చిత్ర సీమలో ఎవరికీ అర్ధం కాని, ఎవరి అంచనాలకూ అందని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడు ఎలాంటి స్టెప్ వేస్తాడో ఎవరూ ఊహించలేం. ఎలాంటి అడుగు వేసినా, అది తనకు అనుకూలంగా మలచుకోవడం లో వర్మని కొట్టే వాళ్ళే ఎవరూ లేరు. దర్శకుడిగా అడుగు పెట్టి, నిర్మాతగా మారి అప్పుడప్పుడు పాటలు రాసి, పాడి… రకరకాల అవతారాలు ఎత్తాడు. ఇప్పడు నటుడిగా మారి పోయాడు. కోబ్రా సినిమాతో తెరపై కూడా నటించడానికి సిద్ధమయ్యాడు. వర్మ లో ఓ నటుడు వున్నాడా? లేదా ? తన పాత్రకి ఎంతవరకూ న్యాయం చేయగలడు ? అనేది తరువాతి సంగతి. ఈ సారి ఏం మాయ చేస్తాడో చూడాలని వర్మ భక్తులు ఎదురు చూస్తుంటే… వర్మ ఇలా కూడా వదిలి పెట్టడా? అని మరికొంతమంది సెటైర్లు వేసుకుంటున్నారు.
వర్మ ఓ గొప్ప టెక్నీషియన్. ఆ విషయం లో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలూ లేవు. ఎప్పుడైతే వర్మకి పబ్లిసిటీ పైనా, ఇతర వ్యవహారాలపైనా మోజు ఎక్కువయ్యిందో, అప్పుడే తనలోని దర్శకుడూ మరుగున పడిపోవడం మొదలెట్టాడు. ఇది వరకు వర్మ ఇంటర్వ్యూ కోసం పడిగాపులు కాసేవారు మీడియా జనాలు. అలాంటిది ఐన దానికీ కానీ దానికీ వర్మ మీడియా ముందుకు వచ్చి బాగా చులకన ఐపోయాడు. మర్మ మాటలు, చేతలు, కామెంట్లూ ఇప్పుడు బోర్ కొట్టడం మొదలెట్టాయి. తన సినిమాల్లో వాయిస్ ఓవర్లతో ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఈ మధ్య కాలంలో కో కొల్లలు. ఇప్పుడు కొత్తగా నటన అనే పురుగు కుట్టింది. వర్మ ఎప్పుడు తను జనాలకు బోర్ కొడుతున్నానా లేదా అనే విషయాలు ఆలోచించడు. తనకు తాను బోర్ కొట్ట కుండా చూసుకుంటాడు. అందులో భాగమే ఈ కొత్త కోణం. ఇది కొత్త కొనమా లేదా పైత్యమా అనేది తేలాలంటే కోబ్రా బయటకి రావాల్సిందే. కాకపోతే ఒకటి. వర్మ ఈ ఒక్క సినిమాతో నే ఆపేసే రకం కాదు. తనలోనూ ఓ నటుడు వున్నాడని జనం ఒప్పుకునే వరకూ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. మనం చూసినా చూడకపోయినా. దీనికి మాత్రం మనం ఫిక్స్ ఐపోవాల్సిందే.