటే.. నాలుగేళ్ల పాటు మాత్రమే ఇస్తారు. ఒక వేళ జగన్ అధికారంలోకి వస్తే.. మొదటి ఏడాది.. రైతులకు ఎలాంటి సాయం అందదు. తర్వాత ఏడాది మే నుంచి అంటే.. 2020 మే నుంచి మాత్రమే రైతు భరోసా పథకం ప్రారంభమవుతుంది. అదే సమయంలో.. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకం పేరుతో.. రాష్ట్రం పథకాన్ని అమలు చేస్తోంది. రెండు విడతలుగా మొత్తం పదిహేను వేల రూపాయలు రైతుల ఖాల్లో జమ అవుతుంది. తొలి విడతగా జమ చేశారు కూడా. ఈ పదిహేను వేలల్లో ఆరువేలు కేంద్రం.. మరో తొమ్మిది వేలు రాష్ట్రం ఇస్తాయి. కేంద్ర పథకానికి అర్హులు కాని వారందరికి ఏపీ ప్రభుత్వమే ఇస్తోంది. అంటే.. ఈ పథకాన్ని తరచి చూస్తే.. ఒక ఏడాది పాటు రైతులకు సాయం ఆగిపోతుంది. ఇప్పుడు అందుతున్న దాని కన్నా.. పాతిక వేలు తగ్గిస్తారని జగన్ చెబుతున్నరాు. ఇక వ్యవసాయానికి ఉదయం పూట తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ అని… జగన్ ప్రకటించారు. ఇప్పటికే.. ప్రభుత్వం.. తొమ్మిది గంటల ఉచిత విద్యుత్ ను ఇస్తోంది. టీడీపీ మేనిఫెస్టోలో… 12 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. అలాగే వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. దీన్ని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది.
అవ్వాతాతలపైనా అదే తరహా మోసపు ప్రయోగం..!
సామాజిక పెన్షన్ల విషయంలో… జగన్మోహన్ రెడ్డి.. చాలా అస్పష్టమైన హామీ ఇచ్చారు. గతంలో నవరత్నాల్లో భాగంగా… రెండు వేల రూపాయుల చేస్తామని ప్రకటించారు. కానీ టీడీపీ ప్రభుత్వం దాన్ని అమలు చేసేసింది. దాంతో.. కొత్తగా మూడు వేలు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. కానీ ఈ హామీ విషయంలో.. చాలా తిరకాసు పెట్టే ప్రయత్నం చేశారు. గెలిచిన వెంటనే.. పెన్షన్ మూడు వేలు ఇస్తామని చెప్పడం లేదు. మూడు వేల వరకూ పెంచుకుంటూ పోతామని… డొంక తిరుగుడుగా చెప్పుకొచ్చారు. ఎప్పుడు , ఎలా పెంచుకుంటూ పోతారనేదానిపై క్లారిటీ లేదు. కేవలం మూడు వేల రూపాయలు అనే మాటను… ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు పొందితే చాలన్నట్లుగా.. హామీ ఉంది. మరో టీడీపీ ఇప్పటికే పెంచిన రెండు వేల పెన్షన్‌ను అమలు చేస్తోంది. మూడు వేలు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు కూడా. పెన్షన్ల వయసును.. రెండు పార్టీలు.. అరవై ఐదు నుంచి అరవైకి తగ్గిస్తామని ప్రకటించారు. వికలాంగుల పెన్షన్ మూడు వేలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. ఇది ఇప్పటికే మూడు వేల ఐదు వందలు చొప్పిన ఏపీ ప్రభుత్వం ఇస్తోంది. రెండు చేతులు లేని వారికి పదివేలు ఇస్తోంది ప్రభుత్వం. సామాజిక పెన్షన్ల విషయంలోనూ.. వైసీపీ హామీ అస్పష్టంగానే ఉంది. ప్రజలను మభ్యపెట్టేలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది…
ఇళ్ల రుణమాఫీ విషయంలోనూ పచ్చి మోసం చేయబోతున్న జగన్..!
