మేనిఫెస్టో వచ్చేసింది, ఎన్నికలకు మూడురోజులే గడువుంది, ఎన్నికల ప్రచారపర్వం కూడా ముగింపు దశకు చేరుకుంది. ఈ దశలో, ఏ రాజకీయ పార్టీ ప్రచారమైనా ఎలా ఉండాలి..? తాము అనుకున్నవి ప్రజలకు వివరించేశామనీ, తామే అధికారంలోకి వస్తే ఎలా ఉంటుందో అనే స్పష్టమైన అవగాహనను ప్రజలకు ఇచ్చేశామన్నట్టుగా ఉండాలి. కానీ, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి… ఇంకా చర్చించాల్సింది ఏదో మిగిలిపోయిందన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆదివారం నాడు తూర్పు గోదావరి జిల్లా కోరుకొండలో జగన్ ప్రచారం చేశారు.
మోసపూరితమైన మేనిఫెస్టో తయారు చేసుకుని, మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ చంద్రబాబు నెరవేర్చలేదని విమర్శించారు. టీడీపీ పాలన మీద చర్చ జరగకుండా రోజుకో అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చి, ప్రజలను డైవర్ట్ చేస్తున్నారన్నారు. చంద్రబాబు నాయుడు పాలనపై చర్చ జరిగితే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా రావని జగన్ వ్యాఖ్యానించారు. పోలవరం పూర్తి కాలేదనీ, రైతు రుణమాఫీ జరగలేదనీ, డ్వాక్రా మహిళలకు న్యాయం చెయ్యలేకపోయారనీ… ఇలా రొటీన్ గా ఎప్పుడూ చేసే విమర్శలు యథావిధిగా చేశారు.
టీడీపీ పాలన మీద చర్చ జరిగితే, ఆ పార్టీకి డిపాజిట్లు రావని జగన్ ఇప్పుడు చెబుతుంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఇన్నాళ్లూ ఆ చర్చను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రతిపక్షంగా విఫలమయ్యామని ఆయనే ఒప్పుకుంటూ ఉన్నట్టేనా? ఇన్నాళ్లూ తాను చేస్తున్న విమర్శలు ప్రజల్లో ఎలాంటి చర్చకూ ఉపయోగపడలేదని చెప్తున్నట్టా..? ‘చర్చ జరిగితే’ అని ఇప్పుడు చెప్తుంటే.. ఆ చర్చకు సమయం ఎక్కడుంది? ఈ రకంగా జగన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వస్తోందంటే… ప్రతిపక్ష పార్టీగా వారి బాధ్యతను గడచిన ఐదేళ్లూ సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్లనే. అసెంబ్లీకి వెళ్లి, ప్రభుత్వం తీరుపై అక్కడే చర్చించి ఉంటే… ఇంకా చర్చ జరగాలన్న అభిప్రాయం వారికి కూడా ఉండేది కాదు కదా. సమస్యలను ప్రజల్లోనే చర్చిస్తామంటూ అసెంబ్లీకి వైకాపా ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టేసి మరీ పర్యటించారు. అంటే, పాదయాత్రలో ఆ చర్చను ప్రజల్లో పెట్టడంలో వైఫల్యం చెందినట్టే కదా.