ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పార్టీలు భారీ హామీలు ప్రకటించాయి. అన్నీ ఉచిత పథకాల హవానే. ముఖ్యంగా… ప్రతీ ఇంటికి నగదు బదిలీ… ప్రతీ అంశంలో నగదు బదిలీ పథకాలు ఉన్నాయి. పిల్లలను బడికి పంపితే డబ్బులు.. రోగం వస్తే డబ్బులు… ఇరవై ఏళ్లకే పెన్షన్లు.. ఇలా.. అనేక హామీలు ఉన్నాయి. వీటన్నింటికి… బడ్జెట్ సరిపోయే అవకాశం లేదు. ఇప్పటికే అప్పులు తెచ్చి కొన్ని పథకాలను అమలు చేస్తున్నారు. అదేం పద్దతని ప్రశ్నిస్తే.. ఎవరు అప్పులు చేయడం లేదని ఎదురు ప్రశ్నిస్తున్నారు. అప్పులు చేసి అమలు చేసే సంక్షేమంతో రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందా..?
అప్పులు చేసి సంపద పెంచాలి కానీ.. పంచకూడదు..!
అప్పు చేయడం తప్పు కాదు. ప్రతీ రాష్ట్రం అప్పు చేస్తుంది. కానీ ఆ అప్పును ఎలా ఉపయోగిస్తున్నాయన్నదే కీలకం. అప్పులు చేసి సంక్షేమ పథకాలకు పంపిణీ చేస్తే ప్రయోజనం ఉంటుంది..? అప్పుల భారం పెరుగుతుంది. కానీ అప్పు చేసి సంపద సృష్టిస్తే.. దాని మీద వచ్చే సంపదతో అప్పు తీర్చవచ్చు. ఇప్పుడు మనం అప్పు తీసుకుని కారు కొనుక్కుని… తిరిగితే.. దాని వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. ఆదాయం రాదు. కానీ.. అప్పు తీసుకుని.. ఆటో కొనుక్కోవడం వల్లనో… వ్యాపారం చేసుకోవడం వల్లనో.. ఆదాయం వస్తుంది. ఆ అప్పు పెట్టుబడిగా ఉంటుంది. అందువల్ల… అప్పు చేసే కెపాసిటీ ఎంత అనేది కూడా ముఖ్యం. యాభై వేల రూపాయల ఆదాయం ఉంటే.. లక్ష రూపాయల ఈఎంఐ కట్టేలా అప్పులు చేయలేం కదా..?. ఏ వడ్డీకి చేశారన్నది కూడా మరో పాయింట్. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు.. ఇప్పుడు బడ్జెట్లో అత్యధిక భాగం… సంక్షేమంగా చెప్పబడుతున్న .. జనాకర్షక పథకాలకు ఖర్చు పెట్టేస్తున్నారు. సాధారణ అభివృద్ధి పనులకు కూడా నిధులు ఉంచుకోవడం లేదు. ఇది వరకు బడ్జెట్లో… ప్రాజెక్టులు, రోడ్లు.. ఇతర మౌలిక సదుపాయల కోసం… బడ్జెట్లో నిధులు కేటాయించేవారు. కానీ ఇప్పుడు అప్పులు చేస్తున్నారు. ఏ ప్రాజెక్ట్ అయినా రుణం మీదనే నడుస్తోంది.
అవసరం అయిన వారికే పథకాలు అందాలి ..!
ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీలు పోటీ పడి మరీ… ప్రజాకర్షక పథకాలు ప్రవేశపెట్టాయి. అందులో ఒకటి.. పిల్లల్ని బడికి పంపిస్తే..డబ్బులివ్వడం.. వైసీపీ పదిహేను వేలు.. టీడీపీ పద్దెనిమిది వేలు ఇస్తామని.. మేనిఫెస్టోలో ప్రకటించాయి. వైసీపీ అమ్మ ఒడి, టీడీపీ అమ్మకు వందనం అంటున్నారు. బడికి పంపుతారు సరే… మరి చదువులు సరిగ్గా చెబుతున్నారా..?. పిల్లలకు మెరుగైన విద్య అందించే స్కూళ్లను తయారు చేసి.. ఎవరైనా పిల్లలు… స్కూళ్లకు పంపకపోతే.. ఆలోచించాలి. ఇలాంటి పథకం అందరికీ అవసరం లేదు. ఆర్థిక పరిస్థితుల వల్ల బడికి పంపలేని కుటుంబాలకు.. కటిక పేదరికం ఉన్న వారికి.. ఈ పథకం అమలు చేయాలి. అంతే కానీ.. యూనివర్శల్గా అందరికీ.. వర్తింప చేస్తామంటే… అది సాధ్యమయ్యే పని కాదు. ఎవరికి ఏమి చేయాలి.. అనేదానిపై అంచనా ఉండాలి.. ! తల్లిదండ్రులు కోరుకునేది డబ్బులు కాదు… మంచి చదువు. ప్రైవేటు స్కూళ్లకు.. మంచి చదువు అందుతుందనే ఉద్దేశంతోనే… 40వేల వరకూ కట్టి.. పంపుతున్నారు. గవర్నమెంట్ స్కూళ్లలోనే… ఈ చదువు లభిస్తుందనే భరోసా ఇస్తే… ప్రజలు … ఖర్చు లేకుండా ప్రభుత్వ స్కూళ్లకే పంపిస్తారు.
స్కూళ్లు, హాస్పిటల్స్లో పరిస్థితి మెరుగు పరిస్తే డబ్బులివ్వాల్సిన అవసరం ఏముంది..?
ముందుగా బడిని బాగు చేయాలి. పిల్లలకు చక్కని చదువు చెప్పేలా పరిస్థితులు మార్చాలి. ముందు దానికి ప్రయారిటీ ఇవ్వాలి. పిల్లలు ఓటర్లు కాదు కాబట్టి.. వారి తల్లిదండ్రుల ఓట్లను టార్గెట్ చేసి ఈ పథకాలు ప్రవేశ పెడుతున్నారు. ఇప్పుడు ఆస్పత్రిలో ప్రసవిస్తే.. డబ్బులు ఇస్తున్నారు. కిట్లు ఇస్తున్నారు. కానీ ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపడకపోతే ఎలా..? నిన్నటికి నిన్న హైదరాబాద్ లో ఓ ఆస్పత్రి ఎదుట… ఓ మహిళ ప్రసవించింది. ఆస్పత్రిలో చేర్చుకోరు.. చేర్చుకున్నా.. సౌకర్యాలు ఉండవు. ఇలాంటి పరిస్థితులు పెట్టుకుని… తల్లులకు డబ్బులిస్తాం అంటే.. ఎవరైనా వచ్చి చేరుతారా..? అందుకే.. మందుగా చేయాల్సింది డబ్బుల పంపిణీ కాదు.. ఆయా వ్యవస్థలను మెరుగుపర్చడం.