ఇళ్ల విషయంలో.. జగన్మోహన్ రెడ్డి మరో భారీ గ్యాంబ్లింగ్‌కు పాల్పడ్డారు. ఇళ్ల లబ్దిదారులు… నెలవారీ కిస్తీ కట్టడం చాలా ఇబ్బందికరమని.. తాను వస్తే.. మొత్తం ఈఎంఐలు కట్టే అవసరం ఉండదని.. రుణాలన్నీ మాఫీ చేస్తానని ఘనంగా జగన్ చెప్పేవారు. కానీ తీరా మేనిఫెస్టో దగ్గరకు వచ్చే సరికి.. పాతిక లక్షల ఇళ్లు కట్టిస్తామని చెప్పి.. కావాలంటే.. ఆ ఇళ్లు లోన్లు పెట్టుకునేలా బ్యాంకులతో మాట్లాడతామని హామీ ఇచ్చారు. అంతే కానీ… రుణాల మాఫీ సహా.. ఇతర అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదు. ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఇరవై ఏడు లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. అందులో పన్నెండు లక్షల ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. మరో పదిహేను లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. అదే సమయంలో.. పాత, కొత్త ఇళ్ల రుణాలన్నింటినీ మాఫీ చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. కానీ.. జగన్ మాత్రం.. ప్రచారసభల్లో అలా చెప్పి చివరికి మేనిఫెస్టోలో మాత్రం.. మ..మ అనిపించారు. పట్టణ గృహనిర్మాణం అనే మరో కాలంలో… మూడు వేలు ఈఎంఐ కట్టకుండా రద్దు చేస్తామని చెప్పారు. విడిగా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో… వైసీపి మేనిఫెస్టో క్లారిటీ ఇవ్వలేదు.
డ్వాక్రా మహిళలంటే జగన్‌కి అంత అలుసా ..?
డ్వాక్రా రుణాల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో.. జిమ్మిక్ చేసింది. పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేస్తామని చెబుతున్నారు కానీ.. ఆ డబ్బు.. బ్యాంకులకు కడతామని చెప్పడం లేదు. నాలుగు దఫాలుగా… వారి చేతికే ఇస్తామంటున్నారు. అంటే.. ఇప్పుడు… ప్రభుత్వం కూడా.. అదే చేస్తోంది. డ్వాక్రా రుణాల మాఫీకి సాంకేతికంగా.. ఇబ్బందులు ఎదురవుతున్నాయన్న కారణంగా.. పుసుపు- కుంకుమ పథకం పేరుతో… నేరుగా…డ్వాక్రా మహిళలకు … నిధులు ఇస్తోంది ప్రభుత్వం. దాన్నే రుణమాఫీ పేరుతో.. జగన్ ప్రచారం చేస్తున్నారు. అంటే.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఇస్తున్నట్లుగానే.. జగన్ ఇస్తానని చెబుతున్నారు. ఆ మొత్తం ఎంత ఉంటుందన్న విషయంపై మాత్రం క్లారిటీగా చెప్పలేదు. యాభై వేల వరకూ ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో కోటి మంది డ్వాక్రా మహిళలు ఉన్నారు. ఒక్కొక్కరికి యాభై వేలు రుణమాఫీ చేస్తే ఏడాదికి… యాభై వేల కోట్లు కావాల్సి ఉంటుంది. ఇది కాకుండా.. వైఎస్సార్ చేయూత అనే పథకం ద్వారా ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు 75వేల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. మొదటి ఏడాది అన్నారు .. తర్వాత ఇస్తారో లేదో కానీ.. మొదటి ఏడాది ఇవ్వడానికే.. మరో 40 నుంచి 50 వేల కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా. ఇందులో.. డ్వాక్రా మహిళలను మినహాయిస్తారేమో కానీ.. ఆ విషయం మేనిఫెస్టోలో చెప్పలేదు. మొత్తంగా ఏడాదికి డ్వాక్రా మహిళలకు లక్ష కోట్లు ఇస్తానని జగన్ చెబుతున్నారు. అది సాధ్యమేనా..?
నిరుద్యోగ భృతి సహా అనేక పథకాలు గల్లంతు..!
ఇక తెలుగుదేశం పార్టీ అమలులోకి తీసుకు వచ్చిన నిరుద్యోగభృతి ప్రస్తావన..వైసీపీ మేనిఫెస్టోలో లేదు. అంటే.. ఆ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి .. గెలిస్తే.. ఇక కొనసాగించరని అర్థం. ఇప్పటికీ.. ప్రభుత్వం రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తోంది. దాన్ని మూడు వేలు చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం.. లో మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు. పేదవారు అనే అర్హత ట్యాగ్ తగిలించారు. పాదయాత్రలో తనకేదురైన అనుభవాలు, ప్రజలకిచ్చిన హామీలతోపాటు నవరత్నాల్లో చెప్పిన అంశాలన్నింటినీ మేనిఫెస్టోలో పొందుపర్చడం మినహా, కొత్తగా చెప్పిన అంశం మాత్రం కనిపించలేదు. ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక పథకాల గురించి కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. మొత్తంగా జగన్ మేనిఫెస్టో.. పచ్చి మోసానికి పద్దతైన సాక్ష్యంలా కనిపిస్తోంది.