కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తన పాస్ పోర్ట్ మరిచిపోవడంతో దాని కోసం ఎదురుచూస్తూ నిన్న చెన్నై విమానాశ్రయంలో చాలా సేపు కూర్చోవలసి వచ్చింది. ఆయన నటిస్తున్న ‘కబాలి’ సినిమా షూటింగ్ కోసం కౌలాలంపూర్ కి నిన్న బయలుదేరినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ వ్యవహారాలను చూసే ఆయన మేనేజర్ రజనీకాంత్ ఇంటి నుండి పాస్ పోర్ట్ తెచ్చిఇచ్చిన తరువాత మధ్యాహ్నం విమానంలో కౌలాలంపూర్ వెళ్లిపోయారని విమాశ్రయఅధికారులు తెలిపారు. కానీ ఆ మేనేజర్ దీనిని ఖండించారు.
“సాధారణంగా అటువంటి ప్రముఖులు విదేశాలకు వెళుతున్నపుడు మేము వారి టికెట్, పాస్ పోర్ట్, వీసా వంటివన్నీ సరిచూసుకొని, సదరు ప్రముఖుల కంటే చాలా ముందుగానే విమానాశ్రయం వద్దకు చేరుకొని వారి కోసం ఎదురు చూస్తుంటాము. కానీ నిన్న రజనీ కాంత్ మాకంటే కొంచెం ముందుగా విమానాశ్రయం చేరుకోవడంతో ఈ విధంగా జరిగడంతో ఆయన పాస్ పోర్ట్ మరిచిపోయి విమానాశ్రయానికి వచ్చేసారని మీడియాలో వార్తలు వచ్చేసాయి. మేము ఆయన ఇంటి నుండి టికెట్, పాస్ పోర్ట్, వ్యక్తిగత సామాను వంటివన్నీ సకాలంలోనే తీసుకువచ్చి అందించి ఆయనను విమానం ఎక్కించి పంపాము,” అని ఆయన తెలిపారు.
అవ్వ పేరే బామ్మ…బామ్మ పేరే అవ్వ అన్నట్లుగా ఏదయితేనేమి రజనికాంత్ విమానాశ్రయం చేరుకోనేసరికి ఆయన చేతిలో పాస్ పోర్ట్ లేదు. కనుక ఎదురు చూసారు. అవి రాగానే విమానం ఎక్కి వెళ్ళిపోయారు. ఆయన ప్రముఖుడు గాబట్టి ఈ విషయం మీడియాలోకి వచ్చింది అంతే!